రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ కౌన్సిలర్కు ఆరునెలల జైలుశిక్ష

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టిన  కేసులో మాజీ కౌన్సిలర్ కు 6 నెలలు జైలు శిక్ష, రూ.7 వేల జరిమానా విధిస్తూ  సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే.. 2017, ఫిబ్రవరి 2న సిరిసిల్ల కార్గిల్ లేక్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అటుగా వెళ్తున్న కౌన్సిలర్ గుగులోత్ హనుమంతును ఆపి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ మెషీన్ తో చెక్ చేయగా మద్యం తాగినట్టు తేలింది. 

దీంతో పోలీసులు కౌన్సిలర్ వివరాలను నమోదు చేస్తుండగా వారిని బూతులు తిడుతూ.. ‘ నేను తలుచుకుంటే పోలీసులను గేట్ కాడ కావలి పెట్టుకుంటా’ అని హనుమంతు రెచ్చిపోయాడు. ఆపై కానిస్టేబుల్ నాగరాజు గల్ల పట్టి గుంజాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  కేసును విచారించిన సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి ప్రవీణ్ పైవిధంగా తీర్పు చెప్పారు.