కిచెన్​ తెలంగాణ : వెజిటేరియన్​ ఆమ్లెట్​& బుర్జీ

ఈ మధ్య ఫుడ్​ అవేర్​నెస్ కాస్త బాగానే పెరిగిందనొచ్చు. నాన్​ వెజ్ లేకపోతే ముద్ద దిగదు అనే వాళ్లు కూడా వెజిటేరియన్ ఫుడ్స్ వైపు చూస్తున్నారు.అందులో వెరైటీ కోరుకునే వాళ్ల కోసం టేస్టీగా, హెల్దీగా చేసుకునే రెసిపీలు ఇవి. అక్టోబర్ 1న ‘వరల్డ్ వెజిటేరియన్స్ డే’ కూడా కాబట్టి వెజిటబుల్​ స్పెషల్​ వంటకాల్లో కొన్ని వెరైటీలు ట్రై చేసేద్దాం చలో!

జాల్ ఫ్రెజీ

కావాల్సినవి: (మసాలా కోసం)నూనె: మూడు టేబుల్ స్పూన్లు; ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి: మూడు; టొమాటో: ఒకటి; అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం: ఒక్కో టీస్పూన్; పసుపు: అర టీస్పూన్;  కశ్మీరీ కారం: రెండున్నర టీస్పూన్లు; ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్; టొమాటో గుజ్జు: ఒక కప్పు; నూనె: ఒక టీస్పూన్; జీలకర్ర : అర టీస్పూన్; కాలీఫ్లవర్ (తరుగు), క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్​ (తరుగు), రెడ్, ఎల్లో బెల్ పెప్పర్, క్యాబేజీ, బటానీలు: ఒక్కోటి పావు కప్పు; గరం మసాలా, చాట్ మసాలా: ఒక్కో చిటికెడు; కసూరీ మేతీ: ఒక టీస్పూన్; నెయ్యి: ఒక టేబుల్ స్పూన్

తయారీ: నూనె వేడి చేసి ఎండు మిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, రెండు ఉల్లిగడ్డల తరుగు వేగించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల కశ్మీరీ కారం, కారం, ధనియాల పొడి వేయాలి. అందులో నీళ్లు పోసి బాగా కలపాలి. అందులో టొమాటో గుజ్జు, ఉప్పు వేసి మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతూ ఉండాలి. కావాలంటే కెచప్ వేయొచ్చు. 

ఒక పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, కాలీఫ్లవర్ ముక్కలు వేగించాలి. కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. తర్వాత అందులో కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్​ తరుగు, రెడ్, ఎల్లో బెల్ పెప్పర్, క్యాబేజీ, బటానీలు వేసి వేగించాలి. పావు టీస్పూన్ పసుపు, కశ్మీరీ కారం, గరం మసాలా, చాట్ మసాలా, కసూరీ మేతీ, నెయ్యి వేసి వేగించాలి. తరువాత వాటిని రెడీ చేసిన మసాలా మిశ్రమంలో వేసి కలపాలి. మరో పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ, టొమాటో తరుగు  వేగించాలి. దాన్ని మసాలా మిశ్రమంలో కలపాలి. పైనుంచి కొత్తిమీర తరుగుతో గార్నిష్​ చేస్తే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది.

బుర్జీ

కావాల్సినవి : శెనగపిండి: ఒక కప్పు; బియ్యప్పిండి: పావు కప్పు;
ఉప్పు: సరిపడా; బేకింగ్ సోడా: అర టీస్పూన్; నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు; జీలకర్ర : అర టీస్పూన్; అల్లం తురుము: ఒక టీస్పూన్; కరివేపాకు: కొంచెం; ఉల్లిగడ్డ తరుగు : ఒక కప్పు; పచ్చిమిర్చి: రెండు; పసుపు, గరం మసాలా, మిరియాల పొడి: ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున; టొమాటో తరుగు: ఒక కప్పు; కారం, ధనియాల పొడి: ఒక టీస్పూన్; పచ్చిమిర్చి: ఒకటి; కొత్తిమీర తరుగు: కొంచెం; నిమ్మరసం: అర టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేయాలి. ఈ మిశ్రమంలో నీళ్లు పోసి దోశపిండిలా కలపాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి జీలకర్ర వేగించాలి. తరువాత అందులో అల్లం తురుము, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలపాలి. టొమాటో తరుగు వేగాక, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. 

ఈ మిశ్రమం వేగాక శెనగపిండి మిశ్రమం పోసి అంచుల చుట్టూ నూనె వేసి మూత పెట్టాలి. పదినిమిషాలు ఉడికాక మూత తీసి గట్టిపడిన శెనగపిండి మిశ్రమాన్ని ముక్కలుగా తరిగి కలపాలి. పొడిపొడిగా అయ్యేవరకు ఉడికించాక పావుగంట వేగించాలి. దీనిపైన సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి నిమ్మరసం చల్లాలి. 

వెజిటబుల్ సాగ్

కావాల్సినవి: బీన్స్ తరుగు: ఒకటిన్నర కప్పులు; క్యారెట్: ముప్పావు కప్పు; బెంగళూరు(చౌ చౌ) వంకాయ: ఒకటి; 
ఆలుగడ్డ: ఒకటి; బటానీలు: పావు కప్పు; నీళ్లు, ఉప్పు: సరిపడా; పచ్చికొబ్బరి తురుము: అర కప్పు; పుట్నాలు: మూడు టేబుల్ స్పూన్లు; అల్లం : చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు (పెద్దవి): రెండు; లవంగాలు: మూడు; మిరియాలు: నాలుగు; దాల్చిన చెక్క: చిన్న ముక్క; పచ్చిమిర్చి : మూడు; గసగసాలు: ఒక టీస్పూన్; కొత్తిమీర: పావు కప్పు; నూనె: మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు: అర టీస్పూన్; కరివేపాకు: కొంచెం

తయారీ:  ప్రెజర్ కుక్కర్​లో బీన్స్, క్యారెట్, బెంగళూరు వంకాయ, ఆలుగడ్డ తరుగు, బటానీ, ఉప్పు వేయాలి. అందులో నీళ్లు పోయాలి. కుక్కర్​ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నీళ్లని వడకట్టి, పక్కన ఉంచాలి. మిక్సీజార్​లో అల్లం, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, గసగసాలు, పుట్నాలు, కొత్తిమీర, పచ్చికొబ్బరి తురుము వేయాలి. 

కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేగించాలి. తర్వాత రెడీ చేసిన పేస్ట్​ కలపాలి. నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అందులో ఉడికించిన వెజిటబుల్స్ వేసి కలపాలి. అందులో ఉప్పు వేసి వెజిటబుల్స్ వడకట్టాలి. కూరగాయలు ఉడికించిన నీళ్లను అందులో పోసి కలపాలి. తరువాత కొంచెంసేపు ఉడికిస్తే వెజిటబుల్ సాగ్​ తినడమే తరువాయి.

మూంగ్​ లెట్

కావాల్సినవి : పెసరపప్పు (మూంగ్ దాల్): ఒక కప్పు; పసుపు: పావు టీస్పూన్; బియ్యప్పిండి, నూనె, టొమాటో, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ తరుగు: ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు: సరిపడా; జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా: ఒక్కోటి అర టీస్పూన్; పచ్చిమిర్చి: ఒకటి; కారం: చిటికెడు; 
కొత్తిమీర: కొంచెం.

తయారీ: ఒక గిన్నెలో పెసరపప్పు వేయాలి. అందులో నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. తరువాత నానిన పప్పును మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులో బియ్యప్పిండి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. అందులో నుంచి సగానికి పైగా పిండిని మరో గిన్నెలోకి తీయాలి. ఆపై జీలకర్ర, కొత్తిమీర, టొమాటో తరుగు, పచ్చిమిర్చి, టొమాటో, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ తరుగు, బేకింగ్ సోడా వేయాలి. 

ఈ మిశ్రమంలో నీళ్లు పోసి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో మిశ్రమాన్ని అందులో పోయాలి. కారం, కొత్తిమీర చల్లి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. మూత తీసి గరిటెతో తిప్పి నాలుగు ముక్కలు చేసినట్టు కత్తితో గాటు పెట్టి మధ్యలో నెయ్యి వేయాలి. రెండు నిమిషాల తర్వాత ప్లేట్​లోకి తీస్తే మూంగ్​లెట్​ సిద్ధం. 

మిక్స్​డ్​ వెజ్ దాల్

కావాల్సినవి: కందిపప్పు లేదా పెసరపప్పు: అర కప్పు; నీళ్లు: సరిపడా; పసుపు: అర టీస్పూన్; బిర్యానీ ఆకు, ఎండు మిర్చి, చిలగడ దుంప (మొరం గడ్డ లేదా గెనుసు గడ్డ), క్యారెట్: ఒక్కొక్కటి;జీలకర్ర, అల్లం తురుము: ఒక్కో టీస్పూన్; బేబీ పొటాటో (చిన్న ఆలుగడ్డలు): పది; టొమాటో: రెండు; నూనె: ఒక టేబుల్ స్పూన్; నెయ్యి: ఒక టీస్పూన్; బటానీలు: ముప్పావు కప్పు; పాలకూర: అర కప్పు.

తయారీ : కందిపప్పు లేదా పెసరపప్పుని నూనె వేయకుండా పొడిగా రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి ఒకసారి కడగాలి. ప్రెజర్​ కుక్కర్​లో పప్పు, చిన్న ఆలుగడ్డలు, పసుపు వేయాలి. అందులో నీళ్లు పోసి మూత పెట్టి ఏడు నిమిషాలు ఉడికించాలి. పాన్​లో నూనె, నెయ్యి వేడి చేసి  బిర్యానీ ఆకు, ఎండు మిర్చి, జీలకర్ర, గెనుసు గడ్డ, క్యారెట్, బీన్స్ తరుగు, పసుపు, ఉప్పు వేసి కాసేపు వేగించాలి. 

తరువాత నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. అవి ఉడికాక అల్లం పేస్ట్ కలపాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉడికించిన పప్పు, ఆలుగడ్డలు వేయాలి. ఈ మిశ్రమంలో నీళ్లు పోసి ఉడికించాలి. బటానీ, పాలకూర, టొమాటో ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి మూడు నిమిషాలు సన్నటి సెగ మీద ఉడికిస్తే టేస్టీ మిక్స్​డ్​ వెజ్​ దాల్ రెడీ.