అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

  • 6 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం .. స్తంభించిన జనజీవనం

వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం భీకరంగా మంచు తుఫాను కురిసింది. దీనికి తోడు చలిగాలులు తీవ్రంగా వీస్తుండడంతో ప్రజలు వణికిపో తున్నారు. సెంట్రల్  యూఎస్ లోని కన్సాస్  నుంచి ఈస్ట్ కోస్ట్ లోని న్యూజెర్సీ వరకు 6 కోట్ల మంది ప్రజలు చలిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్సాస్, నెబ్రాస్కా, ఇండియానా, మిస్సౌరీ, న్యూజెర్సీ, కెంటకీతో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి తుఫాన్ ను చూడలేదని అమెరికన్లు చెబుతున్నారు. మంచు విపరీతంగా కురుస్తుండడంతో రవాణా స్తంభించిపోయింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జనజీవనం స్తంభించిపోయింది. కన్సాస్, వెస్టర్న్ నెబ్రస్కా, ఇండియానాలోని పలు ప్రాంతాలను మంచు కప్పేసింది. సోమ, మంగళవారాల్లోనూ పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తుందని, న్యూజెర్సీలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 కన్సాస్, మిస్సౌరీలో రోడ్లపై వరుసగా 10, 8 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. ఆ రెండు రాష్ట్రాల్లో గంటకు 72 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రోడ్లపై ఏర్పడిన మంచును తొలగించేందుకు ఎమర్జెన్సీ టీంలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా మంచు కురుస్తుండడంతో ఓవైపు వాహనాలతో తొలగిస్తూ వెళుతుంటే మరోవైపు మళ్లీ మంచు పేరుకుపోతోందని అధికారులు తెలిపారు. రోడ్లపై భారీ ఎత్తున మంచు పేరుకుపోతుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అనౌన్స్ మెంట్లు చేస్తున్నారు.

రైళ్లు, విమానాలు రద్దు

మంచు తుఫానుతో వర్జీనియా, ఇండియానా, కన్సాస్, కెంటకీలో వందల సంఖ్యలో కారు ప్రమాదాలు జరిగాయి. అయితే, ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగలేదు. మిస్సౌరీలో 600 మంది తమ వాహనాల్లో ఇరుక్కుపోయారు. ఈశాన్య కన్సాస్​లో అధికారులు హైవేలను క్లోజ్ చేశారు. రైళ్లు, విమాన సర్వీసులూ నిలిచిపోయాయి. కాగా.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం ఎముకలు కొరికే చలి ఉంటుందని వెదర్  ఆఫీసర్లు అలర్ట్  జారీచేశారు.