తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు స్కిల్ యూనివర్సిటీ

 పోటీ ప్రపంచంలో  తెలంగాణ యువత కొలువులు సాధించాలంటే ముందుగా చేయాల్సిన పని కళాశాలలను కార్ఖానాలతో అనుసంధించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  మొత్తం 289 ప్రభుత్వ,  ప్రైవేట్​ ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్ )లు ఉండగా వాటిలో 65 ప్రభుత్వ ఐటీఐ శిక్షణ సంస్థలను 2,324 కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సర్వీసెస్(ATS)గా సంస్కరించేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(TTL) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలో శిక్షణపొందే విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.

సమాచార, శాస్త్ర, సాంకేతిక, ఖగోళ వైజ్ఞానిక, ఔషధ, పరిపాలన, వ్యాపార, వాణిజ్య, న్యాయ, ఉపాధ్యాయ విద్యలకు నైపుణ్య విద్య తోడైతే యువతకు విశ్వవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ యువతలో సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు నైపుణ్య విద్య అవసరమని భావించారు. దీనికోసం హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య  పద్ధతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.  ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ  నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పాస్ చేయించి విశ్వవిద్యాలయం ఏర్పాటును చట్టబద్ధం చేయనున్నారు.
 
ప్రపంచీకరణ నేపథ్యంలో యువతకు నైపుణ్య విద్య అవసరం

ప్రపంచీకరణ నేపథ్యంలో దేశ యువతకు  నైపుణ్య విద్య అవసరం అని 2008వ  సంవత్సరంలో  మన్మోహన్ సింగ్  ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత విశ్వవిద్యాలయాల నిధుల మంజూరు సంఘం(UGC) ఒక కమిటీగా  ఏర్పడి విద్యతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే నైపుణ్య విద్యను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని తెలిపింది.  జులై 31, 2008లో  లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ స్కిల్  డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NSDC)ను  భారత పరిశ్రమల చట్టం సెక్షన్ 25 ప్రకారం ఏర్పాటు చేసి నైపుణ్య అభివృద్ధికి ఆనాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం బాటలు వేసింది.  2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్  ప్రేమ్ వర్క్(NSQF)ను రూపొందించి దేశంలో నైపుణ్య విద్యకు పునాదులు వేసింది.  ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ మోదీ ప్రభుత్వం ప్రభుత్వ,  ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో భారత ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకి  నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని తెచ్చారు.  

ఐటీఐ విద్యార్థులు చాలా మేరకు స్కిల్స్​ లేక..

పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు కేవలం 10 శాతం మంది బీటెక్ రెండో సంవత్సరంలో చేరి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రైన్యూర్ షిప్ అంచనాల ప్రకారం తెలంగాణలో ఐటీఐ శిక్షణ పూర్తిచేసుకుని సంవత్సరానికి సుమారు 26 వేలమంది బయటికి వస్తున్నారు.  వీరిలో వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు.  కొద్దిమంది తమ సొంత కాళ్ళ మీద నిలబడుతూ పూర్తి చేసిన శిక్షణతో స్వయం ఉపాధి పొందుతున్నారు.  చాలావరకు ఐటీఐ పూర్తి చేసినవారు తమ  నైపుణ్యాలను పెంచుకోని కారణంగా  లేబర్లగా పనిచేస్తున్నారు.  

ఏటా లక్షమంది ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లు

తెలంగాణలో ఉన్న సుమారు 179 ఇంజినీరింగ్ కళాశాలలలో 12 కళాశాలలు ప్రభుత్వ కళాశాలలుగా ఉన్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందేవాళ్ళు ఏటా సుమారు ఒక లక్ష మంది వరకు ఉంటారు. ఈ లక్ష మందిలో సుమారు 10వేల మందిలో మాత్రమే నైపుణ్యాలు కలిగి ఉంటున్నారు.

పట్టభద్రుల్లోనూ నైపుణ్యాల కొరత

తెలంగాణలో 1,040 డిగ్రీ కళాశాలలో  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సుమారు 138 వరకు ఉన్నాయి. ఈ కళాశాలలలో సుమారు సంవత్సరానికి రెండు లక్షల మంది పట్టభద్రులవుతున్నారు. వీరిలో ఎక్కువమంది గ్రామీణ నేపథ్యం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతుంటారు. డిగ్రీ పూర్తి చేసినవారిలో కూడా 90 శాతం మందిలో నైపుణ్యాలు లేకపోవడంతో నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. 

స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులు

యూనివర్సిటీలో 17 కోర్సులతో ఏడాదికి 20వేల మందికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్,   డిప్లొమా  ఇతర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. త్వరలో ప్రారంభించబోయే హైదరాబాద్ స్కిల్ యూనివర్సిటీ(HSU)లో కన్​స్ట్రక్షన్, ఫార్మా, బ్యాంకింగ్,  ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్,  కాస్మటాలజీ,  ఫుడ్ టెక్నాలజీ, జమాలజీ, హెల్త్ కేర్,  మొబైల్ ఫోన్ టెక్నీషియన్, ఆర్గానిక్ ఫార్మింగ్,  రిటైల్ మేనేజ్మెంట్,  సాఫ్ట్​వేర్​ డెవలప్మెంట్ వంటి కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణలో తొలి స్కిల్ యూనివర్సిటీ ఆవిష్కర్తగా చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.

గత ప్రభుత్వం పట్టించుకోలేదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏండ్లలో విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్య విద్య పెంపొందించాలనే ఆలోచన చేయలేదు.  తెలంగాణలో 58 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు,  75 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు కలిపి మొత్తం 133 పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా సుమారు ఏడాదికి 10వేల మందికి పైగా పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు బయటికి వస్తున్నారు. వీరిలో  సుమారు 300 నుండి 400 మంది మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడగా, మిగతా వారంతా సరైన నైపుణ్యం లేని కారణంగా లేబర్లగా పరిశ్రమల్లో  
పని చేసుకుంటూ జీవిస్తున్నారు.

- కోటూరి
మానవతారాయ్,
టీపీసీసీ అధికార ప్రతినిధి,
 తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్