- నేడు సౌత్ కొరియా పార్లమెంట్ లో ఓటేయనున్న ఎంపీలు
- రూలింగ్ పార్టీలోనూ వ్యతిరేకత.. యూన్ తొలగింపు ఖాయం
సియోల్: సౌత్ కొరియాలో మార్షల్ లా ద్వారా అధికార, ప్రతిపక్ష నేతలను కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు విఫలయత్నం చేసిన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసనకు రంగం సిద్ధమైంది. శనివారం సౌత్ కొరియన్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడిని తొలగించేందుకు అభిశంసన తీర్మానంపై ఓటింగ్ కు ఇటు ప్రతిపక్షాలు, అటు అధికార పక్షం కూడా సిద్ధమయ్యాయి. అధికారంలో ఉన్న తన సొంత పార్టీ(పీపుల్ పవర్ పార్టీ=పీపీపీ)లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉండటంతో యూన్ ను పదవి నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది.
పార్లమెంట్ ను అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, శత్రుదేశం నార్త్ కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయంటూ యూన్ సుక్ యోల్ మంగళవారం రాత్రి దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు. అయితే, మార్షల్ లా విధించడాన్ని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతోపాటు అధికార పక్షం నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రాత్రికి రాత్రే పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్ చేశారు.
సౌత్ కొరియా పార్లమెంట్ లో మొత్తం 300 సీట్లు ఉండగా, ప్రస్తుతం అధికార పీపుల్ పవర్ పార్టీ(పీపీపీ)కి 108 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలోని అన్ని పార్టీలకు కలిపి 192 మంది ఎంపీలు ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఓటింగ్ లో అధికార పక్షంలోని 18 మంది సభ్యులు సైతం ప్రతిపక్షాల వైపు మొగ్గారు. అనంతరం బుధవారం ఉదయం నుంచీ రాజధాని సియోల్ సహా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. యూన్ సుక్ యోల్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో ప్రతిపక్షంతోపాటు అధికార పీపీపీ కూడా యూన్ ను గద్దె దింపేందుకు సిద్ధమైంది.
వరుస తప్పిదాలతో భారీ మూల్యం
సౌత్ కొరియాకు 2022 మే నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న యూన్ సుక్ యోల్ వరుస వివాదాలు, తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితిని తెచ్చుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా మార్షల్ లాతో రాజకీయ నేతలను కట్టడి చేసే యత్నంతో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయే ప్రమాదంలో పడిందని అంటున్నారు. అయితే, యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ రూ. 1.90 లక్షల ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ను చోయ్ జేయంగ్ అనే పాస్టర్ నుంచి లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. రెండేండ్ల క్రితం నాటి ఈ ఘటనను పాస్టర్ తన వాచ్ కెమెరాతో రికార్డ్ చేయగా.. ఆ వీడియో గత ఏడాది నవంబర్ లో బయటకు రావడంతో సంచలనం రేపింది.
దీనిపై దర్యాప్తు జరిగినా.. ఆ బ్యాగును కిమ్ కియోన్ లంచంగానే తీసుకున్నారనేందుకు ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ధరలను ప్రభావితం చేసేందుకు, ఇన్ ఫ్లేషన్ పెంచేందుకూ ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఏడాది మొదట్లో దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోగా.. యూన్ సుక్ యోల్ ఆ సమస్యను తేలిగ్గా తీసిపారేశారు. మార్కెట్ లో ఉల్లిగడ్డలను గవర్నమెంట్ సబ్సిడీతో సరసమైన ధరకే అందిస్తోందని ఆయన కామెంట్ చేయడం దుమారం రేపింది. తాజాగా మార్షల్ లాతో ఆయన పెను దుమారం రేపడంతో అభిశంసనతో పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.