అయ్యో రాజవ్వ.... కన్న తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి వెళ్లిన కొడుకు

  • కొడుకు వచ్చి తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్న వృద్ధురాలు
  • 12 రోజులు కిందటే ఆమె కొడుకులకు ఆఫీసర్ల కౌన్సెలింగ్

జగిత్యాల, వెలుగు: వృద్ధురాలైన తల్లి ఆలనా పాలన చూసుకోలేక రెండోసారి కూడా కొడుకు శ్మశానంలో వదిలి వెళ్లాడు. జగిత్యాల టౌన్ లోని చిలకవాడకు చెందిన రాజవ్వకు ముగ్గురు కొడుకులు. ఎవరూ కూడా తల్లిని పట్టించుకోవడంలేదు. ఇంట్లో ఉంచుకునేందుకు కూడా ఇష్టంపడడంలేదు. 

వృద్ధురాలు రాజవ్వ శ్మశానంలో ఉంటున్న పరిస్థితిపై గత నెల28న మోతె శ్మశాన వాటికలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు స్థానికులు సమాచారమందించడంతో డీడబ్ల్యూవో నరేశ్​వచ్చి వృద్ధురాలిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం సఖి కేంద్రానికి పంపించారు. ఆమె కొడుకులను పిలిపించి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లారు.12 రోజుల తర్వాత పెద్ద కొడుకు శ్రీనివాస్ సోమవారం మళ్లీ మోతె శ్మశాన వాటికలోని ఓ రూమ్ లో ఇప్పుడే వస్తానని చెప్పి తల్లిని వదిలి వెళ్లిపోయాడు. 

ఓ వ్యక్తి చనిపోగా మూడు రోజుల కార్యం కోసం బంధువులు శ్మశాన వాటికకు వచ్చారు. దీంతో వృద్ధురాలి ములిగే శబ్ధం వినిపించింది. గది వద్దకు వెళ్లి చూడగా కదల లేని స్థితిలో వృద్ధురాలు కనబడింది. ఆరా తీయగా తన కొడుకు శీను వదిలిపెట్టి వెళ్లాడని వాపోయింది. ఆకలి అవుతుందని ఏదైనా పెట్టాలని వృద్ధురాలు ఆడగటంతో అక్కడికి వచ్చినవారి కండ్లు చెమ్మగిల్లాయి. తమతో రావాలని ఆస్పత్రిలో వైద్యం చేయించి మరో చోట ఉంచుతామని మహిళలు అడగగా తన కొడుకు వచ్చి తీసుకెళ్తాడని రాజవ్వ అమాయకంగా చెప్పింది. శ్మశానంలో వృద్ధురాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతోంది.