- ఓటుకు రూ.3వేల నుంచి 6వేలు పంచిన బీఆర్ఎస్ ప్యానెల్
- 12 డైరెక్టర్ స్థానాల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ ప్యానల్ గెలుపు
రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానెల్ 12 డివిజన్ లకు గానూ 8 డివిజన్లలో గెలిచింది. కాగా ఈ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం సాగినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.6వేల దాకా పంచినట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. సొసైటీ పరిధిలో 25వేల మంది ఖాతాదారులు ఉండగా బ్యాంకు టర్నోవర్ రూ.150 కోట్లుగా ఉండడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో సొంత ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని బరిలో నిలిపాయి.
ప్రలోభానికి తెరలేపిన బీఆర్ఎస్
సిరిసిల్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిధిలో 12 డివిజన్లు ఉండగా మొత్తం 6177 ఓటర్లు ఉన్నారు. ఒక్కో డివిజన్‌లో 500 నుంచి 600 ఓట్లు ఉండగా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్యానెల్ వారం కిందనే ప్రలోభాలకు ప్లాన్ చేసింది. బుధవారం రాత్రి నుంచే విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతల సూచనలతో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నెగ్గేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేశారనే చర్చ నడుస్తోంది.
ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా కొందరు డబ్బులు పంచేదాకా ఓటేయడానికి రాలేదని కొందరు డైరెక్టర్ అభ్యర్థులు వాపోయారంటే ప్రలోభాలు ఏ రేంజ్‌లో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కావడానికి ఒక్కో అభ్యర్థి రూ. లక్షల్లో ఖర్చుపెట్టినట్లు సమాచారం. 2018లో జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సగం సీట్లే సాధించింది. అయినప్పటికీ ఇండిపెండెంట్లను కలుపుకొని చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఈక్రమంలో ఈసారీ కూడా అధికారం చేజిక్కించుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీసినట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్యానెల్ గెలుపు
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ పాలక వర్గంలో 12 మంది డైరెక్టర్ స్థానాలు ఉండగా 61 మంది బరిలో దిగారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్యానెల్ నుంచి 36 మంది బరిలో నిలువగా, 25మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 డివిజన్ లకు 8 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ నుంచి పత్తిపాక సురేశ్, కాంగ్రెస్ నుంచి చొప్పదండి ప్రమోద్ గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా వరుస హరిణి, గుడ్ల నందు గెలుపొందారు.
బీఆర్ఎస్ ప్యానెల్ నుంచి ర్యాపెల్లి లక్ష్మీనారాయణ, అడ్లగల్ల మురళీ, పాటీ రాజ్‌కుమార్, బుర్రరాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఎనుగందుల శంకర్, కోడం సంజీయ్ గెలుపొందారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు కోఆపరేటివ్ ఆఫీసర్లు తెలిపారు. కేటీఆర్ సన్నిహితుడు ర్యాపెల్లి లక్ష్మీనారాయణను చైర్మన్‌గా ఎన్నుకోనున్నట్లు సమాచారం.