ఎండాకాలంలో ఎక్కువ చల్లగా, మెత్తగా కడుపులోకి వెళ్లేవి అయితే బాగుండు అనిపిస్తుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇలాంటి స్మూతీలతో రోజు మొదలుపెడితే సమ్మర్ చిటపటలకు కొంచెం చెక్ పెట్టొచ్చు. సూపర్ లెవల్లో పోషకాలు నింపుకున్న వీటి తయారీ ఈజీ. ఒక గ్లాస్ స్మూతీ తాగితే కొన్ని గంటలు ఆకలి బాధ ఉండదు. రకరకాల నట్స్, సీడ్స్, ఫ్రూట్స్‌తో తయారుచేసే వీటిని బ్రేక్ఫాస్ట్లానే కాకుండా సాయంత్రాలు శ్నాక్లా కూడా తాగేయొచ్చు. వర్కవుట్ చేశాక మీల్లా కూడా ఉపయోగపడతాయి.
స్ట్రాబెర్రీ
కావలసినవి :
స్ట్రాబెర్రీ (ఫ్రోజెన్ ) - అర కప్పు
అరటిపండు (ఫ్రోజెన్ ) - ఒకటి
పాలు - ఒక కప్పు
పెరుగు -పావు కప్పు
తేనె - ఒక టేబుల్ స్పూన్
బాదం గింజలు - ఎనిమిది
పుచ్చ గింజలు - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : బ్లెండర్ జార్లో మొదట పాలు పోయాలి. పాలు ఇష్టపడని వాళ్లు నీళ్లు వాడొచ్చు. అయితే పాలతో తయారుచేస్తే వచ్చిన క్రీమీ టెక్చర్ నీళ్లతో రాదు. తరువాత పెరుగు వేసి మిగతా పదార్థాలు వేయాలి. జార్కి మూత పెట్టి బాగా బ్లెండ్ చేస్తే చిక్కటి, క్రీమీ స్ట్రాబెర్రీ స్మూతీ గాజు గ్లాస్లో వంపుకుని తాగేయడమే.
ద్రాక్ష
కావలసినవి :
నల్ల ద్రాక్షలు (ఫ్రోజెన్ ) - అర కప్పు
ఆకుపచ్చ ద్రాక్షలు (ఫ్రోజెన్ ) - అర కప్పు
పైనాపిల్(ఫ్రోజెన్ ) - అర కప్పు
బీట్రూట్ -పావు కప్పు
వాల్నట్స్ - రెండు టేబుల్ స్పూన్
నీళ్లు - ఒక కప్పు
తయారీ : బ్లెండర్ జార్లో నీళ్లు లేదా మీకు నచ్చిన జ్యూస్ పోయొచ్చు. తరువాత కళ్లకు, చర్మానికి చాలా మేలు చేసే నల్ల ద్రాక్ష వేయాలి. బ్లెండర్ జార్కి మూత పెట్టి చిక్కగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. అలా స్మూతీ తయారవడం ఆలస్యం తాగడమే తరువాయి.
అరటి, ఓట్స్..
కావాల్సినవి :
అరటిపండు (ఫ్రోజెన్ )- ఒకటి
ఇన్స్టంట్ లేదా రోల్డ్ ఓట్స్, పెరుగు - ఒక్కోటి పావు కప్పు
పాలు - ఒక కప్పు
పీనట్ బటర్ , తేనె - ఒక్కో టేబుల్ స్పూన్
తయారీ : బ్లెండర్ జార్లో పాలు, పెరుగు ఒకదాని తరువాత ఒకటి వేయాలి. ఆ తరువాత ఓట్స్, అరటిపండు వరసగా వేస్తూ చివర్లో పీనట్ బటర్ వేయాలి. పీనట్ బటర్ చివర్లో వేయడం వల్ల స్మూతీ టెక్చర్ బాగుంటుంది. అంతేకాదు నట్స్, అవకాడోల్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. స్మూతీకి కావాల్సిన అన్ని పదార్థాలను బ్లెండర్ జార్లో వేశాక మూత పెట్టి బ్లెండ్ చేస్తే స్మూతీ రెడీ.
పైనాపిల్, బొప్పాయి
కావలసినవి :
ఆరెంజ్ జ్యూస్ - ఒక కప్పు
బొప్పాయి (ఫ్రోజెన్ ), పైనాపిల్ (ఫ్రోజెన్ ) ముక్కలు - ఒక్కోటి అర కప్పు
తేనె - ఒక టీస్పూన్
చియా లేదా సబ్జా గింజలు - ఒక టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
తయారీ : బ్లెండర్ జార్లో తాజాగా తయారుచేసుకున్న ఆరెంజ్ జ్యూస్ పోయాలి. పొద్దుపొద్దున్నే విటమిన్ సి పుష్కలంగా అందుతుంది దీనివల్ల. తరువాత బొప్పాయి ముక్కలు వేయాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బ్లెండర్ మూతపెట్టి అన్నీ కలిసిపోయేలా బ్లెండ్ చేయాలి. చిక్కటి పవర్ ప్యాక్డ్ స్మూతీ తయారు చేసిన వెంటనే తాగితే ఆ రోజు ఎనర్జిటిక్‌గా మొదలైనట్టే.