త్వరలో రేషన్ కార్డులు..ఆరోగ్యశ్రీ కార్డులు కూడా..

  •     విధివిధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. కేబినెట్ మీటింగ్​లో నిర్ణయం 
  •     జాబ్ క్యాలెండర్​కు ఆమోదం..ఇయ్యాల అసెంబ్లీలో రిలీజ్ 
  •     గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లు మళ్లీ సిఫార్సు 
  •     మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్​​కు తాగునీళ్లు 
  •     గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.437 కోట్లు
  •     జీహెచ్ఎంసీలో 45 ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ
  •     క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్​కు 600 గజాల చొప్పున ఇంటి స్థలం 
  •     కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం 

హైదరాబాద్, వెలుగు : త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు ఖరారు చేసేందుకు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్, ఆరోగ్య శాఖల మంత్రులతో కేబినెట్ సబ్​ కమిటీ ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

దీన్ని ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్​ అలీఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి మళ్లీ ఫైల్ పంపించాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నారు. వీళ్లిద్దరి పేర్లను గతంలో పంపిస్తే, గవర్నర్ తిప్పి పంపారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్​లో సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 

మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన మీటింగ్.. దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​ మీడియాకు వెల్లడించారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా

నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్​కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి విధివిధానాలు ఖరారు చేసేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లోపు రిపోర్ట్ ఇస్తుందని చెప్పారు. ‘‘నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నది. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నది. గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తాం. 

మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీళ్లను తీసుకొచ్చి శామీర్ పేట చెరువు నింపుతం. అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలిస్తాం. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించాం. 

నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతగా ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘానికి ఆ బాధ్యతలు అప్పగించాం” అని పొంగులేటి చెప్పారు. 
విధుల్లో చనిపోయిన 

పోలీసుల వారసులకు ఉద్యోగాలు.. 

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని పొంగులేటి తెలిపారు. ప్రాజెక్టు పెండింగ్​పనుల పూర్తి కోసం రూ.437 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ‘‘గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్​ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రాజెక్టు పరిధిలో నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వల పనులు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

దాదాపు 2 వేల ఎకరాల మేర భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాం” అని వెల్లడించారు. ఇక 45 ఔటర్​గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపైనా కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రైతు భరోసా విధివిధానాలపైనా కేబినెట్ భేటీలో చర్చించామన్నారు. 

‘‘క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్​జరీన్, మహ్మద్ సిరాజ్​కు 600 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించాం. విధుల్లో చనిపోయిన డీజీ రాజీవ్​రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం” అని వెల్లడించారు. కాగా, కేరళలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన ఘటనపై కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ సంతాప తీర్మానం ఆమోదించింది.