నూనె పోసి వండటమే కాదు, కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పిండినా పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా.. కూరగాయలను చిన్న చిన్న ముక్కలు కోసి వాటిలో ఉండే నీటితోనే వండాలి. నూనె వాడకుండా మజ్జిగలో ఉడకబెట్టి కూడా వేపుళ్లు చేసుకోవచ్చు.. దానివల్ల పోషకాలు బయటకు పోవు. నూనె ఉండదు కాబట్టి బరువు కూడా సులువుగా తగ్గుతారు. అవి ఇలా చేయొచ్చు..
పుల్ల మజ్జిగతో కాకరకాయ ఫ్రై..
కావాల్సినవి
కాకరకాయ ముక్కలు: ఒక కప్పు,
పుల్ల మజ్జిగ: ఒక కప్పు,
నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి: నాలుగు,
కర్జూరం తరుగు: అర కప్పు,
పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు
క్యాబేజీ తురుము: అర కప్పు,
పచ్చిశెనగ పప్పు: ఒక టేబుల్ స్పూన్,
మినపప్పు: ఒక టేబుల్ స్పూన్,
కొత్తిమీర తరుగు: అర కప్పు
తయారీ..
కాకరకాయ ముక్కలు ఒక గిన్నెలో వేసి మజ్జిగ, నిమ్మరసం, పచ్చిమిర్చి కూడావేసి స్టవ్ మీద సన్నని మంటతో మెత్తగా ఉడికించాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి శెనగ పప్పు, మినపప్పు, కరివేపాకు వేసి వేగించి క్యాబేజీ తురుము వేసి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత మజ్జిగలో ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల తర్వాత కొబ్బరి తురుము, కర్జూరం ముక్కలు కలిపి మరో రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి ఐదు నిమిషాలు వేగించి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీగా 'కాకరకాయ వేపుడు' రెడీ. షుగర్ ఉన్న వాళ్లకు ఇది ఎంతో మంచిది. వారంలో రెండు మూడుసార్లు చేసుకుని తినొచ్చు.
ALSO READ :- ఏం ఐడియా : పెళ్లి సంబంధంతో బయటపడిన నకిలీ మహిళా పోలీస్ SI బాగోతం