కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి, మతం.. వ్యవస్థలో బంధుత్వం గురించి

బంధుత్వం ఒక సామాజిక సంస్థ. ప్రపంచం ఉనికిలో ఉన్న ప్రతి సముదాయంలోనూ బంధుత్వం ఉంది. సమాజం అంటే మానవ సంబంధాల అల్లిక. కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి, మతం వంటి వ్యవస్థలు ఉన్న ప్రతి సమాజంలోనూ సమాజ నిర్మాణానికి, సామాజిక సంబంధాలకు బంధుత్వమే ప్రధాన భూమిక వహించింది. బంధుత్వం అనేది వివాహం ద్వారా గానీ ప్రత్యుత్పత్తి ద్వారా గానీ వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధం. 

భారతదేశంలో పితృస్వామ్య విస్తృత కుటుంబాలపై పరిశోధనలు చేసి, దాని ఫలితాలు, వివరణలు 1861లో ప్రాచీన చట్టం అనే గ్రంథంలో సర్​ హెన్రీ మెయిన్​ వివరించాడు. ఆ తర్వాత కాలంలో మాతృ వంశీయ సంబంధాలను వివరించే క్రమంలో మెల్లికన్​ అనే సామాజిక శాస్త్రవేత్త ఆదిమ వివాహం అనే గ్రంథంలో బంధుత్వం గురించి వివరించాడు. 

దత్తత ద్వారా ఏర్పడే బంధుత్వం నిజానికి వివాహ బంధుత్వమో రక్త సంబంధమో కాదు. అయినా చట్టం దృష్టిలో అది బంధుత్వమే. సమాజ శాస్త్రవేత్తలు బంధుత్వ విధానాలను వైవాహిక బంధుత్వం, ఏకరక్త బంధుత్వం, దత్తత ద్వారా బంధుత్వంగా గుర్తించారు. 

వైవాహిక బంధుత్వం: వివాహం ద్వారా ఏర్పడే బంధుత్వాన్ని వైవాహిక బంధుత్వం అని పిలుస్తారు. దీని ద్వారా ఇద్దరు అపరిచిత/ పరిచిత వ్యక్తులకే కాకుండా వారి కుటుంబాల మధ్య కూడా బంధుత్వం ఏర్పడుతుంది.

ఉదా: భార్య–భర్త, అత్త–మామ, వదిన–మరదలు, బావ– మరిది.

ఏకరక్త బంధుత్వం: ఒకే రక్త సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వాన్ని ఏకరక్త బంధుత్వంగా పిలుస్తారు. ఒకే తల్లి పిల్లలు అయినా దత్తత ద్వారా బంధుత్వం కలిగితే వారిని ఏకరక్త బంధువులు అని పిలువలేం. 
ఉదా: సోదరుడు– సోదరి, తల్లి– కొడుకు, తండ్రి – కూతురు. 


దత్తత ద్వారా బంధుత్వం: దత్తత తీసుకోవడం ద్వారా ఏర్పడే బంధుత్వం. నీలగిరిలో తోడాలు బహుభర్తృత్వం పాటిస్తారు. పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో నిర్ధారించేందుకు ధనుర్బాణోత్సవం నిర్వహిస్తారు. కుటుంబం ఏర్పడటానికి బంధుత్వం పునాది. 

బంధుత్వ స్థానం

ప్రాథమిక బంధుత్వం: ఒక వ్యష్టి కుటుంబంలో సభ్యులు ప్రాథమిక బంధువులు అవుతారు. ప్రాథమిక సమూహంలో వ్యక్తుల మధ్య సంబంధాన్ని ప్రాథమిక బంధుత్వం అని అంటారు. ఇది రెండు రకాలు. అవి..  ప్రాథమిక ఏకరక్త బంధుత్వం, ద్వితీయ బంధుత్వం.

ప్రాథమిక ఏకరక్త బంధుత్వం: తల్లిదండ్రులకు పిల్లలకు, పిల్లలకు పిల్లలకు మధ్య ఏర్పడే బంధుత్వం.

 ప్రాథమిక వైవాహిక బంధుత్వం: భార్యభర్తల మధ్య నుంచే వైవాహిక బంధుత్వం ప్రారంభమవుతుంది. ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరంగా ఉంటాయి. ప్రాథమిక బంధుత్వంలో ఏడు రకాల బంధుత్వాలు ఉంటాయి. దూబే వివరణ ప్రకారం ప్రాథమిక బంధువుల సంఖ్య 8. 
ద్వితీయ బంధుత్వం: ఈ బంధుత్వం అహం అంటే నేను అనే వ్యక్తి నుంచి లెక్కించాలి. అహం నుంచి లెక్కించినప్పుడు అహానికి చెందిన ప్రాథమిక బంధువుల ప్రాథమిక బంధువులందరూ ద్వితీయ బంధులవుతారు. ద్వితీయ బంధుత్వంలో 33 రకాల బంధుత్వాలు ఉన్నాయి. 
ఉదా: కోడళ్లు, అల్లుళ్లు, అత్త, మామ, తాత, మనుమడు, మనుమరాలు. 

తృతీయ బంధుత్వం: అహం ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులు అవుతారు. లేదా అహం ప్రాథమిక బంధువుల గౌణ బంధువును తృతీయ బంధువు అని పిలుస్తారు. ప్రాథమిక బంధువుల ద్వితీయ బంధువులు లేదా ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులను తృతీయ బంధువులు అంటారు. 
ఉదా: ముత్తాత, మునిమనుమడు, బావమరిది భార్య
బంధుత్వ ఆచరణలు: బంధు సమూహాల్లోని వ్యక్తుల మధ్య కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలు కనిపిస్తాయి. వాటినే బంధుత్వ ఆచరణలు అంటారు. వాటిలో ఆరు ముఖ్యమైనవి. 
పరిహాస సంబంధాలు: ఒకరిని ఒకరు పరిహసించుకోవడం, చిన్న చిన్న వస్తువులు నష్టపరచడం వంటి చనువు తీసుకుంటారు. ఇవి సౌష్టవ పరిహాసం, అసౌష్టవ పరిహాసం అని రెండు రకాలు. 

సౌష్టవ పరిహాసం: ఇందులో ఒకరు పరిహాసం చేస్తే మరొకరు అదే స్థాయిలో పరిహాసం చేసే హక్కు ఉంటుంది. 
ఉదా: బావా మరదళ్ల మధ్య పరిహాసం, బావామరుదుల మధ్య పరిహాసం.
అసౌష్టవ పరిహాసం: ఒక బంధువు రెండో బంధువుని పరిహసించవచ్చు గానీ వారు తిరిగి మొదటి బంధువును పరిహసించే హక్కు ఉండదు. 
ఉదా: తాత మనుమరాలు మధ్య పరిహాసం. 
వైదొలుగు నడవడి: ఇంటి కోడలు అత్తమామల నుంచి తప్పించుకోవడం, ముఖాముఖిగా మాట్లాడకపోవడం, ఎక్కువ పరిచయం పెట్టుకోకపోవడం. సిగ్మండ్​ ప్రాయిడ్​, జేమ్స్​ ఫ్రేజర్​ అనే శాస్త్రవేత్తలు అగ్యగమన సంబంధాలు ఏర్పడకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతి అమలు జరుపుతారని అభిప్రాయం తెలిపారు. అగమ్యగమనం ఏర్పడకుండా ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. 

మాతులాధికారం: ఒక వ్యక్తి జీవిత విశేషాల్లో తల్లి కంటే మేనమామే ముఖ్యమనే ఆచారం ఉంటుంది. మేనమామే అన్ని బాధ్యతలు నిర్వహిస్తారు. మాతుల స్థానీయ నివాసం, మేనమామ నుంచి ఆస్తి పొందడం మొదలైనవన్నీ మతులాధికారంగా పేర్కొంటారు. 
పితృష్వాధికారం: ఒక జీవిత విశేషాల్లో తల్లి కంటే మేనత్త ముఖ్యం. ఈ బాధ్యత తండ్రి సోదరి వహిస్తుంది. పితృ స్థానీయ నివాసం, మేనత్త నుంచి ఆస్తి పొందడం వంటి ఆచారాలు పితృష్వాధికారంలో ఉంటాయి. 
కుహనా ప్రసూతి: భార్య ప్రసూతి సమయంలో భర్త ఆమె ప్రసవ వేదనను నటిస్తాడు. తోడా, ఖాసీ తెగల్లో ఈ పద్ధతి అమలులో ఉంది. 
సాంకేతిక సంబోధన: బంధువులను మామయ్య, చిన్నన్నాన్న అని పిలుస్తారు. ఈ రెండు విధాలుగా కాకుండా పలానా వ్యక్తి తండ్రి లేదా పలానా వ్యక్తి చిన్నన్నాన్న అని పిలువడం సాంకేతిక సంబోధన. 

బంధుత్వ సమూహాలు: ప్రాథమిక లేదా ద్వితీయ లేదా తృతీయ లేదా ఈ మూడింటిలో కొందరు లేదా అందరూ కలిసి లేదా కూటమిగా ఒక ప్రదేశంలో లేదా ఒక ఇంట్లో లేదా ఒక గ్రామంలో కలిసి ఉండే సమూహాలను బంధుత్వ సమూహాలు అంటారు. ఇవి వంశం, గోత్రం, గోత్ర కూటమి, ద్విశాఖ అనే నాలుగు రకాలుగా విభజించవచ్చు. 
ద్విశాఖ: తండ్రి నుంచి ఒక శాఖను, తల్లి నుంచి ఒక శాఖను స్వీకరిస్తే అది ద్విశాఖ అవుతుంది. ఇందులో సమాజం బంధుత్వం ఆధారంగా రెండు భాగాలుగా విభజిస్తారు. ఉదా: నీలగిరిలో ఉన్న తోడాల్లో తైవాళియల్​, తర్తారియల్​ అనే రెండు శాఖలు కనిపిస్తాయి.

వంశం: ఒకే రక్త సంబంధం కలిగిన కుటుంబాల కలయికను వంశం అంటారు. సాధారణంగా ప్రతి వంశంలో బంధువులందరూ ఒకే వంశకర్తతో రక్త సంబంధం కలిగి ఉంటారు. ఆ వంశకర్త రక్తం ఆ వంశంలోని బంధువులందరిలోనూ ఉంటుంది. ప్రతి వంశానికి మూల పురుషుడు ఉంటాడు. కాబట్టి వివాహం సొంత వంశంలోని వాళ్లతో ఉండదు. వివాహం అనేది బహిర్వంశం. 

గోత్రం: తరతరాలుగా ఒకే పితృ దేవతను ఆరాధిస్తూ ఆ మూలపురుషుడి సంతతిగా భావించే ఏక వంశానుక్రమ సమూహాన్నే గోత్రంగా నిర్వచించవచ్చు. గోత్రానికి, వంశానికి మధ్య సంబంధం ఉంది. గోత్రం వంశం కంటే విస్తృతమైంది. ఇది ఏక వంశానుక్రమ సమూహం. ఇది అతి ప్రాచీనమైంది. వివరంగా చెప్పాలంటే ఒక పురాణ పురుషుడి వారసుల సంతతి లేదా ఒకే పితృదేవతల సంతతికి చెందిన వారమనే విశ్వాసంతో ఉన్న సముదాయమే గోత్రం. గోత్రం అనేది ఒక ఏక వంశానుక్రమ సమూహం. పితృదేవత ఉంటాడు. 

గోత్ర కూటమి: రెండు అంతకంటే ఎక్కువ గోత్రాలు కలిసి ఏర్పడే దాన్ని గోత్ర కూటమి అంటారు. గోండుల్లో చార్​దేవా, పాంచ్​దేవా, షాదేవా, సాత్​ దేవా అనే గోత్ర కూటములు ఉంటాయి. చార్​దేవా అంటే నాలుగు గోత్రాల కలయిక. పాంచ్​దేవా అంటే ఐదు గోత్రాలు, షాదేవా అంటే ఆరు గోత్రాలు, సాత్​ దేవా అంటే ఏడు గోత్రాల కలయిక. వీరి గోత్ర చిహ్నాలుగా పాము, ముంగీస, మొసలి, కుందేలు, తాబేలు మొదలైనవి ఉంటాయి. నాగాలాండ్​లో నివసించే అవోనాగా తెగలో కూడా గోత్ర కూటమి కనిపిస్తుంది.