మోతె మండలంలో గంజాయి విక్రేతల అరెస్ట్​

మోతె (మునగాల), వెలుగు : మండలంలోని మామిళ్లగూడెం గ్రామ శివారులో ఆరుగురు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్​చేశారు. ఎస్ఐ యాదవేందర్​రెడ్డి వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాష్ హంతాల(19) అక్కడి నుంచి గంజాయి కొనుగోలు సూర్యాపేట జిల్లాలో అమ్మేవాడు. ఇటీవల సుభాష్​రైలులో అరకు వెళ్తుండగా ఖమ్మంకు చెందిన బత్తుల హరీశ్,  బత్తుల విరాట్ అనే ఇద్దరు యువకులు అతడికి పరిచయమయ్యారు. అప్పటి నుంచి హరీశ్, విరాట్.. సుభాష్ నుంచి గంజాయి కొనుగోలు చేసి అమ్ముతుండేవారు. 

ఈనెల 5న వీరిద్దరూ సుభాష్ కు ఫోన్ చేసి గంజాయి తీసుకొని ఖమ్మం రమ్మని చెప్పారు. ఈనెల 8న సుభాష్  గంజాయిని చేసుకొని కాలేజీ బ్యాగ్ లో పెట్టుకొని ఖమ్మంకు వచ్చారు. విరాట్, హరీశ్, షేక్ హుస్సేన్ భాష ముగ్గురు సుభాష్ ను కలిసి గంజాయి తీసుకొని నలుగురు కలిసి రెండు బైక్ లపై మామిల్లగూడెం గ్రామ శివారులోని సింగరేణి టోల్ ప్లాజా వద్దకు వెళ్లారు.

 హరీశ్, విరాట్​కు పరిచయం ఉన్న వెలుగు జయసింహ,  దోసపాటి కల్యాణ్ రామ్, పగడాల ఉదయ్ కుమార్ రెడ్డి, వెలుగు ఆనంద్, కొండా ఉదయ్ కు ఫోన్​చేసి టోల్ ప్లాజా వద్ద గల వెంచర్ కు రమ్మని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు మోతే పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 వేల విలువైన 1.640 గ్రాముల గంజాయి, 3 వాహనాలు, 5 మొబైల్స్​స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ ​చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.