కమలాపూర్, వెలుగు : ఆస్తిని పంచుకున్న కొడుకులు తల్లిని మాత్రం నడిరోడ్డున వదిలేశారు. దీంతో ఆమె ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డు పక్కనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన జక్కుల మల్లమ్మ(72)కు ఇద్దరు కొడుకులు. మల్లమ్మ భర్త బక్కయ్య 22 ఏండ్ల కింద చనిపోయాడు. తర్వాత రెండు ఇండ్లు, ఐదు ఎకరాల పొలాన్ని కొడుకులు కుమారస్వామి, రవి పంచుకున్నారు.
తల్లి మల్లమ్మ కోసం ఓ రేకుల షెడ్డు నిర్మించి అందులో ఆమెను ఉంచారు. బుధవారం తల్లిని చూసుకునే విషయంలో కొడుకులు, కోడళ్ల మధ్య గొడవ జరగడంతో మల్లమ్మను రేకుల షెడ్ నుంచి కూడా బయటకు పంపించివేశారు. దీంతో ఆమె బుధవారం నుంచి రోడ్డు పక్కనే ఉంటోంది. కొడుకులు, కోడళ్ల మధ్య గొడవల కారణంగా తనను బయటకి పంపించారని, తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు కోరుతోంది.