వెలుగు సక్సెస్ : చిన్న పరిశ్రమలు.. దేశ ప్రగతిలో కీలక పాత్ర ఎలా పోషిస్తాయి

 భారత పారిశ్రామిక రంగంలో చిన్నతరహా పరిశ్రమలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పన, దేశ స్థూల దేశీయోత్పత్తి, ఎగుమతుల్లో చెప్పుకోదగిన స్థాయిలో వాటాలను అందిస్తున్నది. చిన్నతరహా పరిశ్రమల రంగంలో చిన్నతరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, ఎగుమతి యూనిట్లు, అతి చిన్న పరిశ్రమలు, చిన్న తరహా సేవా ఎంటర్​ప్రైజెస్​, చేతివృత్తులవారు, గ్రామీణ కుటీర పరిశ్రమలు, మహిళా వ్యవస్థాపకులు నిర్వహించే చిన్న యూనిట్లు భాగాలుగా ఉంటాయి.

2015–16 ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 73వ రౌండ్​ నాటికి చిన్న పరిశ్రమల సంఖ్య 633.88 లక్షలు. 2019–20లో దేశీ జీడీపీలో ఎంఎస్ఎంఈలు 30 శాతం వాటా, 2020–21లో 26.83 శాతం వాటాను అందిస్తున్నాయి. ఎంఎస్​ఎంఈ రంగంలో 2/3వంతు కంటే ఎక్కువ సేవలను అందించేవి పరిశ్రమలే. దేశ మాన్యుఫాక్చరింగ్​ జీవీఏలో ఎంఎస్ఎంఈల జీవీఏ వాటా 2019–20లో 40.67 శాతం, 2020–21లో 38.47 శాతం ఉంది. 

ఉపాధి: దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎక్కువ ఉపాధిని అందించే చిన్న పరిశ్రమల రంగం అవసరం. ఎన్​ఎస్​ఎస్​ఓ 73వ రౌండ్​ సర్వే నాటికి వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లో 11.10 కోట్ల మందికి ఉపాధిని అందిస్తున్నాయి. పెద్ద పరిశ్రమల కంటే సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో నాలుగు రెట్లు ఎక్కువ శ్రమ సాంద్రత ఉంటుంది. 

సామర్థ్యం: చిన్న పరిశ్రమల్లో చేసిన పెట్టుబడి కంటే అది అందించే ఉపాధి ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థీకృత రంగంలో 5 లక్షల పెట్టుబడికి ఒకరికి ఉపాధి లభించగా, చిన్న తరహా పరిశ్రమల రంగంలో 5 లక్షల పెట్టుబడికి ఏడుగురికి ఉపాధి లభిస్తుంది. 

జాతీయాదాయ సమ పంపిణీ: పెద్ద పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమల స్థాపన వల్ల జాతీయాదాయ సమ పంపిణీలో అసమానతలు తగ్గుతాయి. ఎందుకంటే భారీ పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమలను దేశవ్యాప్తంగా స్థాపించవచ్చు. ఇవి భారీ పరిశ్రమల కంటే ఇవి ఎక్కువ మందికి ఉపాధిని ఇస్తాయి. 
మూలధన సేకరణ, వ్యవస్థాపన నైపుణ్యాలు: చిన్న పరిశ్రమల వల్ల గ్రామాల్లో ఉన్న పొదుపులను సేకరించవచ్చు. గ్రామాలకు, పట్టణాలకు వ్యవస్థాపకులు విస్తరించవచ్చు. 

సమస్యలు 

విత్త, పరపతి సమస్యలు: చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రధాన అవరోధం పరపతి కొరత. చాలా చిన్న పరిశ్రమల యూనిట్లు సొంతంగా గానీ భాగస్వామ్యంతో గానీ ఏర్పాటవుతున్నాయి. కాబట్టి మూలధనం తక్కువగా ఉంటుంది. వీరు తమ అవసరాలకు వడ్డీ వ్యాపారులు, మహాజన్​లపై ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల అధిక వడ్డీరేట్లు చెల్లించాల్సి వస్తుంది. 2020, మార్చి నాటికి పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చిన పరపతిలో 83.2 శాతం పెద్ద పరిశ్రమలకు చేరగా, 16.8 శాతం మాత్రమే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేరాయి. ప్రభుత్వం పరిశ్రమలపై వ్యయాన్ని తగ్గించడం, పరపతిపై ఆంక్షలు పెట్టడం వల్ల సంస్కరణల తర్వాత చిన్నతరహా పరిశ్రమల పరిస్థితి మరింత క్షీణించింది. 

అవస్థాపన సదుపాయాల్లో అడ్డంకులు: చిన్న పరిశ్రమలు అవస్థాపనా సదుపాయాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఉదా: విద్యుత్​ సమస్య, తక్కువ వ్యయానికి చిన్న పరిశ్రమలకు విద్యుత్​ లభించడం లేదు. 

దిగుమతి ముడిసరుకులపై అధిక సుంకాలు: సరళీకరణ చేపట్టినా ముడిపదార్థాలపై సుంకాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దీనివల్ల చిన్నపరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికితోడు చిన్న పరిశ్రమల యజమానులు స్థానిక ముడిపదార్థాలపై ఆధారపడటం వల్ల వాటిని తిరిగి సప్లయ్​ చేసిన వారికే విక్రయించాల్సి వస్తున్నది. ఫలితంగా గిట్టుబాటు ధర రావడం లేదు. ఉదా: చేనేత పరిశ్రమ. చేనేతకారులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. స్థానిక వర్తకుల నుంచి పత్తిని అధిక ధరకు కొనుక్కోవాల్సి వస్తున్నది. మరోవైపు తయారైన వస్త్రాలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. 

పురాతన యంత్రాలు ఎక్విప్​మెంట్​: చాలా చిన్న పరిశ్రమలు కాలం చెల్లిన యంత్రాలు ఉపయోగించడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నది. నాణ్యత తగ్గుతున్నది. 

మార్కెటింగ్​ సమస్యలు: పెద్ద పరిశ్రమలతో పోలిస్తే వస్తు నాణ్యత ఉన్నా తమ ఉత్పత్తులను మార్కెట్​ చేసుకోలేకపోతున్నాయి. మూలధనం కొరత, విత్త వనరుల కొరత ఇందుకు కారణం. 

ఆలస్య చెల్లింపులు: చిన్న పరిశ్రమలు ముడిపదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు చిన్న మొత్తంలో కొనడం వల్ల బేరమాడే శక్తిని పొందలేకపోతున్నాయి. పైగా వాటికి ముడి పదార్థాలు అందించే సంస్థలు ఏకస్వామ్యాన్ని, పరిమితస్వామ్యాన్ని కలిగి ఉండటం వల్ల వాటికి అడ్వాన్స్​గా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. మరోవైపు ఈ సంస్థలు తమ ఉత్పత్తులు టోకు వ్యాపారులకు ఇచ్చినప్పుడు వాటి చెల్లింపులను వెంటనే చేయడం లేదు. 

పారిశ్రామిక అసమానతలు తగ్గుతాయి: పెద్ద పరిశ్రమలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయి. ఫలితంగా పట్టణాల్లో మురికివాడలు పెరగడం, నూతన సమస్యలు ఉద్భవిస్తాయి. చిన్న పరిశ్రమలు దేశవ్యాప్తంగా స్థాపించడానికి వీలు ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక అసమానతలు తగ్గుతాయి. 
ఎగుమతుల్లో వాటా: సాంప్రదాయేతర వస్తువులైన రెడీమేడ్​ దుస్తులు, క్రీడా వస్తువులు, తోలు ఉత్పత్తులు, ఇంజినీరింగ్​ వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని చిన్న పరిశ్రమలు ఆర్జిస్తున్నాయి. దేశ ఎగుమతి ఆదాయంలో 2020-21లో ఎంఎస్ఎంఈలు 49.5 శాతం, 2021-22లో 45 శాతం అందించాయి. 

ఎంఎస్​ఎంఈలపై ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 73వ రౌండ్​ సర్వే

ఎన్​ఎస్​ఎస్​ఓ, ఎంఓఎస్పీఐ వారు 2015-16 సంవత్సరానికి 73వ రౌండ్​ సర్వేను ఎంఎస్​ఎంఈలపై నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం 633.88 లక్షల వ్యవసాయే తర ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇవి అందించే ఉపాధి 11.10 కోట్లు. 1948 ఫ్యాక్టరీ చట్టం, 1956 కంపెనీ చట్టం, నేషనల్​ ఇండస్ట్రియల్​ క్లాసిఫికేషన్​(ఎన్​ఐసీ) కింద వచ్చే నిర్మాణ కార్యకలాపాలు ఈ సర్వే నుంచి మినహాయించారు. 

    కార్యకలాపాల వారీగా విడదీస్తే వ్యాపార రంగంలో 36 శాతం, ఇతర సేవలు 33 శాతం, మాన్యుఫాక్చరింగ్​ రంగంలో 31 శాతం ఉన్నాయి. 

    ప్రాంతాల వారీగా విడదీస్తే గ్రామాల్లో 51 %, పట్టణాల్లో 49 % ఉన్నాయి .

    కేటగిరి వారీగా విడదీస్తే సూక్ష్మ పరిశ్రమలు 99.47 శాతం, 
    చిన్న పరిశ్రమలు 0.52 శాతం, మధ్యతరహా పరిశ్రమలు 0.008 శాతం ఉన్నాయి. 

    పురుషుల యాజమాన్యంలో 79.63 శాతం, మహిళల యాజమాన్యంలో 20.37 శాతం ఉన్నాయి.

    సాంఘిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇతర యాజమాన్యంలో 32.95 శాతం, ఇతర వెనుకబడిన వారి యాజమాన్యంలో 49.72 శాతం, ఎస్సీల ఆధ్వర్యంలో 12.45 శాతం, ఎస్టీల ఆధ్వర్యంలో 4.10 శాతం ఉన్నాయి.

    ఎంఎస్ఎంఈలు 11.10 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. కార్యకలాపాల వారీగా పరిశీలిస్తే వ్యాపార రంగం 35 శాతం మందికి ఉపాధిని అందిస్తున్నది. గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువ ఉపాధి లభిస్తున్నది. సూక్ష్మ పరిశ్రమలు 97 శాతం ఉపాధిని అందిస్తున్నాయి. పురుషులకు 76 శాతం ఉపాధి లభిస్తున్నది.