పరిచయం..నేను నెపోకిడ్​ కాదు : బాబిల్​ ఖాన్

‘‘నాన్న పేరు నిలబెట్టాలనే ఆలోచన బాధ్యతగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ ఆలోచనే భారం అయిపోతుంది. యాక్టర్​ కొడుకు కాబట్టి యాక్టర్ కావడం, అవకాశాలు రావడం ఈజీనే. కానీ టాలెంట్​ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం. తండ్రి వారసత్వంగా కొడుకు వచ్చేశాడు. ‘నెపో కిడ్​’ అనే కామెంట్స్ చేశారు కొందరు. ఆ కామెంట్లకు నా నటనతోనే సమాధానమిచ్చా” అంటున్నాడు బాబిల్​ ఖాన్​. ఈ అబ్బాయి బాలీవుడ్​ యాక్టర్​, నేషనల్​ అవార్డ్​ విన్నర్​ ఇర్ఫాన్​ ఖాన్​ కొడుకు​.

‘‘మాది ముంబై అనే విషయం అందరికీ తెలిసిందే. మా ఇంట్లో ఆర్ట్​, ఎమోషన్స్, స్పిరిచ్యువాలిటీ వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో పెరిగిన నేను సెన్సిటివ్​గా ఉంటా. నా ఫీలింగ్స్ గురించి మాట్లాడటం, ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పుడు ఆర్ట్​ పరంగా నేను చాలా పర్​ఫార్మెన్స్​లు ఇచ్చా. కథ చెప్పడం నాకు ఆనందాన్నిస్తుంది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నటన గురించి తెలిసింది. షేక్​స్పియర్ ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’లో ఒక మెయిన్​ రోల్ చేశా. 

అందుకు రెండునెలలు రిహార్సల్స్ చేశాం. స్టేజీ ఎక్కాక నా పర్ఫార్మెన్స్​ చాలా బాగా చేయగలిగా. తెలియకుండానే తోటి  నటుల డైలాగ్స్ ఇంప్రూవ్ చేశా. మా ప్రదర్శన చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వారు. చాలా మంచి రియాక్షన్​ వచ్చింది. అలాగని ముందుగా నేనేం ప్లాన్​ చేయలేదు. కానీ ఏదో మ్యాజిక్ దానికదే క్రియేట్ అయిపోయింది. మరో వైపు... అదే స్టూడెంట్​ లైఫ్​లో చాలా ఇబ్బందులు పడ్డా. మిగతా స్టూడెంట్స్ నన్ను వేధించేవాళ్లు. అయినా వాళ్లను నేనెన్నడూ అసహ్యించుకోలేదు. ఎందుకంటే వాళ్ల కళ్లలో నాకు బాధ కనిపించేది. ఇతరుల్ని బెదిరిస్తున్నారంటే వాళ్లు ఎంత స్ట్రగుల్​ అయి ఉంటారో కదా అనుకునేవాడ్ని. నిజానికి వాళ్లు నన్ను ఏడిపించినందుకు వాళ్లకు చాలా కృతజ్ఞుడ్ని. దానివల్లే ఇప్పుడు నేను స్ట్రాంగ్​గా ఉన్నా. నెగెటివ్​ కామెంట్స్​, సోషల్​ మీడియా ట్రోల్స్​ ఏవీ నన్ను ఎఫెక్ట్​ చేయవు.

ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలని...

చదువు పూర్తయ్యాక ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటానని చెప్పా. అప్పుడు నాన్న నాతో ‘‘ఫిల్మ్​ మేకింగ్​ నేర్చుకోవాలంటే నువ్వు పదివేల రెట్లు ఎక్కువ కష్టపడాలి. చాలా స్ట్రెస్​ ఉంటుంది. నేను అదే ఫీల్డ్​లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. నేను స్టార్​ని కాదు. యాక్టర్​ని. ఉద్యోగం చేయడానికి డిగ్రీ అవసరం. నటుడిగా మారడానికి అవసరం లేదు. పోనీ.. సినిమాల్లో లేదా నాటకాల్లో చేస్తావా?’’ అని అడిగారు. కానీ నేను చాలా స్పష్టంగా ఫిల్మ్​ మేకింగ్​ చేస్తానని చెప్పా. అలా నేను ఫిల్మ్ మేకింగ్​ కోర్స్​లో చేర్పించాడు నాన్న. 

ఆడిషన్స్​కి వెళ్తా

నేను ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు దక్కించుకుంటా. అంతేకానీ ‘నేను ఫలానా యాక్టర్ కొడుకుని, ఛాన్స్ ఇవ్వండనో లేదా ఇప్పించమనో’ ఎవరినీ అడగను. అంతెందుకు మా అమ్మకు చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక ఫోన్​ చేసి చెప్తే చాలు. కానీ, నాకలా రికమండేషన్​ల పని మీద పని దొరికించుకోవడం నచ్చదు. ఆడిషన్ ద్వారా అవకాశం వస్తేనే నాకు తృప్తి. నేను స్టార్​ కిడ్​ని కాదు. ఇర్ఫాన్ ఖాన్​, సుతాపాల​ కొడుకుని. వాళ్ల వల్ల నాకు అవకాశాలు రావడం కాదు. నా టాలెంట్​తో నేను అవకాశాల్ని తెచ్చుకోవాలి. వాటిని సద్వినియోగం చేసుకోగలగాలి. ఇర్ఫాన్​, సుతాపాల కొడుకును కాబట్టి వాళ్ల ఫ్రెండ్స్​ని కలవగలను. వాళ్ల దగ్గర పని నేర్చుకునేందుకు అదొక మంచి అవకాశం.


మొదటి సారి ఆడిషన్ పూర్తి చేశాక, ప్రొడ్యూసర్​ వచ్చి ‘నేను మీకు పెద్ద ఫ్యాన్?’ అన్నాడు. అదేంటని ఆయన్ని అడిగా. అందుకాయన ‘నువ్వు యాక్ట్​ చేసిన ఫుటేజ్ చూడగానే నువ్వు అద్భుతంగా చేశావ్​ అనిపించింది. రెండోసారి చూసినప్పుడు ఇర్ఫాన్ ఖాన్​ కొడుకు ఆడిషన్​ ఇచ్చాడంటే నమ్మలేకపోయా. మీ ఆడిషన్ చాలా బాగుంది’ అని చెప్పాడు. అలా వచ్చిన మొదటి అవకాశమే ‘ఖలా’. 2022లో అన్వితా దత్​ డైరెక్షన్​లో వచ్చిన ‘ఖలా’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చా. ‘ఖలా’లో నా నటనకు ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2017లో ‘ఖరీబ్ ఖరీబ్​ సింగిల్’​ సినిమాకి కెమెరా అసిస్టెంట్​గా పనిచేశా. 

ఇర్ఫాన్​ ఖాన్​ కొడుకుగా.. 

చిన్నప్పుడు నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. అందుకే నాకు మనుషులతో మాట్లాడటం ఇష్టం. మా బాబా (నాన్న) అందరితో చాలా బాగా మాట్లాడతారు. కానీ నాకు అలా మాట్లాడటం రాదు. అందుకే అవతలి వాళ్లు నా గురించి ఏమనుకుంటారో అని నేను జాగ్రత్తగా ఉంటా. నాన్న గురించి చెప్పాలంటే... ఆయన నిజంగా, నిర్భయంగా ఉండే వ్యక్తి. ఆన్​స్క్రీన్​లో కూడా ఆయన నటిస్తున్నట్టు కాకుండా రియల్​గానే కనిపిస్తాడు. ఆయన సినిమాలు, ఇంటర్వ్యూలు చూసి బాగా కనెక్ట్ అవుతా. నేను ఆయన కొడుకుని కావడం వల్ల నా మీద వత్తిడి ఉంటుంది. ‘మీలో ఇర్ఫాన్​ షేడ్స్ కనిపిస్తాయని చెప్పినప్పుడు గర్వంగా ఫీలవుతారా?’ అని అడుగుతారు కొందరు. నేను అలా ఎప్పుడు ఫీలవ్వలేదు. ఆయనతో పోల్చినప్పుడు మిక్స్​డ్​​ ఎమోషన్స్ ఉంటాయి. ఒక పక్క సంతోషంగా అనిపిస్తుంది. 

మరో పక్క నా స్పెషాలిటీ కూడా ఉండాలి అనిపిస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం కాస్త భారంగా ఉంటుంది. నా యాక్టింగ్ విషయంలో నేను ప్రేక్షకుల్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయకూడదు అనుకుంటా. బాబా (నాన్న) ఐడియాలజీ ప్రకారం అన్నిరకాల పాత్రలు చేయాలి. నేను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాక సెలక్ట్​ చేసుకోవడం చాలా ఈజీగా అనిపించింది. నేను అన్ని జానర్స్​ని ఎక్స్​ప్లోర్ చేయాలనుకుంటున్నా. 

నా ఫ్రెండ్​ని మిస్​ అయ్యా!

నాన్న ప్రభావం మా మీద అంతగా ఉన్నప్పటికీ మా స్కూల్ ఫంక్షన్స్​కి ఆయన ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ అమ్మ ఒక్కతే వచ్చేది. అది నాకు చాలా బాధగా అనిపించేది. అయితే నాన్న క్యాన్సర్​తో పోరాడాడు. కీమో చేయించుకునేటప్పుడు ఆయన శరీరం పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నాకు స్పష్టంగా అర్థంకాలేదు. కానీ, ఏదో చెడు జరగబోతోంది అనిపించింది. అప్పుడు నా బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎలా ఉండేయంటే... ఆయన పనిని మేం అర్థం చేసుకోవాలి. కానీ, నాకు అవసరమైనప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ స్కిట్ చేసిన రోజు ఆయన అక్కడ ఎందుకు లేడు? ఆ గిల్ట్​ని ఆయన ఫీలవ్వాలి కదా అనుకున్నా.

 ‘స్కూల్లో నేను చేసిన స్కిట్​లో అదరగొట్టేశా. కానీ, మీరు రాలేదు’ అని ఒకరోజు ఆయన్ని అడిగా. అప్పుడాయన ‘నీ గురించి నువ్వే పొగుడుకుంటావేంటి?’ అన్నాడు. ఆ మాటలకి ఫీల్ అయ్యా. కానీ, ఆయన నా రూమ్​కి వచ్చాడు. ‘సారీ’ అడిగి పక్కన కూర్చోమని అడిగాడు. నాతో స్పెండ్​ చేసే టైం మిస్​ కాకూడదు అనుకున్నాడని అర్థమైంది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన మానుంచి దూరమయ్యాడు. చివరి క్షణాల్లో వారం రోజులు ఆయన హాస్పిటల్ బెడ్ పక్కనే ఉన్నా. నా బెస్ట్​ ఫ్రెండ్​ అయిన నాన్నను చాలా మిస్​ అవుతున్నా. 

బాధతో బతకడం నేర్చుకున్నా

బాధ ఎప్పటికీ పోదు. బాధతో ఎలా బతకాలో నేర్చుకోవాలి. నేను నిన్నటి వ్యక్తిని కాదు. జరిగిన దాన్ని నేను అంగీకరించాలి. ఆ పరిస్థితులనుంచి పారిపోలేను. ప్రతిరోజూ హ్యాపీగా ఉండలేవు. అలా ఉంటే ఎగ్జైట్​మెంట్ ఏముంటుంది? బాధలోనూ థ్రిల్​ ఉంటుంది. యాక్టర్​ అనేవాళ్లు అన్ని ఎమోషన్స్​ పట్టుకోవాలి. పాజిటివ్, నెగెటివ్ ఎమోషన్స్ అనే కాన్సెప్ట్​ని నేను నమ్మను. బాధ నిన్ను నీ లోతుల్లోకి తీసుకెళ్లి దాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. ఆనందానికి అర్థాలు ఉంటాయి. కానీ, లైఫ్ మొత్తం కొన్ని ఎమోషన్స్​తోనే సాగదు. అన్నిరకాల ఎమోషన్స్​ ఉంటాయి. వాటన్నింటితో కలిసి బతకాలి.

అమ్మానాన్న..

నాన్న నాకు ఎలా బతకాలో నేర్పించాడు. వాటిని నేను అమలుచేస్తున్నా. ‘యాక్టింగ్​ నేర్చుకోవడానికి స్కూల్ అవసరంలేదు’ అని చెప్పేవాడు నాన్న. నేను నటనను నాన్న నుంచే నేర్చుకున్నా. ఆయన జీవిత పాఠాలే నా యాక్టింగ్​కి పనికొచ్చాయి. అమ్మ విషయానికొస్తే.. రోజంతా పక్కనే ఉంటుంది. ఆడవాళ్లతో ఎలా నడుచుకోవాలో చెప్పింది. అమ్మ నేర్పించిన వ్యాల్యూస్ వల్లే నేను ఈ రోజుమీ ముందు ఉన్నా.’’

ఇదీ నేను

నేను బయటకు వెళ్లినప్పుడు ఫుల్ ఎనర్జిటిక్​గా అందరితో మాట్లాడతా. ఇంట్లో మాత్రం ఎక్కువగా మాట్లాడను. పుస్తకాలు చదవడం, గిటార్ వాయించడం, మ్యూజిక్ వినడం.. ఇదే నా డైలీ రొటీన్. చిన్నప్పుడు సినిమాల ఇన్​ఫ్లుయెన్స్ బాగా పడింది. అలాగే ‘బీటిల్స్, నుస్రత్ ఫతే అలీ ఖాన్’ పాటలు విన్నా. ‘ఫుల్ మెటల్ జాకెట్, ఐస్ వైడ్ షట్’ వంటి కల్ట్ సినిమాల్ని చూశా. ప్పుడప్పుడు కవితలు కూడా రాస్తుంటా.

అవి ఉంటేనే ఓకే చేస్తా
 
కెరీర్​ ప్లానింగ్​ అనేది ఏమీ లేదు. జీవితం ఏది ఇస్తుందో అది తీసుకోవాలి అనుకుంటున్నా. సినిమాల్లో నా క్యారెక్టర్స్ విషయానికొస్తే.. ఒక ఫార్ములాకి అతుక్కుపోవడం నచ్చదు. ప్రతి సినిమా స్పెషల్​గా ఉండాలి. సినిమా లేదా క్యారెక్టర్ ‘ఓకే’ చేసేటప్పుడు కొన్ని అంశాలు గమనిస్తా. కథలో క్యారెక్టర్ ఎలా ఉంది? ఆ క్యారెక్టర్ నుంచి నేనేం నేర్చుకోవచ్చు? నా గ్రోత్​కి ఎలా ఉపయోగపడుతుంది? అనేవి చూస్తా. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి రాక్​స్టార్​ రోల్ చేయాలనే కోరిక ఉంది.