నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు 11 రోజులపాటు మహశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు బ్రోచర్ రిలీజ్ చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో, ఆత్మకూరు డీఎస్పీ దేవస్థానం పరిపాలన భవనంలో ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించారు, ఈ సమావేశంలో చైర్మన్,ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషిచేయాలని సూచించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబందించిన అంశాలను కూలంకుషంగా చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు.
మహాశివరాత్రికి శ్రీశైలం క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు విచేస్తారని, పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో విచ్చేసే భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా అటవీశాఖ అధికారులతో కలసి ఎర్పాట్లను చేయాలని ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ప్రతి విభాగం యాక్షన్ ప్లాన్ రూపొందించి కార్యాలయానికి అందించాలని, యాక్షన్ ప్లాన్ అనుగుణంగా ఏర్పాట్లను వెంటనే చేపట్టాలన్నారు. అలాగే ఉత్సవాలలో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటిని చర్చించారు.. శ్రీశైలం మల్లన్న భక్తులకు అదనపు క్యూలైన్లు, వసతి, మంచినీరు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఉత్సవ క్రతువులు, శౌచాలయాలు తదితర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్షించనున్నారు.
కార్యక్రమ వివరాలు
- మార్చి 1 వ తేది: ధ్వజారోహణ, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే పట్టువస్త్రాలు సమర్పణ
- మార్చి 2 వ తేది:భృంగి వాహన సేవ
- మార్చి 3 వ తేది: హంసవాహన సేవ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారిచే శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ
- మార్చి 4 వ తేది: మయూరవాహనసేవ, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం వారిచే, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాలు సమర్పణ
- మార్చి 5 వ తేది: రావణ వాహన సేవ, రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టు వస్త్రాలు సమర్పణ
- మార్చి 6 వ తేది: పుష్ప పల్లకీ సేవ
- మార్చి 7 వ తేది: గజవాహనసేవ
- మార్చి 8 వ తేది: మహాశివరాత్రి ప్రభోత్సవం, నంది వాహనసేవ, స్వామివారికి లింగోద్భవకాలంలో మహారుద్రాభిషేకం, కళ్యాణోత్సవం
- మార్చి 9 వ తేది: రథోత్సవం, తెప్పోత్సవం
- మార్చి 10 వ తేది: ధ్వజావరోహణ
- మార్చి 11 వ తేది: అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం