బాల్కొండ, వెలుగు : ఓ వ్యక్తి తన తండ్రి బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతడి పేరున ఉన్న ఇంటిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఏపీకి చెందిన మదంశెట్టి ప్రసాద్ 40 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లాకు వలస వచ్చి మేస్త్రీ పనిచేస్తూ బస్సాపూర్‌లో స్థిరపడ్డాడు. అతడి భార్య రజని అనారోగ్యం కారణంగా 2020లో చనిపోయింది. దీంతో ప్రసాద్ కొడుకు ఆశిబ్‌నాయుడు, కోడలు దయామణితో కలిసి ఉంటున్నాడు. ప్రసాద్ పని కోసం అప్పుడప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తూ ఆరు నెలల వరకు అక్కడే ఉంటాడు.
ఈ క్రమంలో తన తండ్రి ప్రసాద్ 2021లోనే చనిపోయాడని అతడి కొడుకు ఆశిబ్‌నాయుడు ఇటీవల ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. దాని ఆధారంగా తండ్రి పేరిట ఉన్న ఇంటిని తన భార్య దయామణి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ డాక్యుమెంట్లను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.6 లక్షల లోన్ తీసుకున్నాడు. ఇటీవల ప్రసాద్ గ్రామంలోకి రావడంతో ఇల్లు రిజిస్ట్రేషన్ టైంలో సాక్షి సంతకాలు పెట్టినవారు అతడిని గుర్తించారు. విషయం తెలుసుకున్న ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాయుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్ సృష్టించారంటూ నాయుడుపై పంచాయతీ సెక్రటరీ సుకన్య మెండోరా పోలీసులకు ఫిర్యాదు చేసింది.