హైదరాబాద్ రాజ్యంలో తొలి తరం ప్రముఖులు వీరే

హైదరాబాద్​ రాజ్యంలో కొంత మంది నాయకులు విద్యా, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేశారు. పాఠశాలలు, సామాజిక, సంస్థలు, పత్రికలు, రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇందులో కేశవరావు కొరాట్కర్​, సురవరం ప్రతాపరెడ్డి, మందముల నరసింగరావు, మాడపాటి హనుమంతరావు ముఖ్యులు. తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి ఆద్యుడు మాడపాటి హనుమంతరావు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సాహిత్య అకాడమీ  అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత సురవరం ప్రతాపరెడ్డి. కేశవరావు కొరాట్కర్​  ఆర్య సమాజం కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు.  మందముల నరసింగరావు 1916లో తన మిత్రులతో కలిసి వామన్ నాయక్​ అధ్యక్షతన యంగ్​ మెన్​ యూనియన్​ను స్థాపించాడు.  

కేశవరావు కొరాట్కర్​

1867లో మహారాష్ట్రలోని పర్బణి జిల్లాలో జన్మించిన కేశవరావు కొరాట్కర్​ గుల్బర్గా నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. ఈయన ఆర్య సమాజం కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. 1907లో వివేకవర్ధని పాఠశాలను వామన్​రావు నాయక్​, గణపతి హార్దికర్​తో కలిసి ఏర్పాటు చేశాడు. 1915లో వామన్​రావు నాయక్​తో కలిసి హైదరాబాద్​ సోషల్​ సర్వీస్​ లీగ్​ను స్థాపించాడు. 1918లో స్థాపించిన హైదరాబాద్​ స్టేట్​ రీఫార్మ్స్​ అసోసియేషన్​కు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1920లో హైదరాబాద్​లో మరాఠీ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. ఈయన ప్రారంభించిన మరాఠీ పత్రిక రాజ హాన్స. సర్​ అలీ ఇమామ్​ దివాన్​గా ఉన్న సమయంలో కేశవరావు కొరాట్కర్ హైదరాబాద్​ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన మరణానంతరం హైదరాబాద్​లోని నారాయణగూడలో 1940, జులై 29న కేశవ మెమోరియల్​ అనే విద్యా సంస్థను స్థాపించారు. 

మందముల నరసింగరావు

1896, మార్చి 17న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన్మించాడు. తలకొండపల్లి మండలానికి చెందినవాడు. 1916లో తన మిత్రులతో కలిసి వామన్ నాయక్​ అధ్యక్షతన యంగ్​ మెన్​ యూనియన్​ను స్థాపించాడు. 1912, నవంబర్ ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించిన వారిలో ఈయన ఒకరు. 1927లో రయ్యత్​ అనే ఉర్దూ పత్రికను స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు. నిజాంను విర్శంచినందుకు ఈ పత్రికను నిషేధించారు. ఆ తర్వాత 1931లో దీనిని దినపత్రికగా ప్రారంభించారు. 1937లో జరిగిన నిజామాబాద్​ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు. 1938–42 మధ్యకాలంలో నిజాం లెజిస్లేటివ్​ కౌన్సిల్​ సభ్యులుగా ఉన్నాడు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాద్​ శాసనసభకు ఎన్నికయ్యారు. 1954లో ల్యాండ్​ కమిషన్​ చైర్మన్ గా వ్యవహరించారు. మహాత్ముడి నిర్మాణ కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తితో భారత సేవక్​ సమాజ్​ స్థాపించి దానికి అధ్యక్షుడు అయ్యాడు. 1957–62 మధ్యకాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు.  

సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణ తొలి తరం వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి ప్రతీక. 1896, మే 28న బోరవెల్లి గ్రామంలో రంగమ్మ, నారాయణరెడ్డి అనే దంపతులకు జన్మించాడు. స్వస్థలం గద్వాల జిల్లా అలంపూర్​ తాలుకాలోని ఇటికాలపాడు. ఈయన రచించిన రామాయణ రహస్యాలు సురవరం ప్రతాపరెడ్డి గ్రంథావలోకన దక్షలకూ ఆలోచనా శక్తికి, పరిశోధనా పాటవానికి నిదర్శనం. ఈయన కథా రచన తలమానికం నిరీక్ష అనే కథ. ఈయన రచించిన వింత విడాకులు అనే కథలో తెలంగాణ సామాజిక వాతావరణం కళ్ల ముందు కదలాడుతుంది. వయోజన విద్య కోసం యవజన విజ్ఞానం అనే గ్రంథాన్ని రచించాడు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ బహమతి పొందిన తొలి తెలుగు రచయిత సురవరం ప్రతాపరెడ్డి. ఇతను విజ్ఞాన వర్ధిని పరిషత్తును స్థాపించి ఎందరో రచయితలను, పరిశోధకులను తీర్చిదిద్దాడు. ఈయన 1926, మే 10న గోల్కొండ పత్రిక (అర్ధ వార పత్రిక)ను స్థాపించారు. ఇది బుధ, శనివారాల్లో వెలువడేది. 1930లో జరిగిన ఆంధ్ర మహాసభ(జోగిపేట సమావేశం)కు అధ్యక్షత వహించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తెలంగాణలో కవులు లేరన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముడుంబై వెంకటాచార్యులు ఒక పుస్తకం మీద 1934లో గోల్కొండ పత్రికలో సమీక్ష రాస్తూ నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని వ్యాఖ్య చేశారు. 

Also Read : వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలి : మాల ప్రజా సంఘాల నాయకులు

దీనికి బదులుగా గోల్కొండ కవుల సంచికలో 354 కవుల రచనలతో సురవరం ముద్రించాడు. 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్​ స్థాపనకు విశేష కృషి చేశారు. సుజాత పత్రిక సంపాదకుడిగా కూడా పనిచేశారు. 1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాద్​ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వనపర్తి నుంచి గెలిచాడు. 

రచనలు: శుద్దాంతకాంత (నవల), భక్తతుకారం (నాటకం), గ్రామజన దర్పణం, నిజాం రాష్ట్ర పాలనం, హైందవ ధర్మవీరులు, ప్రజాధికారములు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, పద్మిని, అరివీరులు (నవల), ఘజ్నవీ, ప్రేమార్పణం, హంసవీర సంభవం, ప్రతాపరెడ్డి కథలు, సురవరం కథలు, మొగలాయి కథలు, హరిశర్మో పాఖ్యానం, చంపకి భ్రమర విషాదం, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, ఉచ్చల విషాదము (నాటకం), సంఘోద్ధరణము (వ్యాసాలు), గ్రామజన దర్పణము, గ్రంథాలయోద్యమము, ప్రాథమిక సత్వములు. 

మాడపాటి హనుమంతరావు

తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ఆద్యుడు మాడపాటి హనుమంతరావు. 1914–15 మధ్యకాలంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా పనిచేశాడు. 1928లో నారాయణగూడలో ఆంధ్ర బాలికోన్నత పాఠశాలను స్థాపించారు. తెలుగు మాధ్యమాన్ని బోధనా భాషగా నిర్వహించారు. 1921, నవంబర్​ 12న హైదరాబాద్​లోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాల సభా మందిరంలో హిందూ సంఘ సంస్కరణ సభ జరిగింది. ఈ సమావేశానికి పుణె మహిళా విశ్వవిద్యాలయం స్థాపకుడు దొండేపంత్​ కార్వే అధ్యక్షత వహించారు. ఇందులో మరాఠీ, కన్నడ భాషల్లో మాట్లాడాలని, తెలుగులో ప్రసంగించరాదని హేళన చేశారు. దీంతో 1921, నవంబర్ 12న మాడపాటి నిజాం రాష్ట్ర ఆంధ్రజన సంఘాన్ని స్థాపించాడు. దీనికి కార్యదర్శిగా వ్యవహరించారు. 1953లో సిరిసిల్లలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఇది రాజకీయ సభ కాదని, తెలుగుజాతి అభ్యుదయానికి పాటుపడే సాంస్కృతిక సంఘం అని నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాడు. ఈయన ముషీరె–దక్కన్​ అనే ఉర్దూ పత్రికకు సంపాదకత్వం వహించాడు. 

ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను స్థాపించి, దాని పక్షాన ప్రాచీనాంధ్ర నగరాలు, రాజకీయ పరిజ్ఞానం, నిజాం ఆంధ్రోద్యమం వంటి పుస్తకాలను ప్రచురించాడు. 1956, నవంబర్ 4న ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్​ డి.లిట్​ను ప్రదానం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనెట్​లో శాశ్వత సభ్యులుగా కూడా పనిచేశారు. ఈయన 1951లో హైదరాబాద్​ తొలి మేయర్​గా, 1958లో ఆంధ్రప్రదేశ్​ తొలి శాసనమండలి చైర్మన్ గా పనిచేశాడు. 1965లో హైదరాబాద్​ కో ఆపరేటివ్​ యూనియన్​కు కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన రచించిన కథలు మల్లికా గుచ్ఛం అనే పేరుతో పుస్తక రూపంలో ముద్రించారు. హృదయశల్యం కథ 1912లో ఆంధ్రభారతి పత్రికలో అచ్చయ్యింది. తెలంగాణ మొదటి కథానిక హృదయ శల్యం. తెలంగాణ విమోచన చరిత్రను మాడపాటి తెలంగాణలో ఆంధ్రోద్యమం (1950) గ్రంథంగా రచించారు. భారత ప్రభుత్వం మాడపాటి హనుమంతరావును 1955లో పద్మవిభూషణ్​ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

రచనలు: హృదయ శల్యం(కథ), రాణిసారంధా, ముసలిదాని ఉసురు (కథ), ఆత్మర్పణం(కథ), తప్పు, నేనే, అగ్నిగుండం, నాడు నీ పంతం, నేను నీ పంతం, ఎవరికి, మల్ఇకా గుచ్ఛం(కథా సంపుటి), మాలతీగుచ్ఛం, రొమన్​ సామ్రాజ్యం, గారీబాల్డీ (1911 జీవిత చరిత్ర), నిజాం రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు.