ఇదెక్కడి సామాజిక న్యాయం?

శతాబ్దాలుగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా వెనుకబడిన వర్గాలు అణచివేతకు గురయ్యాయి. ఈ వర్గాలు  మిగతా  అగ్రవర్ణాలతో  పోటీ పడలేరని రాజ్యాంగంలో వారి కోసం కల్పించిన కొన్ని ప్రత్యేక రక్షణలే రిజర్వేషన్లు.  ఈ రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయాన్ని అందించి ఈ వర్గాలను మిగతా వర్గాలవారితో సమానంగా అన్ని రంగాలలో.. అనగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా  అభివృద్ధి చెందేలా అవకాశాలు కల్పించి, వారు జాతి నిర్మాణంలో అగ్రవర్ణాలతో సమాన పాత్ర పోషించాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఆశయం.  వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు వారికి జీవనోపాధి కల్పిస్తూనే  దేశ పాలనలో భాగస్వామ్యులను చేస్తాయి. మండల్ కేసులో 1992 జస్టిస్ జీవన్ రెడ్డి మెజారిటీ న్యాయమూర్తుల తీర్పు చదువుతూ ‘ప్రభుత్వ ఉద్యోగం అంటే అది హోదా, అంతస్తు, అధికారంతో కూడుకున్నది. వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించాలంటే రిజర్వేషన్స్ తప్పనిసరి’ అని అభిప్రాయపడినారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16 (4) ప్రకారం ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడినవి.  

ఆర్టికల్ 335 ఎస్సీ, ఎస్టీల  క్లెయిమ్స్​ను  ప్రభుత్వం పని సమర్థతను కాపాడుకుంటూ, పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పటం జరిగింది.  అలాగే వారి జనాభా దామాషా ప్రకారం లోక్​సభ, అసెంబ్లీ నియోజక వర్గాల సీట్లలో రిజర్వ్ చేయాలని ఆర్టికల్ 330, 332 తెలియజేస్తోంది. ఆర్టికల్ 341, 342లో  ఎస్సీ, ఎస్టీలుగా నిర్ధారించిన కులాల, తెగల జాబితా ఉంటుంది. ఇక బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ కలిపించాలనే ప్రొవిజన్స్ లేవు.  

బీసీల రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ సీట్లతో పాటు విద్య, ఉద్యోగాలలో,  స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1961 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా 14.64 శాతం, 6.8 శాతం.  అందుకేవారికి కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో 15% , 7.5%  రిజర్వేషన్స్ ఉన్నాయి. కాగా, బీసీలకు సంబంధించినంతవరకు రెండవ బీసీ కమిషన్  అయిన బీపీ మండల్ నివేదిక (1980) ప్రకారం 1993 నుంచి 27% రిజర్వేషన్లు ఉద్యోగాలలో అమలులో ఉన్నాయి.  

కేంద్ర విద్యాసంస్థలలో 2008 నుంచి అమలులో ఉన్నాయి. (93వ రాజ్యాంగ సవరణ 2006, తర్వాత కోర్టు తీర్పులు)  సుప్రీంకోర్టు ఎం.ఆర్. బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కేసులో 1962లో విధించిన 50 శాతం గరిష్ట పరిమితి దృష్టిలో పెట్టుకొని మండల్ కమిషన్ 27%  రిజర్వేషన్లు బీసీలకు సిఫారసు చేసింది. ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు ఈ 27% రిజర్వేషన్లను సమర్థించినది. 

అలాగే 50% సీలింగ్ దాటకూడదు అని కూడా వ్యాఖ్యానించినది. ఇదే ఇంద్రసహాని కేసులొ సుప్రీంకోర్టు అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు 1991 సెప్టెంబర్ లో ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉత్తర్వులను కూడా సమీక్షించింది. ధర్మాసనంలోని 9 మంది న్యాయమూర్తులలో 8 మంది ఆర్థికపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని ఆ ఉత్తర్వులను కొట్టివేశారు. 

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అగ్రకులాల పట్టు

అగ్రకులాల వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పట్టు విడువలేదు. 2005లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మేజర్ జనరల్ ఎస్.ఆర్. సిన్హో (రిటైర్డ్ )తో ఒక కమిషన్​ను నియమించింది. ఆ కమిషన్ 2010లో రిపోర్ట్ ఇవ్వగా 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసి ఆర్థికంగా బలహీన వర్గాలకు గరిష్టంగా 10 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించింది. సుప్రీంకోర్టు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2022లో ఈ పెంపు రాజ్యాంగ సమ్మతమేనని ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులలో ముగ్గురు న్యాయమూర్తులు మెజారిటీ తీర్పును ఇచ్చారు. 

2019 ఫిబ్రవరి నుంచి ఈ రిజర్వేషన్లు అమలులో ఉన్నవి. నిజానికి సుప్రీంకోర్టు/హైకోర్టులు బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి 50% సీలింగ్ దాటకూడదని అట్టి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేశాయి.  అదేవిధంగా ఈమధ్య పాట్నా హైకోర్టు బిహార్​ కులగణన తర్వాత పెంచిన ఉత్తర్వులను ఆర్థికంగా బలహీన వర్గాల పేరుతో అగ్ర కులస్తులకు రిజర్వేషన్లు 10% పెంచినపుడు 60 శాతం వరకు అంగీకరించాయి. నిజానికి ఎస్.ఆర్. సిన్హో కమిషన్ అగ్రకుల పేదల సంఖ్య ఏవిధంగా నిర్ధారించింది అనేది పెద్ద ప్రశ్న.  బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రతిసారి శాస్త్రబద్ధమైన అనుభవంతో కూడిన డాటా (empirical data) కావాలని కోరిన కోర్టులు, ఈ విషయంలో ఎందుకు కోరలేదు అనేది అర్థం కాని విషయం.  

వాస్తవానికి 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 15, 16లలో 15(6) ,16(6) చేర్చడం జరిగింది. వీటి ప్రకారం రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 10% కానీ కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమొరాండం ఎఫ్.నెం. 20013/01/2018 బీసీII తేదీ 17.01.2019 ద్వారా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నది.  అలాగే తెలంగాణ ప్రభుత్వం జీఓ. ఎంఎస్. నెం. 33 (జి.ఏ) సర్వీసుల డిపార్టుమెంటు తేదీ 19.03.2021 ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తున్నది. నిజానికి గరిష్ట పరిమితి 10 శాతం అంటే 10% అమలు చేయాలని కాదు. తగ్గించి కూడా అమలు చేయవచ్చు. రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధన కూడా ఏమీ లేదు. 

మొత్తం జనాభాలో 51%  బీసీలు

మనం అర్థం చేసుకున్నట్లయితే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ప్రకారం మొత్తం జనాభాలో 51%  బీసీలు ఉండగా,  ఎస్సీలు18%,   ఎస్టీలు 10%,  ఓసీలు 21% .  ఈ  ఓసీలలో ముస్లింలు 11.2%, క్రిస్టియన్లు 1.27%, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఉన్నారు.  వీరు అందరూ కలిసి13% (Source MCRHRD website ) ఇందులో సుమారు 10% బీసీలలోకే వస్తారు.  మిగిలినవారు హిందూ బీసీలు 51శాతం, హిందూయేతర బీసీలు 10 శాతం, ఎస్సీలు 18,  ఎస్టీలు 10,  ఓసీలు/ జనరల్ కేటగిరి 11 ( హిందువులు 8, హిందూయేతరులు 3) 

11%  ఓసీలలో ఆర్థికంగా బలహీన వర్గాలవారు ఐదు శాతం కూడా ఉండరు. (అంచనా మాత్రమే, లెక్కలు లేవు) అందుకే అన్ని నియామకాలలో  ఈడబ్ల్యూఎస్  మెరిట్  బీసీల కంటే తక్కువ.  ఉదాహరణ సివిల్ 2024 పరీక్షలలో జనరల్ కేటగిరి కట్ ఆఫ్ మార్కులు 75.4%, ఓబిసీలకు 74.75%,  ఈడబ్ల్యూఎస్ 68.02%,  ఎస్సీ 59.25%,  ఎస్టీ 47.82%. గమ్మత్తు ఏమిటంటే  ఎస్సీలకు వారి జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 18 శాతం,  ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.  అలాగే  ఓసీలకు వారికి తగ్గట్టుగా 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.  

కానీ, 61 శాతం జనాభా ఉన్న బీసీలకు 29 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇది ఎక్కడి సామాజిక న్యాయం?  దేశవ్యాప్తంగా కూడా ఓసీల జనాభా 15%నికి మించి లేదు అందులో ఆర్థికంగా బలహీన వర్గాల వారు 7.5 శాతం కూడా ఉండే అవకాశం లేదు. కానీ వీరికి పది శాతం రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది సామాజిక అన్యాయం కాదా?  

నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాలలో ఆర్థికంగా బలహీన వర్గాల జనాభా 5 శాతానికి మించి ఉండదు.  వీరి జనాభాకు అనుగుణంగా 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమలుపరచవచ్చును.  కానీ, అగ్రవర్ణాల ప్రభుత్వాలు తమ వారికి ఏ అవకాశం వచ్చినా వదులుకోవు, తమ వర్గాల ప్రయోజనాలు వారికి చాలా ముఖ్యం.  న్యాయస్థానాలలో పై రిజర్వేషన్ల విషయాన్ని సవాలు చేయాలన్న కులగణన లెక్కలు,  ఆర్థిక వెనుకబాటుతనం లెక్కలు తప్పనిసరి.  అందుకే  సమగ్ర కులగణన జరగాలి అని బీసీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అప్పుడే బీపీ మండల్​కు నిజమైన నివాళి.