అభ్యర్థులే కాదు పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలిపించడానికి చాలా ఖర్చు చేస్తుంటాయి. మన రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఓ ప్రధాన పార్టీకి ఓటు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాదాపు 250 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మెచ్చుకుంటూ వీడియోలు చేశారు. అయితే.. వాళ్లు షేర్ చేసిన వీడియోల్లో అభ్యర్థుల ఫొటోలు, వీడియో క్లిప్‌లు లేవు. కాబట్టి ఆ ఖర్చు అభ్యర్థుల ప్రచార ఖర్చు కిందికి రాదు.
ఒకవేళ అభ్యర్థులు ఫొటోలతో ప్రచారం చేస్తే.. అది అభ్యర్థి ఖర్చు కిందకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ ముందుగానే చెప్పింది. అయితే.. పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం చేయించడానికి అడ్వర్టైజింగ్ కంపెనీలకు భారీగానే చెల్లిస్తున్నారు. కొందరైతే యాక్టర్లు, కళాకారులను సభలకు తీసుకెళ్లి మరీ ప్రచారం చేయించుకుంటున్నారు. అలాంటప్పడు ఇంకాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. కొందరు నాయకులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఇంటర్వ్యూలు కూడా చేయించుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి, ఆ అకౌంట్లను మెయింటెయిన్ చేయడానికి చాలామంది అభ్యర్థులు ప్రత్యేకంగా టీంలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో హల్చల్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు మండలానికి ఒకరు చొప్పున నియమించుకున్నారు. అలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వివిధ హోదాల్లో కనీసం 300 నుంచి 500 మంది వరకు పనిచేస్తున్నారు.
వీళ్ల వల్లే ఎన్నికల వాతావరణం రాగానే యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్‌బుక్ పేజీలు, ట్విట్టర్ ఖాతాలు రెట్టింపు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. వాళ్లు ఆ మెయిన్ లీడర్లు, కార్యకర్తలతో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అభ్యర్థి ప్రచారం చేసే రూట్ మ్యాప్, ఇంతకుముందు ఆయన చేసిన మంచి పనుల గురించి, ప్రత్యర్థి లోపాలు.. లాంటివన్నీ ఆ గ్రూపుల్లో షేర్ చేస్తారు. కార్యకర్తలకు అభ్యర్థి ఏదైనా విషయం చెప్పాలన్నా ఈ గ్రూపుల ద్వారానే చెప్తాడు.
అంతేకాదు.. వీళ్లే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిలో అభ్యర్థి ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి, వాటిలో రకరకాల పోస్ట్‌లు పెట్టి జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అంతేకాదు.. ప్రత్యర్థుల మీద నెగెటివిటీ పెంచే పోస్ట్‌లు కూడా పెడుతుంటారు. పార్టీల కోసం ఆన్‌లైన్‌లో సర్వేలు చేస్తుంటారు. వెబ్‌సైట్లలో కంటెంట్ పోస్ట్ చేస్తుంటారు.
మొబైల్ ద్వారా...
చదువు లేనివాళ్లు, సోషల్ మీడియా వాడని వాళ్లు కూడా ఉంటారు. అలాంటివాళ్ల కోసం ప్రత్యేకంగా ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు చాలామంది అభ్యర్థులు. నియోజకవర్గంలోని ప్రజలకు మెసేజ్‌లు పంపించడం, ఫోన్ కాల్లో అభ్యర్థి వాయిస్ మెసేజ్ వినిపించడం లాంటివి చేస్తున్నారు. దీనికోసం కూడా డబ్బు బాగానే ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఓటర్లు మాత్రం జాగరూకతతో ఉండాలి. ఐదేండ్లు మనల్ని పాలించే అధికారం వాళ్లకు కట్టపెడుతున్నాం. కాబట్టి, వాళ్లు విద్యా, వైద్యం లాంటి కనీస అవసరాలు అందించాలి. మనకోసం పనిచేయలేనప్పుడు వాళ్లను నిలదీసేందుకైనా.. ప్రలోభాలకు లొంగకుండా చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలి.