ఈ ఏడాది నుంచే స్కిల్​ ట్రైనింగ్​

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్​మెంట్ అందజేస్తం
  • స్కిల్​ వర్సిటీలో సీటు వస్తే జాబ్​ గ్యారెంటీ అనేలా శిక్షణ
  • భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలు
  • ఆరు కోర్సుల్లో 2 వేల మందికి అడ్మిషన్: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు : వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని, దీన్ని అధిగమించేందుకే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. స్కిల్స్ యూనివర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడతామని, ఈ ఏడాది ఆరు కోర్సులు ప్రారంభించి 2 వేల మందికి అడ్మిషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

‘‘స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వాళ్లకు డిగ్రీ సర్టిఫికెట్లు అందించాలని నిర్ణయించాం. ఏడాదికి రూ.50 వేల నామమాత్రపు ఫీజుతో శిక్షణ అందిస్తాం. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ చేసి.. ఉచితంగా కోర్సు పూర్తిచేసే అవకాశం కల్పిస్తాం’’ అని చెప్పారు.

యువతకు శిక్షణ అందించి, ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని.. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోనూ అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ‘‘స్కిల్స్ వర్సిటీలో హెల్త్ కేర్,  ఫార్మా అండ్ లైఫ్‌ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఆటోమేటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్​కామిక్స్‌, కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్‌, అడ్వాన్స్‌డ్‌ మ్యాన్​ఫాక్చరింగ్, రీటైల్ ఆపరేషన్స్‌ అండ్ మేనేజ్‌మెంట్‌, ఈ-కామర్స్‌ అండ్ లాజిస్టిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్,  మీడియా, గేమింగ్‌ అండ్ ఫిల్మ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీ కండక్టర్స్‌, డిజిటల్ డిజైన్ కోర్సులు ప్రవేశపెడతాం. ముందు 2వేల అడ్మిషన్స్​తో మొదలుపెట్టి, క్రమంగా 20 వేలకు పెంచుతాం.

 మూడేండ్ల బ్యాచిలర్‌ డిగ్రీ, ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటే సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ లో వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం” అని వివరించారు. ‘‘జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయం, విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు.  దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారు.

 రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి పునాదులు వేశారు. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో కూడా ఆ మార్పులు రావాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. మహాత్మాగాంధీ యంగ్ ఇండియా పత్రిక మొదలు పెట్టారని, ఆయన స్ఫూర్తితోనే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్స్ యూనివర్సిటీ ఉద్దేశమని, దీనిపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలిస్తే సంతోషించే వాళ్లమని, కానీ వాళ్లు వాకౌట్ చేసి వెళ్లిపోయారని విమర్శించారు. 


ప్రధాన ప్రతిపక్ష నేతకు దళితులంటే పడదు..

బీఆర్ఎస్ వాళ్లు దళిత వ్యక్తిని సీఎం చేస్తానని మోసం చేశారని, దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి బర్త్​రఫ్​చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే గడ్డం ప్రసాద్​ను స్పీకర్ చేశారు. కానీ- దళితులంటే ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్ష నేతకు పడదు.  మీ ముందు కింద కూర్చోకూడదనే.. దళితులను.. మిమ్మల్ని అధ్యక్షా అనడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదు’’ అని అన్నారు. కేసీఆర్ కు రాజకీయ జీవితం ఇచ్చింది, హరీష్ ను మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. 

మైక్ ఇస్తే శాపనార్థాలు, ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులతో వాదించేలా కృషి చేశాం. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం వాళ్లు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. 

స్కిల్స్​వర్సిటీని అందరూ స్వాగతించాలి: మంత్రి కోమటిరెడ్డి 

రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దీన్ని అన్ని పార్టీలు స్వాగతించాలని కోరారు. యువత భవిష్యత్తు మార్పునకు ఎంతో ఉపయోగపడుతుం దన్నారు. అసెంబ్లీలో స్కిల్స్ యూనివర్సిటీ పై జరిగిన చర్చలో కోమటిరెడ్డి వివరాలు ఇచ్చారు. బీటెక్, పాలిటెక్నిక్ పూర్తి చేసిన యువత నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.