ఎమర్జెన్సీ మార్షల్​లా ఎఫెక్ట్ .. యూన్ సుక్ యోల్ అభిశంసన

  • సౌత్ కొరియా ప్రెసిడెంట్ గా ప్రధాని హన్ డక్ సూకు తాత్కాలిక బాధ్యతలు  

సియోల్​:  దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఎమర్జెన్సీ మార్షల్​ లా విధించేందుకు ప్రయత్నించిన సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ అభిశంసనకు గురయ్యారు. శనివారం నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడి తొలగింపు అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 300 మంది చట్టసభ్యుల్లో తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటు వేశారు. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ కోర్టుకు పంపిస్తారు. యూన్ భవిష్యత్తుపై చర్చించి.. పదవి నుంచి తొలగించాలా, అధికారాలు తగ్గించి కొనసాగించాలా అనేది 180 రోజుల్లోపు కోర్టు తన తీర్పును వెల్లడిస్తుంది. 

కోర్టు ఆయన్ను తొలగిస్తే 60 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి హన్ డక్- సూ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అభిశంసన జరుగుతున్నంతసేపు సియోల్‌‌లోని పార్లమెంట్ బిల్డింగ్ ఎదుట వేలాది మంది బ్యానర్లు ఊపుతూ, యూన్‌‌ను తొలగించాలని నినాదాలు చేశారు. అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన వార్త తెలియగానే నిరసనకారులు, దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 

మార్షల్​లాతో పదవికి ఎసరు

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ సౌత్​కొరియా ప్రెసిడెంట్​యూన్​ డిసెంబర్ 3న అర్ధరాత్రి ఎమర్జెన్సీ మార్షల్​లా విధించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మార్షల్​లాను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే యూన్ మార్షల్ లాను ఎత్తేశారు. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. అయితే అధికార పీపుల్స్​పవర్ పార్టీ వ్యతిరేకించడంతో ఆ గండం తప్పింది. అయితే ప్రతిపక్షాలు శనివారం తాజాగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.