వాటర్​ బోర్డులో నీటిమీటర్ల దందా

  • వినియోగదారులను దోచుకుంటున్న అధికారులు, సిబ్బంది 
  • ఫ్రీ వాటర్ స్కీంకు మీటర్ల బిగింపు తప్పనిసరి
  • ఎంప్యానల్​ అయిన కంపెనీలవే కొనాలంటూ రూల్​
  • దొరికే చోటు చెప్పకుండా బిగిస్తూ దోచుకుంటున్న సిబ్బంది  
  • పాత మీటర్లు పని  చేయట్లేదంటూ నాసిరకం మీటర్ల అంటగడుతున్నరు 

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​పరిధిలో మీటర్ల బిగింపు పేరుతో కొందరు వాటర్​బోర్డు సిబ్బంది,  అధికారులు వినియోగదారులను దోచుకుంటున్నారు. వాటర్​బోర్డు ఎంప్యానల్​ చేసుకున్న కంపెనీల మీటర్లనే బిగించుకోవాలన్న రూల్​పెట్టడంతో దాన్ని అధికారులు అనుకూలంగా వాడుకుంటున్నారు. మీటర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పకుండా తామే బిగిస్తామంటూ రెట్టింపు ధరలు తీసుకుంటున్నారు.

గ్రేటర్​లో ప్రతి వినియోగదారుడికి నెలకు 20వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేసే పథకం కొనసాగుతోంది. ఈ స్కీం వర్తించాలంటే ప్రతి ఒక్కరూ ఆధార్​ నెంబర్​ లింక్​ చేసుకోవడంతో పాటు మీటర్​ పెట్టుకోవాలి. నగరంలో సగానికి సగం నల్లాలకు మీటర్లు లేకపోవడంతో ఉచిత నీటి పథకం కోసం తప్పనిసరిగా మీటర్లు బిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. 

నాసిరకం మీటర్లతో దందా

గ్రేటర్​లో 13.80 లక్షల మంది వినియోగదారులండగా 50 శాతం మేర కనెక్షన్లకే  మీటర్లున్నాయి. ఐదేండ్ల కింద వాటర్​ బోర్డు ఆటోమేటిక్​మీటర్​ రీడింగ్​(ఏఎంఆర్​) పేరుతో కొత్త మీటర్లను ప్రయోగాత్మకంగా అమర్చాలని నిర్ణయించింది. జీఐఎస్​ సిస్టమ్ ​ద్వారా హెడ్డాఫీసు నుంచే మీటర్​రీడింగ్​ తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 40 వేల మీటర్లను కొనేలా 15 కంపెనీలను ఎంప్యానల్​ చేసుకున్నారు. వీరు ఇచ్చే మీటర్లే వినియోగదారులకు బిగిస్తారు. ఇందులో అర అంగుళం రూ. 3వేలు, ఎంఎస్​బీ, కమర్షియల్​కనెక్షన్లకు రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, కొందరు అధికారులు ఎంప్యానల్​అయిన కొన్ని కంపెనీలతో కుమ్మక్కయి నాసిరకం మీటర్లను కొన్నట్టు ఆరోపణలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇదివరకు బిగించిన దాదాపు 12,500 మీటర్లు పనిచేయడం లేదని తెలుస్తోంది. కొందరు వినియోగదారులు తమకు ఫ్రీ వాటర్​వర్తించడం లేదని  అధికారుల దృష్టికి తీసుకుపోతే, చెక్​చేసి ‘మీ మీటర్​ పని చేయడం లేదు. కొత్త మీటర్ ​పెట్టుకోవాలి’ అని మారుస్తూ దండుకుంటున్నారు. బోర్డు పరిధిలో ఎంప్యానల్​అయిన కంపెనీలు సరఫరా చేసిన  మీటర్లు పని చేయడం లేదని తెలిసినా అధికారులు కిమ్మనడం లేదు.  

కొత్త మీటర్ల పేరుతోనూ..

మీటర్లు లేనివాళ్లు, ఇది వరకు పెట్టుకున్న వాళ్ల దగ్గరకు వెళ్తున్న అధికారులు ‘మీటర్​పని చేయడం లేదని..కొత్త మీటర్​ పెట్టుకోవాలి’ అని చెబుతున్నారు. వినియోగదారుడే కొనుక్కుందామంటే ఎక్కడ దొరుకుతాయో చెప్పడం లేదు. మీటర్​అసలు ధర రూ.3 వేలు కాగా, రూ. 6 వేల వరకూ తీసుకుంటున్నారు. ఎంఎస్బీ కనెక్షన్​కు రూ. 30వేలు తీసుకోవాల్సి ఉండగా,  రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎంప్యానల్​అయిన కంపెనీలు నాసిరకం మీటర్లను బిగిస్తూ ఒకవైపు, కొత్త మీటర్ల పేరిట మరోవైపు అవినీతి కి పాల్పడుతున్నారు. సదరు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని  వినియోగదారులు కోరుతున్నారు.