కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్​కౌంటర్​..ఆరుగురు మావోయిస్టులు మృతి

  • మృతుల్లో ఇద్దరు మహిళలు..తప్పించుకున్న మరో మావోయిస్టు
  • లచ్చన్న దళంగా గుర్తింపు..ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
  • హెలికాప్టర్​లో హైదరాబాద్​కు తరలింపు
  • ఇది విప్లవ ద్రోహుల పనే: ఆజాద్.. 9న జిల్లా బంద్​కు పిలుపు
  • ఆరుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం/కరకగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం, మోతె మధ్య అడవుల్లో బుంగదోన ఏరియాలో గురువారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎన్​కౌంటర్ నుంచి మరో మావోయిస్టు తప్పించుకోగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హెలికాప్టర్​లో హైదరాబాదుకు తరలించారు. కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ దళాలకు ఉదయం 6.45 గంటలకు ఎదురుపడిన సాయుధ మావోయిస్టులను లొంగిపొమ్మని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

40 రోజులుగా జిల్లాలో సంచారం

భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల, కరకగూడెం, ములుగు జిల్లా మంగపేట, మేడారం, తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల్లో 40 రోజుల నుంచి లచ్చన్న దళం సంచరిస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. జులై నెలాఖరున దామెరతోగు, కౌశెట్టివాయి గ్రామ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక మావోయిస్టు చనిపోయాడు. అప్పుడే లచ్చన్న దళం దండకారణ్యం నుంచి గోదావరి దాటి తెలంగాణలోకి ప్రవేశించినట్టు సమాచారం అందింది. అప్పటి నుంచి దళాన్ని గ్రేహౌండ్స్ వెంటాడుతున్నది. 

గురువారం కూంబింగ్​చేస్తున్న బలగాలకు రఘునాథపాలెం అడవుల్లో లచ్చన్న దళం తారసపడింది. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. భద్రాద్రికొత్తగూడెం, -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న(రాయిగూడెం, చత్తీస్​గఢ్), అతని భార్య తులసి అలియాస్ పూనెం లక్కీ(కుంబాడు, చత్తీస్​గఢ్​), పాల్వంచ-–మణుగూరు దళ కమాండర్ రాము (జగ్గారం, ఎటపాక మండలం, ఏపీ), కోసి(కోమటిపల్లి, చత్తీస్​గఢ్)

సుకురాం అలియాస్ గంగాల్ (కోమటిపల్లి, చత్తీస్​గఢ్), దుర్గేశ్​(బొట్టెం, చత్తీస్​గఢ్​)లు మరణించినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కాల్పుల్లో గ్రేహౌండ్స్​కానిస్టేబుళ్లు వంశీ, సందీప్​లకు గాయాలయ్యాయి, వంశీకి పొట్టలో, సందీప్​కు కాలిలో తూటాలు దిగడంతో వారిని భద్రాచలం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం హెలికాప్టర్లో హైదరాబాదుకు తరలించారు.

రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత : ఆజాద్​

ఈ ఎన్​కౌంటర్​ విప్లవద్రోహుల పనేనని భద్రాద్రికొత్తగూడెం, అల్లూరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రులే దీనికి బాధ్యత వహించాలని, నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు. ఈ నెల 9న భద్రాద్రికొత్తగూడెం జిల్లా బంద్​కు పిలుపునిచ్చారు.

జిల్లాలో రెడ్ అలర్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్​కౌంటర్ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటీవల చర్ల మండలం చెన్నాపురం వద్ద ఇన్​ఫార్మర్ పేరుతో బంటి రాధ అనే మాజీ మావోయిస్టును హత్య చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తున్నారు. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను ప్రారంభించడాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది. ఎస్పీ రోహిత్​రాజ్, ఓఎస్డీ పంకజ్ పరితోశ్ అన్ని స్టేషన్లలో పోలీసులను అప్రమత్తం చేశారు.

కూంబింగ్ పార్టీపై పిడుగు..జవాన్ దుర్మరణం

చత్తీస్​గఢ్ దండకారణ్యంలో గురువారం ఉదయం కూంబింగ్​చేస్తున్న బస్తర్​బెటాలియన్ జవాన్లపై పిడుగు పడింది. ఈ ఘటనలో జవాన్ కమలేశ్ హేమ్లా(23) మరణించారు. బీజాపూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని కాంవడ్​గావ్ అడవుల్లో కూంబింగ్ జరుపుతుండగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగు పడింది. కమలేశ్ హేమ్లా తీవ్రంగా గాయపడగా బీజాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. బీజాపూర్​లోని సంతోష్​పుర్ ఇతని స్వగ్రామం.

తప్పించుకున్న మరో మావోయిస్ట్

లచ్చన్న దళంలో కీలక  సభ్యుడు మాసయ్య ఎన్​కౌంటర్​నుంచి తప్పించుకున్నాడు. దళంలో ఏడుగురు సభ్యులుండగా కాల్పుల సమయంలో మాసయ్య ఆ ప్రదేశం నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అతని కోసం అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎన్​కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులు రెండు ఏకే47, 1 ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్, మ్యాగ్జిన్, లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగులు, ఇతర సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టు​మార్టం కోసం తరలించారు.