స్మార్ట్​గా ఫోర్త్ సిటీ..సౌత్ కొరియాలోని ఇంచియాన్ స్మార్ట్ సిటీ తరహాలో ఏర్పాటుకు ప్రణాళిక

  • అక్కడి ప్రజలకు ఆన్​లైన్​లోనే అన్ని సేవలు
  • ఎటుచూసిన హైటెక్​ వసతులు, విండ్​ టర్బైన్లు, సోలార్​ ప్యానెల్స్​ 
  • పరిశీలించిన రాష్ట్ర బృందం

సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి : హైదరాబాద్​కు​తలమానికంగా భావిస్తున్న ఫోర్త్ సిటీని స్మార్ట్ సిటీగా నిర్మించేందుకు రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ నగరాల పాలసీతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సొంత ప్రణాళికతోనే ముందుకుపోవాలని భావిస్తున్నది. సౌత్ కొరియా రాజధాని సియోల్​కు 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఇంచియాన్ స్మార్ట్​ సిటీ స్ఫూర్తిగా ఫోర్త్ సిటీని నిర్మించాలని ఆలోచన చేస్తున్నది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో నిర్మించనున్న ఫోర్త్ సిటీలోనూ ఇంచియాన్​లోని స్మార్ట్ పద్ధతులు అనుసరించాలని భావిస్తున్న ప్రభుత్వం..

అక్కడి కాలుష్యరహిత పెట్టుబడులు, పీపీపీ పద్ధతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్టడీ చేయిస్తున్నది. ఇందులో భాగంగానే సియోల్ పర్యటనలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, అధికారుల బృందం బుధవారం ఇంచియాన్​ సిటీని సందర్శించింది. అక్కడ అందుతున్న స్మార్ట్​పౌరసేవలు, పీపీపీ భాగస్వామ్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. 

అంతా డిజిటల్.. 

ఇంచియాన్ స్మార్ట్ సిటీలో ప్రజలకు అన్ని రకాల సేవలు ఆన్​లైన్​లోనే అందుతున్నాయి. ఐటీ, ఐవోటీల సాయంతో పోలీసింగ్​తదితర పౌర రక్షణ వ్యవస్థలు మొదలుకొని ట్రాఫిక్ కంట్రోల్, సెక్యూరిటీ, విద్యుత్ వినియోగం లాంటి అన్ని సేవలు స్మార్ట్​ఫోన్ల ద్వారానే అందిస్తున్నారు. ఇక్కడి ఇండ్లలోని ఏసీలు ఎండాకాలంలో చల్లగాలి,  చలికాలంలో వేడిగాలిని అందిస్తాయి. వీటిని కూడా అక్కడి అధికారులే నియంత్రిస్తారు. దక్షిణ కొరియాలోనే మొదటి ఫ్రీ ఎకనామిక్ జోన్ కూడా (ఎస్ఈజెడ్) ఇంచియాన్​లోనే ఏర్పాటు చేశారు. ఇక్కడ థర్మల్​విద్యుత్​లేదు.

విండ్​టర్బైన్లు, సోలార్​ప్యానెళ్ల ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ వాడుతున్నారు. రీసైక్లింగ్ వాటర్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం వాడుతున్న సాంకేతిక పద్ధతులను రాష్ట్ర మంత్రులు ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ భూభాగంలోనే ఈ స్మార్ట్​సిటీలను అభివృద్ధి చేస్తున్నారని.. కానీ హైదరాబాద్​లో ఎక్కువ స్థలం ఉన్నందున ఫోర్త్ సిటీని మరిన్ని హంగులతో నిర్మించవచ్చని మంత్రులు భావిస్తున్నారు. 

స్పోర్ట్స్ వర్సిటీలో కొరియా కోచ్ ల శిక్షణ.. 

ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సౌత్​కొరియా స్పోర్ట్స్ వర్సిటీ ముందుకొచ్చింది. ఇందుకోసం ఒప్పందం చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. కొరియా స్పోర్ట్స్ వర్సిటీలో శిక్షణ పొందిన అనేక మంది క్రీడాకారులు ఒలింపిక్స్​లో పతకాలు సాధించారు. కొరియాకు వచ్చిన పతకాల్లో ఈ స్పోర్ట్స్ వర్సిటీలో శిక్షణ పొందిన క్రీడాకారులే సగానికి పైగా తేవడం గమనార్హం.

మంత్రుల బృందం ఇంచియాన్ స్మార్ట్ సిటీ.. అందులో భాగంగానే ఉన్న చియోంగ్న, సాంగడో, ఇయాంగ్జాంగ్ ప్రాంతాలను సందర్శించింది. ఈ సందర్భంగానే కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపింది.  

ఫోర్త్ సిటీలో పెట్టుబడులకు కంపెనీలు సిద్ధం : పొంగులేటి

ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని చెప్పారు. ‘‘సౌత్ కొరియాలోని స్మార్ట్​సిటీతో పోలిస్తే.. ఫోర్త్ సిటీకి ఉన్న భూమి చాలా ఎక్కువ. దాన్ని భవిష్యత్తులో మరింత అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు. ఇక్కడ 1,500 ఎకరాలుంటే.. మన దగ్గర వేలాది ఎకరాలు ఉంది. ఫోర్త్ సిటీకి మెట్రో లైన్ కూడా వేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు.

కొరియా స్పోర్ట్స్ వర్సిటీ కోచ్​లు మన రాష్ట్రంలోని యంగ్ ఇండియా వర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం. దేశానికి పతకాలు అందిస్తాం” అని తెలిపారు. ‘‘మా పర్యటనపై ప్రతిపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు. పిల్ల కాలువ, పెద్ద కాలువ అంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ మేం సియోల్ నదులను ఎత్తుకొచ్చి తెలంగాణలో పెట్టం కదా! ఇక్కడ అనుసరించిన పద్ధతులను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేస్తం. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు చేపడతాం” అని చెప్పారు.