ప్రమాదం పొంచి ఉందా..? భూమివైపు దూసుకొస్తున్న 6 ఆస్టరాయిడ్లు

  • 25 లక్షల నుంచి 56 లక్షల కి.మీ. దూరంలో దూసుకుపోనున్న గ్రహశకలాలు 
  • ప్రస్తుతానికి వీటితో ఎలాంటి ప్రమాదం లేదన్న నాసా 

వాషింగ్టన్: ఆరు గ్రహశకలాలు గురువారం భూమికి దగ్గరగా రానున్నాయి. భూమికి సుమారు 25 లక్షల నుంచి 56 లక్షల కిలోమీటర్ల దూరంలో అవి దూసుకు పోనున్నా యి. ప్రస్తుతానికి వీటితో ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. అయితే, ఇవి వెళ్తున్న కక్ష్యలను బట్టి చూస్తే.. భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చేంత దూరాల్లోనే ప్రయాణిస్తున్నాయని తెలిపింది. 

‘‘ఈ ఆరు గ్రహశకలాలు ఒక గ్రూపులా దగ్గర దగ్గరగా తిరుగుతున్నాయి. వీటిలో అతిపెద్దదైన 363305 (2002ఎన్ వీ16) అనే ఆస్టరాయిడ్ సుమారుగా 310 మీటర్లు (580 ఫీట్లు) వెడల్పుతో ఉంది. ఇది భూమికి 45 లక్షల కి.మీ. దూరం నుంచి సెకనుకు 4.87 కి.మీ. స్పీడ్ తో ప్రయాణించనుంది. ఈ ఆరింటిలో 41 మీటర్ల సైజులో ఉన్న 2023టీజీ14 అనే ఆస్టరాయిడ్ అన్నింటికంటే భూమికి దగ్గరగా రానుంది. 

ఇది భూమికి 25 లక్షల కి.మీ. దూరం నుంచి సెకనుకు 6.9 కి.మీ. వేగంతో దూసుకుపోనుంది. అలాగే సుమారు 54 మీటర్ల సైజులో ఉన్న 2015హెచ్ఎం1 అనే గ్రహశకలం 55 లక్షల కి.మీ. దూరం నుంచి సెకనుకు 10.88 కి.మీ. స్పీడ్ తో దూసుకుపోనుంది. మిగతా మూడు 30 నుంచి 92 మీటర్ల సైజులో ఉన్నాయి. ఇవి 45 నుంచి 56 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోనున్నాయి” అని నాసా వివరించింది. 

ప్రమాదం లేకున్నా.. ఫోకస్ పెట్టాల్సిందే  

సుమారు 460 కోట్ల ఏండ్ల క్రితం మన సోలార్ సిస్టంలో సూర్యుడు, గ్రహాలు ఏర్పడిన సమయంలో మిగిలిపోయిన పదార్థం ముక్కలతోనే ఆస్టరాయిడ్లు ఏర్పడ్డాయి. ఇవి కొన్ని చిన్న చిన్న బండరాళ్ల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల సైజు దాకా లక్షల సంఖ్యలో ఉన్నాయి. సాధారణంగా ఇవి మార్స్, జుపిటర్ గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ప్రాంతంలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. 

అయితే, ఈ ప్రాంతం వెలుపల తిరుగుతున్న అనేక గ్రహశకలాలు తరచూ భూమికి సమీపంలోని కక్ష్యల గుండా ప్రయాణిస్తున్నాయి. అందుకే.. తాజాగా భూమి సమీపం నుంచి వెళ్తున్న ఆస్టరాయిడ్లతో ప్రమాదం లేకపోయినా వీటిని నిరంతరం పరిశీలించడం ద్వారా విశ్వంలో గ్రహశకలాల కక్ష్యలు, వాటి గమనాలను బాగా అర్థం చేసుకోవచ్చని.. తద్వారా భవిష్యత్తులో ఆస్టరాయిడ్ల ముప్పును తప్పించేందుకు వీలవుతుందని నాసా వెల్లడించింది.