ఉపకార వేతనాల వెతలు: సోషల్ ఎనలిస్ట్ నంగె శ్రీనివాస్

పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత చదువులను ఉచితంగా దరిచేసేందుకు తీసుకొచ్చిన బృహత్తర పథకమే ఉపకార వేతనాల సౌకర్యం.  రెండు రకాలుగా చెల్లించే ఈ ఉపకార వేతనాలు మొదట్లో బాగానే ఉన్నా .. క్రమేపీ అటు విద్యార్థులు, ఇటు కళాశాలల యాజమాన్యాలకు ‘అపకారం’గా పరిణమించాయి. ప్రభుత్వాలు మారడం, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం, నిధుల లేమి.. వెరసి  ఒకప్పుడు ‘పేదలకు వరం’గా ఉన్న పథకం నేడు భయపెట్టే అంశంగా రూపుదిద్దుకుంది. 

ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడిసిన్,  వృత్తివిద్యా కోర్సులు, పీజీ,  డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్  కోర్సులన్నీ  ఆర్థికంగా  వెనుకబడిన విద్యార్థులకు దగ్గరయ్యాయి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఫీజు రియింబర్స్​మెంట్ ​పథాకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులను పెద్ద సంఖ్యలో కేటాయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పథకం క్రమంగా నీరుగారిపోయింది.  ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా  పనిచేసిన రోశయ్య..అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే సాగింది.  అప్పటికే ఉన్నత చదువులకోసం  వివిధ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు చదువు భారంగా మారింది.  ఆ సమయంలోనే  విద్యార్థులు, విద్యార్థి సంఘాలు,  ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు.  సమస్య సుప్రీంకోర్టు వరకువెళ్ళింది.  ప్రతి మూడు నెలలకోసారి చెల్లింపులు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సమయంలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం’ ఊపందుకోవడంతో విషయం మరుగునపడిపోయింది. ఇది విద్యార్థులకు శాపంగా మారింది. 

మార్గదర్శకాలు బేఖాతరు

ప్రతినెలా మెస్ ఛార్జీలు విద్యార్థుల ఖాతాలో జమచేయాలనే మార్గదర్శకాలున్నా ఆచరణకు నోచుకోలేదు.   కళాశాలలకు చెల్లించాల్సిన బోధన రూసుములను ప్రభుత్వం నేరుగా ఆయా కళాశాలలకే  చెల్లించేలా కార్యక్రమం రూపొందించారు.  వైఎస్సార్ మరణం తర్వాత ఉపకార వేతనాల మంజూరీలో  తీవ్ర జాప్యం ఏర్పడింది.  ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్​ రెడ్డి  హయాంలో  నిధుల లేమితో  ప్రతినెలా చెల్లించలేకపోతున్నాం.  ప్రతి మూడునెలల కోసారి  చెల్లించేందుకు తాత్కాలిక అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని కోరారు. అనుమతి లభించగానే,  దీన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు కాలయాపన చేయడం మొదలుపెట్టాయి. ప్రధానంగా గత  కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది.  సుప్రీం న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెడుతూ ఏడాదికోసారి కూడా చెల్లించకుండా రెండు మూడేండ్లు గడిపేశారు.  పదేండ్లపాటు  ఇదేతంతు కొనసాగింది.  వేలకోట్ల రూపాయలు బాకీపడి కాలం  వెళ్లదీశారు.  ఈ పరిణామం వల్ల నిరుపేద విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లింది. ఈ పథకంపై ఆధారపడి ప్రవేశాలు చేపట్టిన ప్రైవేట్ కళాశాలల పరిస్థితి మింగలేక, కక్కలేక అన్న తరహాలో దయనీయంగా మారింది. 

కొన ఊపిరితో కళాశాలలు..

ప్రతి ఏటా లక్షలాది రూపాయల నిర్వహణ భారంతో ఊపిరాడకుండా కొట్టుమిట్టాడుతున్న కళాశాలల పరిస్థితి గత పదేండ్ల నుంచి అత్యంత దయనీయంగా తయారైంది.  ప్రత్యేకంగా కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలను కలుపుకుని  గ్రామీణ ప్రాంతాలలోని డిగ్రీ కాలేజీలు సైతం ఇప్పటికే మూతబడ్డాయి. సకాలంలో  ప్రతిఫలం ఆశించకుండా చేసే విద్యాబోధన యజ్ఞంలో ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్  నిధుల విడుదల లేకపోవడం వల్ల భవనాల అద్దె చెల్లించలేక,  బోధన,  బోధనేతర సిబ్బందికి సకాలంలో జీతాభత్యాలు చెల్లించలేక, సంబంధిత  యూనివర్సిటీ అఫిలియేషన్ ఫీజులు చెల్లించలేక, ఖర్చులు భరించలేక  ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయాయి.  అటు తప్పుడు సంకేతాలు.. ఇటు వెతలు ప్రయివేటు ఉన్నత  విద్యాలయాలు  విద్యాసంవత్సరం పూర్తయి తమకు రావాల్సిన ఫీజు బకాయిలను ఒకవైపు ప్రభుత్వం సకాలంలో చెల్లించక తాత్సారం చేస్తే... ప్రభుత్వాలను నిలదీయలేని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను  ప్రయివేటు యాజమాన్యాలు  చెల్లించమని అడగడం సహజం.  యాజమాన్యాలు ఫీజుల కోసం వేధిస్తున్నాయని, సర్టిఫికెట్లు, పట్టాలు ఇవ్వకుండా తమచుట్టూ  తిప్పుకుంటున్నాయని తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. చివరకు చెల్లించలేని ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులను, పథకాన్ని ఒకవేళ పూర్తిగా ఎత్తేసినా.. యాజమాన్యాలు నిశ్చింతగా విద్యార్థుల నుంచి ఎంతోకొంత  ఫీజులను వసూలు చేసుకుంటాయనేది జరగబోయే ప్రక్రియే. 

అత్యవసరంగా భావిస్తేనే..

వాస్తవానికైతే తమ బాధ్యతగా ‘అరకొర ఫీజులతో’  ప్రభుత్వానికి దీటుగా ఉన్నత విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న  ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఉద్యమ కార్యాచరణకు పూనుకోక ముందే, ప్రభుత్వం  ప్రోత్సాహకాలు అందించి వాటి అభివృద్ధికి పాటుపడాలి.  సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో గత మూడేండ్లుగా పెండింగులో ఉన్న సుమారు 7,500 కోట్ల రూపాయల మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిల విడుదల తప్పకుండా జరుగుతుందని పేదవిద్యార్థులు, యాజమాన్యాలు గంపెడాశతో నిరీక్షిస్తున్నారు. 

ప్రత్యేక రాష్ట్రంలో పరిస్థితి దారుణం..

మిగులు బడ్జెట్​తో  ఏర్పడిన  ప్రత్యేకరాష్ట్రంలో విద్యార్థులకు  ప్రయోజనం జరుగుతుందనుకున్నారు.  కానీ,  గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పథకం నీరుగారింది.  హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  గడువులోపు వివరణ కోరింది.  విషయం దాటవేసేందుకు అవకాశం లేకపోవడంతో 'మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు' అప్పగించి చేతులు దులుపుకున్నారు. అందరికీ సమన్యాయం చేయాలని, ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. 'బయోమెట్రిక్' విధివిధానాల ప్రక్రియ సరిగానే ఉన్నా.. ఇదేంటని ప్రశ్నించిన కళాశాలలపై విజిలెన్స్ తనిఖీల పేరిట  జైల్లో  వేస్తామని భయాందోళనలకు గురిచేసి, ఉపకారవేతనాలను కాజేసేందుకు కళాశాలలు కుట్ర పన్నుతున్నాయంటూ వారిని దొంగల్లా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ కారణంగా వందల కళాశాలలు నిలదొక్కుకోలేక మూతబడ్డాయి.

- నంగె శ్రీనివాస్,  సోషల్ ఎనలిస్ట్.