సౌదీ అరేబియా ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి

శుష్క వాతావరణానికి ప్రసిద్ధి గాంచిన సౌదీ అరేబియా ఎడారిని హిమపాతం ముంచెత్తింది. పర్వతాలు, లోయలు, జలపాతాలు తెల్లని మంచుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా సౌదీ అరేబియాలోని అల్-జాఫ్ ప్రాంతంలో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాటిని చూసి అక్కడి పౌరులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వాతావరణ హెచ్చరికలు 

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అల్-జాఫ్ ప్రాంతంలో ఉరుములు, తుఫానులు, వడగళ్ళుతో కూడిన వర్షాలు కురవచ్చని సౌదీ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వీటికితోడు బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రయాణాలు చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోనూ కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, వడగళ్ళు వాన కురవచ్చని యూఏఈ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.