సర్కార్ భూములకు పరిహారం కొట్టేసేందుకు స్కెచ్

  • చిన్నోనిపల్లి కొత్త ఊరిలో పట్టాల పంచాయితీ
  • మిగిలిన ఇండ్ల స్థలాలకు డూప్లికేట్ పట్టాలతో ఆక్రమణ
  • పైరవీ కారులు, ఆఫీసర్ల కుమ్మక్కు!

గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ఏరియాలో పైరవీ కారులు, రెవెన్యూ ఆఫీసర్లు కుమ్మక్కుతో సర్కార్ భూములకు పరిహారం కొట్టేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారని పట్టాదారులు వాపోతున్నారు. ఆర్​ఆండ్​ ఆర్​ సెంటర్​ లో కమ్యూనిటీ బిల్డింగ్​ కోసం వదిలిన ఇంటి స్థలాలకు సంబంధించి ప్లాట్లకు డూప్లికేట్ పట్టాలు సృష్టించి చదును చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు డూప్లికేట్ పట్టాలతో ప్లాట్లను ఇతరులకు కట్టబెడుతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

సర్కార్ భూముల పరిహారం కోసం స్కెచ్

చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో చిన్నంపల్లి, చాగదోన తదితర గ్రామాలకు సంబంధించి భూములు ముంపునకు గురయ్యాయి. అందులో 421 సర్వే నెంబరులో దాదాపు 100 ఎకరాలు సర్కార్ భూమి ఉండగా.. 15 మంది రైతులకు 50 ఎకరాల్లో సాగు పట్టాలున్నాయి. మిగతా 50 ఎకరాలకు సంబంధించి ఎవరికీ పట్టాలు కానీ పొజిషన్ కానీ లేదు. దీనిని గుర్తించిన రెవెన్యూ ఆఫీసర్లు, పైరవీ కారులు కుమ్మక్కయ్యారు. 

భూమిని సాగు చేస్తున్నట్లు తప్పుడు రికార్డులు రూపొందించి పరిహారం కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 437 సర్వే నంబర్లో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కేవలం 30 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఉండగా.. మిగతా 50 ఎకరాలు భూమి పడావుగా ఉంది. వాటికి కూడా పైరవీకారులు ఇతరుల పేర్లు ఎక్కించి పరిహారం కొట్టేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు.

100 ఎకరాలకు 7.50 కోట్లు

సర్కార్ భూములు కూడా ముంపునకు గురైతే ఎకరాకు రూ. 7.5 లక్షల పరిహారంగా రైతులకు ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చూసుకున్న కొందరు.. 421,437 సర్వే నెంబర్లలో దాదాపు 100 ఎకరాల పొలాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికే పలు రకాలుగా రికార్డులను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. సర్కార్ భూములు ఆన్ లైన్ లో రికార్డు చేయడానికి గట్టు మండల కేంద్రంలోని ఓ మీసేవ కేంద్రంతో పాటు ఆన్ లైన్ సెంటర్ నిర్వాకులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అదేవిధంగా చాగదోనకు చెందిన ఒక పైరవీకారుడు రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని రికార్డులు సృష్టించి ఏడున్నర కోట్ల పరిహారం కోసం చక్రం తిప్పుతున్నారని పలువురుఅంటున్నారు. వీరికి గతం నుంచి ఉన్న రెవెన్యూ ఆఫీసర్లతో పాటు ప్రస్తుత రెవెన్యూ ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్లాట్ల పంచాయతీ

చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో గతంలో నిర్వాసితులకు 360 పట్టాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న వివిధ కులస్తులకు నాలుగు ఫ్లాట్ల చొప్పున పట్టాలు ఇవ్వకుండా అలాగే పెట్టారు. గ్రామంలో ఉన్న రెడ్డి, గౌడ, కురువ, బోయ, ఉప్పరి, వడ్డెర, దాసరి తదితర కులస్తులు వారి వారి అవసరాల కోసం ఆ ప్లాట్లను ఉపయోగించుకోవాల్సి ఉన్నది.

కానీ ఫ్రీగా ఉన్న ప్లాట్ లకు ప్రస్తుతం కొందరు డూప్లికేట్ పట్టాలు సృష్టించుకుని కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న 28 పట్టాలకు ఇప్పటికే పదింటికి    డూప్లికేట్ పట్టాలు సృష్టించి కబ్జాకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. వీరికి కూడా మీ సేవతోపాటు ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకుడు,పైరవీకారులు  కీలకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

మా దృష్టికి రాలేదు

సర్కార్ భూములకు పరిహారం కొట్టేసే విషయంపై రూమర్ జరుగుతున్నది. ఈ విషయం ఇంకా మా దృష్టికి ఎవరు తీసుకురాలేదు. డూప్లికేట్ ఇండ్ల స్థలాలపై విచారణ చేస్తాం. దీనిపై ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు.
- సరిత రాణి, తహసీల్దార్, గట్టు.