హోలీ పండుగ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ పండుగకు ముందుగానే కొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలి. అప్పుడే డబ్బులు నష్టపోకుండా ఉంటారు. మరి ఏఏ వస్తువులు తీసేయాలో తెలుసుకుందాం. . .
హోలీ పండుగ కొన్ని రోజులు మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో హోలీ పండుగ జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 25న హోలీ పండుగ నిర్వహించనున్నారు. మార్చి 24 అర్ధరాత్రి హోలికా దహనం జరుపుకుంటారు. ఈ ఏడాది మీ జీవితం రంగులమయం అవ్వాలంటే వాస్తు ప్రకారం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సంతోషం, శ్రేయస్సు కోసం హోలీకి ముందు ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇది ఇంట్లోని ప్రతికూలతలను తొలగించి కుటుంబ జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. హోలీ పండుగకు ముందు కొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తొలగించడం కూడా చాలా అవసరం. లేదంటే డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు.
ఎండిన తులసి మొక్క
తులసి మొక్క లక్ష్మీదేవి ప్రతి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి మొక్క ఎప్పుడూ ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎండిపోయిన తులసి మొక్క ఉంటే హోలికా దాహనానికి ముందే దాన్ని తీసేసి ఇంట్లో పచ్చని కొత్త మొక్కని నాటండి. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది.
పగిలిన వస్తువులు ఉంచకూడదు
వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ఏవి ఇంట్లో ఉంచడం శుభప్రదం కాదు. అందుకే పగిలిన గాజు వస్తువులు, ఫోటోలు, చిత్రాలని హోలీక దహనానికి ముందే ఇంటి బయట వేసేయండి. అవి ఉంచడం వల్ల వాస్తు లోపాలకు కారణం అవుతుంది. వీటితోపాటు పగిలినా లేదా విరిగిపోయిన దేవుళ్ల విగ్రహాలు కూడా నీటిలో నిమజ్జనం చేయడం మర్చిపోవద్దు.
పాత దుస్తులు
చాలాకాలంగా ఉపయోగించకుండా ఉన్న పాత దుస్తులు లేదా చిరిగిపోయిన దుస్తులు ఇంట్లో నుంచి తీసివేయాలి. వాస్తు ప్రకారం ఇవి ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల శక్తి ఉంటుంది. అందుకే వాటిని తొలగించాలి. వేసుకోవడానికి అనువుగా ఉండే కొన్ని పాత దుస్తులు అవసరంలో ఉన్న పేదలకు ఇవ్వడం మంచిది.
పాత బూట్లు, చెప్పులు
హోలికా దహనం నిర్వహించడానికి ముందే ఇంట్లో చాలా కాలంగా నిల్వ ఉంచిన పాత బూట్లు, చెప్పులు బయటకు వేయండి. వాస్తు ప్రకారం విరిగిన, పనికిరాని బూట్లు ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాత రంగులు వాడొద్దు
చాలాసార్లు ప్రజలు తెలుసో తెలియకో గత సంవత్సరంలో మిగిలిన రంగులతో హోలీ ఆడతారు. అలా ఎప్పటికీ చేయకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల అశుభంగా భావిస్తారు. ఇంట్లోని పాత రంగులు వెంటనే తొలగించాలి. ఎందుకంటే వీటితో హోలీ ఆడటం వల్ల చర్మం దెబ్బ తినడమే కాకుండా మీకు సమస్యలు ఎదురవుతాయి.
ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచొద్దు
వాస్తు ప్రకారం పగిలిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది. అందుకే హోలికా దహనానికి ముందే ఈ వస్తువులను మీ ఇంటి నుంచి తొలగించండి.