శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ చిన్న పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. జమాతే ఇస్లామీ, ఇంజనీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ, గులాంనబీ ఆజాద్‌కు సారథ్యంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలు ఓట్ల వేటలో వెనకబడి ఘోర పరాజయం చెందాయి. లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఓడించిన అవామీ ఇత్తెహాద్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో జమాత్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
ఇంజనీర్ రషీద్సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ కూడా ఓడిపోయారు. జమాతే ఇస్లామీ పది మంది అభ్యర్థులను బలపరచగా.. వారిలో కొందరు పోటీ నుంచి విరమించుకున్నారు. మిగిలిన వారు కూడా ఓట్లు సాధించడంలో చాలా వెనకబడి పోయారు. 2022లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. పోటీ చేసిన అన్ని చోట్ల చాలా వెనకబడింది.
మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీతో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఆ పార్టీని దెబ్బతీసింది. శ్రీగుఫ్వారా -బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఫ్తీ కూతురు ఇల్తిజా ఓడిపోయారు.