బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!

  • అక్రమ మైనింగ్ కోసం వెళ్లినవారిపై  సౌతాఫ్రికా కఠిన చర్యలు 
  • తిండి, నీళ్లు లేక గనిలోనే మైనర్ల అవస్థలు

కేప్ టౌన్:  అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్లిన 4వేల మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు గనిలో ఉండిపోయిన వారికి ఎట్టిపరిస్థితుల్లో సాయం చేయబోమని తెలిపింది. వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసేసి నిత్యావసరాలను అందించకుండా చర్యలు చేపట్టింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మూసేసిన బంగారు గనిలోకి దాదాపుగా 4వేల మంది మైనర్లు అక్రమంగా లోపలికి వెళ్లారు. మిగిలిన బంగారాన్ని తవ్వాలన్న ఆశతో గని లోపలికి ప్రవేశించి అందులోనే ఉండిపోయారు. 

ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. గని ద్వారాలు మూసేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం, నిత్యావసరాలు అందించకుండా చర్యలు చేపట్టింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వారు బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ‘క్లోజ్ ది హోల్’ ఆపరేషన్ లాంచ్ చేసింది. గని బయట భారీగా సిబ్బందిని మోహరించింది. ‘‘ దాదాపు 4వేల మంది మైనర్లు గని లోపల ఉండిపోయారు. కొద్ది రోజుల క్రితం వివిధ గనుల వద్ద వందల సంఖ్యలో మైనర్లు కనిపించారు.

 అందులో ఉన్న వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యారు. బయటకు వచ్చే వారిని అరెస్టు చేసేందుకు భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించాం”అని ఒక పోలీసాధికారి తెలిపారు. అక్రమంగా గనిలోకి వెళ్లిన మైనర్లకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయదని కేబినెట్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. నేరస్తులను కాపాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పారు. ఇటువంటి ఘటనలను అడ్డుకునేందుకు ఈ చర్యలు తప్పవని వివరించారు. వారు బయటకు రాగానే విచారిస్తామని వెల్లడించారు.