మహాత్మ జ్యోతిరావు ఫూలే .. ఆశయాలను కొనసాగిద్దాం : మల్లారం అర్జున్

మహాత్మ జ్యోతిరావు ఫూలే మహారాష్ట్ర  సతారా జిల్లా కట్గున్ గ్రామంలో 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అంటరానితనం, కుల వివక్ష పోవాలని నిరంతరం ఫూలే అలుపెరుగని పోరాటం చేశారు.  మహిళా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. వితంతువులకు మళ్లీ వివాహం చేయడంతోపాటు, కుల వివక్ష, అంటరానితనం, మహిళలపై  సాంఘిక దురాచారాలు సమసి పోవాలంటే విద్య అవసరం ఉందని గుర్తించారు.  మహిళలు, అణగారిన వర్గాలకు విద్య ఆవశ్యకతను గుర్తించి వారికోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటుచేశారు. 

శూద్ర కులాలు, దళితులు సమాజంలో 

భాగస్వాములు కాలేక దుర్భరమైన జీవితం గడుపుతున్నారని భావించి, వారికి సాంఘిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేశారు. వారి అభ్యున్నతి కోసం 1873 సెప్టెంబర్ 24వ తేదీన పుణేలో  సత్యశోధక్  సమాజాన్ని ఏర్పాటు చేశారు.  సమాజంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కూకటివేళ్లతో  పెకిలించాలని, విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని ఫూలే భావించారు. . 

సావిత్రిబాయి ఫూలే విద్యా ఉద్యమం

 సావిత్రిబాయి ఫూలే విద్యా ఉద్యమాన్ని ప్రారంభించి అనతికాలంలోనే బహుజన వర్గాలకు, మహిళలకు పాఠశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి గుర్తింపు పొందారు. సాంఘిక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందున1849లో  వారు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు.  భౌతిక దాడులు ఎదురైనా,  సూటిపోటి మాటలన్నా, వారి మీద పెండ,  పశు మూత్రాలు పోసినా కూడా వారు అనుకున్న లక్ష్యం కోసం చిత్తశుద్ధితో  పోరాటం చేశారు.  అనతికాలంలోనే  గ్రామీణ ప్రాంతాల్లో  దాదాపుగా 72 పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సావిత్రిబాయి ఫూలే వయసు 18 సంవత్సరాలు మాత్రమే.  సత్యశోధక్ సమాజం ద్వారా సమాజంలో  సమానత్వ భావాలు కలిగిన వ్యక్తులను ఐక్యపరిచి సంఘటితం చేశారు.  మత ఛాందస భావాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ సంఘంలో కేవలం శూద్ర కులాలకు మాత్రమే సభ్యత్వం ఇచ్చి ఛాందసవాదులకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు పనిచేశారు.

సామాజిక విప్లవకారుడు ఫూలే

భారతదేశంలో  మహాత్మ జ్యోతిరావు ఫూలే  ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు.  సాంఘిక న్యాయం, సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం, వారికి రాజకీయ న్యాయం అందించడం కోసం ఆయన నిరంతరం పాటుపడ్డారు. భారతదేశంలో  నేటికీ శూద్ర కులాలకు రాజకీయ న్యాయం అందడం లేదు.  దళిత, గిరిజన వర్గాలకు మాత్రమే అది కూడా రాజ్యాంగం ద్వారా రాజకీయ రిజర్వేషన్లు ఉండడం కారణం చేత, ఆ వర్గాలకు అనివార్యంగా ప్రత్యేకమైన రాజకీయ హక్కులు లభించాయి.  రిజర్వేషన్లు కారణంగా ఆయా వర్గాలకు ప్రత్యేకమైన స్థానాలను కేటాయించడం జరుగుతోంది. 

.కానీ, బడుగు, బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించే రాజకీయ పక్షాలు.. ఆచరణలో మాత్రం వారికి మొండిచేయి చూపుతున్నాయి. చాకలి,  కమ్మరి,  కుమ్మరి,  మంగలి,  బలిజ,  నాయీ బ్రాహ్మణ  ఇలా కొన్ని కులాలవారికి, వెనుకబడిన బలహీన వర్గాలకు ఇప్పటికీ చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు.  సుమారు 2,700 బలహీనవర్గ కులాలు ఉండగా  వీరిలో వందలాది కులాలవారు సంచార జీవనం గడుపుతున్నారు. వీరు సామాజిక, సాంఘిక వివక్షతను ఎదుర్కొంటున్నారు.  

సమాజంలో  ఇప్పటికీ  ఆధిపత్య వర్గాలవారు కేవలం మూడు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటారు. ఆ వర్గాలకే 90 శాతం రాజకీయ పదవులను కేటాయించడం,  60 శాతం ఉన్న బహుజన వర్గాలకు ఐదుశాతంలోపే సీట్లను కేటాయించడం  మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలకు తూట్లు పొడవడమే అవుతుంది.  ఇప్పటికైనా  సమాజంలో  జనాభాకు అనుగుణంగా ఆయా వర్గాలకు రాజకీయ పదవులు, సంపదలో వారికి వాటా అందించాలి.  దీంతో బహుజన వర్గాలకు సాంఘిక, సామాజిక, రాజకీయ న్యాయం అంది సమాజ అభివృద్ధిలో  వారు భాగస్వామ్యం అవుతారు. అప్పుడు మాత్రమే ఫూలే లాంటి మహనీయుల ఆశయాలును నెరవేరి వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. ఆ దిశగా రాజకీయ పక్షాలు కృషి చేస్తాయని కోరుకుందాం.

- డాక్టర్ మల్లారం అర్జున్ ,సోషల్ యాక్టివిస్ట్