ఫలించని సోషల్ ట్రిక్స్

దేశంలో,  రెండు తెలుగు రాష్ట్రాల్లో  అన్ని హంగులున్న  అధికార పార్టీలకు ఎదురైన ప్రతికూల ఫలితాలు కొత్త భాష్యం చెబుతున్నాయి.  నేల విడిచి సాము చేస్తూ ఏకవ్యక్తి నిర్ణయాలు, అంతా తామేనన్న ఫీల్ గుడ్ తో ఫలితాలు సాధించలేరని తేలిపోయింది.  పై అత్తరు  పూతల  ప్రచారాలకు తల ఊపినా,  పప్పు బెల్లంలా పంచే పథకాల వైపు తాత్కాలికంగా మొగ్గినా.. జనం ఎప్పుడూ వాస్తవిక పునాదులపైనే నిలబడతారని తాజా ఎన్నికల ఫలితాలు మరోసారి రూఢీ చేశాయి.  నిజాలను కప్పిపుచ్చి సోషల్ మీడియాలో  ప్రచారం వల్ల మాత్రమే  రాజకీయ పార్టీలు  మనుగడ సాధించలేవని,  ఆ సామాజిక మాధ్యమాలు మాత్రమే  సమాజ స్థితిగతులను మార్చలేవని చివరకవి రాజకీయాల్లో ఫలితాలనూ శాసించవని,  ఏ మాత్రం  ప్రభావితం చేయవని కేవలం వాటిని మాత్రమే నమ్ముకుంటే  ఎలాంటి  ఫలితాలొస్తున్నాయనే సింహావలోకన చర్చ జరుగుతున్నది. 

దేశంలో బీజేపీది వాట్సప్ యూనివర్సిటీ  అని ఓ రాజకీయ ప్రచారం.  విపక్షాలూ అదే కోణంలో ప్రచారం చేశాయి.  కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి పథకం, మోదీ పదేండ్ల పాలనపై ఇదే సోషల్ మీడియాలో బీజేపీ విపరీతంగా ప్రచారం చేసింది.  ఎన్నికల ముందునుంచే రానున్నది మళ్లీ  మోదీ హవా అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటివారూ చెప్పారు.  ఫిర్ ఏక్ బార్ మోదీ.. అబ్ కి బార్ చార్ సౌ  పార్ అనే నినాదాన్ని బీజేపీ  సోషల్ మీడియా ద్వారా బలంగా తీసుకెళ్లింది.  అదేవిధంగా ఎన్నికల ముందు, తర్వాత మోదీ చరిష్మాపై  రకరకాల  కథనాలను  ప్రచురితం చేసి ప్రసారమూ  చేయించారు.  పదేండ్ల పాలనా వైఫల్యాలు, నిర్ణయాలు, జనం మదిలో  ఏముందో కూడా తెలుసుకోకుండానే రకరకాల భావనలను సృష్టించారు.  ఇక సౌత్ బలం పెరిగిందని,  నార్త్ లోనూ  మళ్లీ మోదీ మానియా అని  ప్రచారం చేసుకున్నారు. కానీ,  తీరా ఫలితాలు చూస్తే  బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దైన్య స్థితికి చేరింది.  పదేండ్లలో పార్టీకి,  ప్రభుత్వానికి  అన్ని హంగులు, బలాలు, ఆర్భాటాలున్నా,  పదేండ్ల  వ్యతిరేకతను  తగ్గించేందుకు రకరకాల  ప్రయత్నాలు చేసినా జనం మాత్రం బలమైన నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడి ఉన్నారు. ఇదే సమయంలో విపక్షాలు ఆరోపించిన రాజ్యాంగం మార్పు,  రిజర్వేషన్ల  ఎత్తివేత అంశాలు కూడా తారస్థాయిలో  బీజేపీ కూటమి ఫలితాలపై ప్రభావం చూపాయి. అంటే బీజేపీ, ఎన్డీఏ.. వాస్తవిక సమస్యల వైపు కాకుండా కేవలం మాధ్యమాలతో  జనాలను మార్చే ప్రయత్నాన్ని ఓటర్లు తిప్పికొట్టారనే చెప్పాలి.

బీఆర్ఎస్  సోషల్ మీడియా బోల్తా

తెలంగాణలో అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్ఎస్​దీ  అదే పరిస్థితి.  కేసీఆర్  సొంత మీడియా,  కేటీఆర్   సోషల్  మీడియా ఎన్నికల్లో  ఏమాత్రం పనిచేయలేదన్నది స్పష్టం.  తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని నమ్మడం లేదని పేర్కొంటూ...33 మెడికల్  కాలేజీలకు బదులు 33 యూట్యూబ్ చానళ్లు పెట్టుకుంటే బాగుండేదని మాజీ మంత్రి  కేటీఆర్ వ్యాఖ్యానాలు చేయడమే కాకుండా,  దిమ్మదిరిగిన అసెంబ్లీ ఫలితాలు చూసి సోషల్ మీడియాను మరింత వ్యాప్తి చేశారు.  తన బలగంతో  కొన్ని ఫేక్ జీవోలు,  ఇతరత్రా సర్కారు అంశాలపై  విస్తృతంగా ప్రచారం చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని జనం మరింత దూరం పెట్టారు.  నిజానికి  ఇక్కడ  కేవలం  సోషల్ మీడియానే నమ్మి రాజకీయాలు చేసి ఆ పార్టీ నష్టపోయిందని చెప్పాలి.  బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారశైలి,  పాలనా తప్పిదాలపై దృష్టి సారించకుండా  ఎంతసేపు వ్యక్తికేంద్ర  ప్రచారం సరైంది కాదని ఆ పార్టీపై కసి, కోపంతో ప్రత్యర్థి పార్టీలకు ప్రజలు ఓటేశారు.  అసెంబ్లీలో 39 స్థానాలొచ్చినప్పటికీ లోపమెక్కడో,  తప్పిదమెక్కడో గ్రహించకుండా, జనమే తప్పు చేశారని మాట్లాడుతూనే  పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ ఊరూ వాడా తిరిగినా జనం అంతగా రిసీవ్ చేసుకోలేదు.  అంటే బీఆర్ఎస్  నాయకత్వం  ఎంతసేపు  మీడియా,  సోషల్ మీడియా ఆధారంగా వెళ్లాయే తప్ప జనం మూడ్ ను  ఒడిసిపట్టలేక  దెబ్బతిన్నామని ఇప్పటికీ  గ్రహించలేకపోతున్నారు. 

ఏపీ ఫలితాలు ఓ గుణపాఠం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ -ఫలితాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతున్నదన్న అంశంలోనూ చర్చ జరుగుతున్నది.  ఐదేండ్లు అధికారంలో  ఉన్న  వైఎస్ జగన్, ఆయన  ప్రవేశ పెట్టిన పథకాలు, లక్షల కోట్ల నిధులు, ఇంటింటికి లబ్ధిదారులు వారి అభిప్రాయాలను  క్రోడీకరించి తన సొంత మీడియాలో,  సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.  చంద్రబాబు కూటమిని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నానికీ  వెనకాడలేదు.  మీమ్స్, ఇతరత్రా వ్యంగ్యాస్త్రాలతో ఓ రేంజ్ లో ఆడుకున్నారు.  ఒక దశలో  ఆ ప్రచారం చూసి బాబు పనైపోయిందని  జగన్  మళ్లీ క్లీన్​స్వీప్ అని ఈవీఎంలు లెక్కించేంతవరకూ ప్రచారం జరిగింది.  తీరా  ఏపీ ఫలితాలు దేశంలో  గుణపాఠం వంటి పాఠాన్ని చెప్పకనే చెప్పాయి.  జగన్​ వ్యతిరేక శిబిరంలో ఉన్న చంద్రబాబు, పవన్ సహా  వైసీపీ నేతలు సైతం ఇంత కనిష్ట సంఖ్యలో  సీట్లొస్తాయని ఊహించలేకపోయారు.  జగన్ చేతిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ,  పార్టీ క్యాడర్,  వాలంటీర్లు,  ప్రభుత్వ పథకాలకు తోడు ఆయన సొంత మీడియా,  సోషల్ మీడియా కూడా ఏపీ  ప్రజల నిర్ణయం ముందు బలాదూర్ అని నిరూపించాయి. అంటే  జనం  ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే  ఆ ఫలితాలెలా ఉంటాయన్నది ఏపీ రాజకీయాలు నిరూపించాయి.  జగన్  చెప్పింది చివరిదాకా విన్న ఏపీ జనం తమ మదిలో ఉన్న నిర్ణయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేసి వెల్లడించారు. 

మోదీపై ఆర్ఎస్ఎస్​ ఆగ్రహం

జనం వాస్తవ పునాదులపైనే  నిలబడతారని మరోసారి ఎన్నికల  ఫలితాలు బలమైన సందేశాన్నిచ్చాయని చెప్పడానికి ఇటీవల ఆర్ఎస్ఎస్ అంతర్మథన వ్యాఖ్యానాలే  ప్రత్యక్ష తార్కాణాలు. ఏక వ్యక్తి నిర్ణయాలు.. సామూహిక  ప్రయోజనాన్ని దెబ్బతీశాయని ఆర్ఎస్ఎస్ బలంగా విశ్వసించింది. అందుకు ప్రధాని మోదీయే కారణమని ఆయనను బోనులో నిలబెట్టింది. పదేండ్ల మోదీ వ్యవహార శైలి తీరునూ తప్పుబట్టింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశ్యాలు సగటు జనంలో నమ్మకాన్ని కల్పించలేక పోయాయని అభిప్రాయపడింది.  సామాజిక మాధ్యమాల  ద్వారానే  అంతా జరిగిపోతుందనే భావన కల్పించి చివరకు మిత్రపక్షాలపై ఆధారపడే  గడ్డు స్థితి అనివార్యమవ్వడం ఆ శిబిరానికి కాస్త ఆందోళన కలిగించిందనే చెప్పాలి.  ఎన్డీఏ  మిత్రపక్షమైన టీడీపీ అధినేత  చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవంలో  కోర్ బీజేపీ అంతా కనిపించడం కొత్త చర్చకు దారితీసింది. 

- వెంకట్ గుంటిపల్లి,తెలంగాణ జర్నలిస్టుల ఫోరం