చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా..ఏపీ-, తెలంగాణ సరిహద్దులో కలకలం

  • కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద బస్సులో పట్టివేత
  • ఆరుగురు నిందితుల అరెస్ట్ 

కోదాడ, వెలుగు: చాక్లెట్ల రూపంలో గంజాయిని మార్చి వాటిని ప్రైవేట్​ బస్సులో భువనేశ్వర్  నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్  అధికారులు పట్టుకున్నారు. వివరాలను కోదాడ ఎక్సైజ్  అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్  వేడుకల్లో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్ కు  గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానంతో సూర్యాపేట జిల్లా నల్లబండ గూడెం వద్ద ఎక్సైజ్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు.

భువనేశ్వర్  నుంచి హైదరాబాద్  వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్  బస్సును తనిఖీ చేయగా నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని లగేజీ చెక్  చేయగా, వారి వద్ద దాదాపు1,000 గంజాయి చాక్లెట్లు దొరికాయి. 25 చాక్లెట్​ ప్యాకెట్లలో వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గురు అనిల్ కుమార్, రజని, బంకిమ్, మామిటూ నాయక్, సాజీబాని, జాను నాయక్  గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్చి ఎవరికీ  అనుమానం రాకుండా ప్రైవేట్​ బస్సులో తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు కోదాడ ఎక్సైజ్  సీఐ శంకర్  తెలిపారు.