సమ్మర్ అంటే... ఫ్రూట్స్, జ్యూస్, ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసే సీజన్. అందుకే సమ్మర్లో స్పెషల్ రెసిపీల్లో నాలుగైదు రకాల పండ్లు ఉండాల్సిందే. ఎండాకాలంలో.. మామిడి పండుతో మొదలుపెడితే పుచ్చకాయ, ద్రాక్ష, కర్బూజ, సపోటా.. ప్రతి పండూ ప్రత్యేకమే! ఈ పండ్లను టేస్ట్ చేసేందుకు సమ్మర్ ఎప్పుడు వస్తుందా... అని ఎదురుచూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సమ్మర్ సీజన్లో మిక్స్డ్ ఫ్రూట్స్‌తో చేసుకునే కొన్ని వెరైటీలు ఇవి...
మిక్స్డ్ ఫ్రూట్ పాయసం
కావాల్సినవి :
పాలు - ఒక లీటర్
సగ్గుబియ్యం (సాబుదాన) - పావు కప్పు
సేమ్యా - అర కప్పు
పాల పొడి - పావు కప్పు
చక్కెర - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
యాపిల్ ముక్కలు - ఒక కప్పు
నలుపు, ఆకుపచ్చ ద్రాక్షలు - ఒక్కోటి పదిహేను
అరటిపండు - ఒకటి
మామిడి పండు ముక్కలు - అర కప్పు
బాదం పప్పులు - పది
సబ్జా గింజలు - టేబుల్ స్పూన్
నీళ్లు - సరిపడా
తయారీ : సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి నీళ్లలో నాలుగ్గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు కాగబెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో వేగించిన సేమ్యా వేసి, ఉడికించాలి. సేమ్యా ఉడికాక నానబెట్టిన సగ్గుబియ్యం కలపాలి. కాసేపు అవి ఉడికాక వడకట్టాలి. ఒక గిన్నెలో పాలు పోసి అందులో పాలపొడి, చక్కెర పొడి వేసి బాగా కలపాలి. పాల మిశ్రమం బాగా మరిగాక అందులో ఉడికించిన సగ్గుబియ్యం, సేమ్యా వేయాలి. ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలో పోసి చల్లారబెట్టాలి. పూర్తిగా చల్లారాక రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. మరో చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో సబ్జా గింజలు వేసి నానబెట్టాలి. ఫ్రిజ్‌లో నుంచి తీశాక దానిపై యాపిల్, ద్రాక్ష, అరటి, మామిడి ముక్కలు వేయాలి. ఆపై నానబెట్టిన సబ్జా గింజలు, బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివరిగా కాచి చల్లార్చిన అరకప్పు పాలు ఆ మిశ్రమంలో పోసి కలపాలి. అంతే టేస్టీగా ఉండే ఈ పాయసం సమ్మర్ హీట్‌లో పొట్టను చల్లగా ఉంచే బెస్ట్ రెసిపీ.
ఫ్రూట్ కాక్టైల్
కావాల్సినవి :
క్రీమ్ - అర కప్పు
పెరుగు - ఒక కప్పు
వెనీలా ఎసెన్స్ - ఒక టీస్పూన్
రూ ఆఫ్జా - రెండు టేబుల్ స్పూన్లు
మామిడి పండు, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, యాపిల్, అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ పలుకులు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
తేనె - ఒక టేబుల్ స్పూన్
తయారీ : ఒక గిన్నెలో క్రీమ్ వేసి బాగా కలపాలి. తర్వాత పెరుగు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టాలి. ఒక గ్లాస్లో రూ ఆఫ్జా సిరప్ వేయాలి. అందులో మామిడి పండు ముక్కలు, దానిమ్మ గింజలు వేయాలి. వాటిపై మూడు టేబుల్ స్పూన్లు క్రీమ్ వేయాలి. దానిపైన తేనె, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, యాపిల్, అరటి, మామిడి పండ్ల ముక్కలు వేయాలి. మళ్లీ ఒకసారి క్రీమ్ వేయాలి. పైన డ్రై ఫ్రూట్ పలుకులు చల్లితే ఫ్రూట్ కాక్టైల్ రెడీ.
ఫ్రూట్ క్రీమ్ చాట్
కావాల్సినవి :
పాలు - అర లీటర్
చక్కెర - అర కప్పు
కార్న్ ఫ్లోర్ - మూడు టేబుల్ స్పూన్లు
కోవా - 60 గ్రాములు
క్రీమ్ - ఒక కప్పు
యాపిల్, సపోటా, ద్రాక్ష, అరటిపండు ముక్కలు - ఒక్కో కప్పు చొప్పున
అంజీర, బాదం, జీడిపప్పు, కర్జూర తరుగు, ఎండుద్రాక్ష - సరిపడా
తయారీ : గిన్నెలో పాలు కాగబెట్టాలి. పాలు మరిగేటప్పుడు చక్కెర కలపాలి. చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి కొన్ని పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాగే పాలలో పోయాలి. మిశ్రమం దగ్గర పడ్డాక దాన్ని మరో గిన్నెలోకి తీయాలి. అందులో కోవా వేసి కలపాలి. తర్వాత గిన్నె మీద మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తర్వాత ఫ్రిజ్‌లోంచి గిన్నె బయటకు తీసి అందులో క్రీమ్ కలపాలి. యాపిల్, సపోట, ద్రాక్ష, అరటిపండు ముక్కలు, అంజీర, బాదం, జీడిపప్పు, కర్జూర తరుగు, ఎండుద్రాక్ష వేసి బాగా కలపాలి. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఈ ఫ్రూట్ చాట్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు.
చాకొలెట్ - ఫ్రెష్ ఫ్రూట్ కేక్
కావాల్సినవి :
పాలు - అర లీటర్
చక్కెర - 35 గ్రాములు
అగార్ పౌడర్ లేదా కార్న్ స్టార్చ్ లేదా టాపియోకా స్టార్చ్ (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి) - 75 గ్రాములు
కివీ, కమలా పండ్లు - రెండేసి
స్ట్రాబెర్రీ - ఆరు
చాకొలెట్ కోసం :
పాలు - 650 గ్రాములు
చక్కెర - 75 గ్రాములు
అగార్ పౌడర్ - 7 గ్రాములు
డార్క్ చాకొలెట్ - 180 గ్రాములు
తయారీ : గిన్నెలో పాలు కాగబెట్టాలి. అందులో చక్కెర కలపాలి. దాంతోపాటు అగార్ పౌడర్ కూడా కలిపాక మిశ్రమాన్ని మరికాసేపు కాగబెట్టాలి. ఒక గిన్నెలో కొన్ని పాలు పోసి కివీ, స్ట్రాబెర్రీ, కమలా పండ్ల ముక్కల్ని వేయాలి. అందులో మరికొన్ని పాలు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక గిన్నెలో పాలు కాగబెట్టాలి. అందులో చక్కెర, అగార్ పౌడర్ కలపాలి. డార్క్ చాకొలెట్ని ముక్కలు చేసి పాలలో కలపాలి. చాకొలెట్ మిశ్రమం తయారయ్యాక రెడీ చేసిన కేక్ మీద పోయాలి. దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఒక గంట తర్వాత బయటకు తీసి ముక్కలు కట్ చేయాలి. పైన చాకొలెట్, లోపల ఫ్రెష్ ఫ్రూట్స్‌తో డెలిషియస్ కేక్ తినడానికి రెడీ.
మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్
కావాల్సినవి :
కివీ - ఒకటి
స్ట్రాబెర్రీలు - రెండు
మామిడి పండు ముక్కలు - అర కప్పు
యాపిల్, పైనాపిల్ ముక్కలు - ఒక్కోటి పావుకప్పు చొప్పున
ద్రాక్ష - పదిహేను
చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
అరటి పండు - ఒకటి
తయారీ : మిక్సీజార్‌లో మామిడి పండు, కివీ, స్ట్రాబెర్రీ, యాపిల్, పైనాపిల్, అరటి పండు ముక్కలు, ద్రాక్ష వేయాలి. వీటితోపాటు చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని జల్లెడలో వేసి వడకట్టాలి. ఒక గ్లాస్లో ఐస్ ముక్కలు వేయాలి. ఆ గ్లాస్లో తయారుచేసిన జ్యూస్ పోయాలి. మల్టీ విటమిన్ డ్రింక్‌గా పేరున్న ఈ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది.