సౌత్ కొరియాలో సైనిక పాలన.. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ ఆదేశాలు

సియోల్: సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 'ఎమర్జెన్సీ మార్షల్ లా(సైనిక పాలన)' విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.  "దేశ పార్లమెంటును ప్రతిపక్షాలే కంట్రోల్ చేస్తున్నాయి. దేశ బడ్జెట్​కు విలువ లేకుండా చేశాయి. నిధులను తగ్గించి న్యాయ, పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఉత్తర కొరియా పట్ల సానుభూతితో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయి. తద్వారా సౌత్ కొరియా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నాయి. అందుకే 'ఎమర్జెన్సీ మార్షల్ లా' అమలు చేయాల్సి వస్తున్నది. దీనిద్వారా వీలైనంత త్వరగా దేశ వ్యతిరేక శక్తులతోపాటు నార్త్  కొరియా అనుకూల శక్తులనూ నిర్మూలిస్తాను. రాజ్యాంగంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

దేశాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తాను" అని యూన్ పేర్కొన్నారు. 'ఎమర్జెన్సీ మార్షల్ లా' అమలుతో సైనికులకు అపరిమిత అధికారం ఉంటుంది. ప్రజల హక్కులకు చట్టపరమైన రక్షణ నిలిచిపోతుంది. కొరియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 మార్షల్ లా డిక్లరేషన్‌‌కు అనుమతిస్తున్నది. అయితే, యూన్ నిర్ణయాన్ని  ప్రతిపక్షాలు ఖండించాయి.