పని తక్కువ.. ఖర్చు ఎక్కువ!

  • 20 గంటలు ఆగకుండా నడిస్తేనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యం 
  • సింగరేణి వ్యాప్తంగా అధ్వానంగా యంత్రాల పనితీరు
  • టన్నుకు ఖర్చు రూ.10 వేలు.. అమ్మితే వచ్చేది రూ. 4వేలు
  • భవిష్యత్ లో సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు
  • రాష్ట్ర సర్కార్​కు నివేదిక అందించిన సింగరేణి అధికారులు
  • కార్మికులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సంస్థ మనుగడ  

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణివ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో యంత్రాల( మెషీన్ల) పనితీరు అధ్వానంగా తయారైంది. భవిష్యత్ లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయనే ఆందోళనలో యాజమాన్యం ఉంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోకుంటే తీవ్ర ఎఫెక్ట్ పడనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త బొగ్గు బ్లాక్ ల కేటాయింపు లేకపోవడం.. ఇప్పుడు నడుస్తున్నవే క్రమేణా మూతపడే పరిస్థితి తలెత్తనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరిగిపోగా.. విద్యుత్ ప్రాజెక్టు ద్వారానే సంస్థ నిలదొక్కుకుం టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సింగరేణి అధికారులు ఇటీవల సర్కార్​కు నివేదిక అందించారు. దీంతో ఇటీవల రెండు రోజుల పాటు ‘ఉజ్వల సింగరేణి –-ఉద్యోగుల పాత్ర ’ పేరుతో అవగాహన కల్పించారు. ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లు, సూపర్​వైజర్లు సమిష్టిగా కృషి చేస్తేనే సంస్థ మనుగడ కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 

తగ్గుతున్న పని గంటలు

సింగరేణిలో మొత్తం18 ఓపెన్​కాస్ట్​ మైన్స్ ఉండగా వీటి నుంచే 80 శాతం బొగ్గు ఉత్పత్తి వస్తోంది. ఇందుకు యంత్రాలదే కీ రోల్. అయితే.. ఆశించిన స్థాయిలో మెషీన్ల పని గంటలు పెంచకపోతుండగా తద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గుతోంది. ఆర్థికంగా సంస్థ నష్టపోతుంది. సంస్థ కోట్లలో వెచ్చించి భారీ మెషీన్లను కొనుగోలు చేస్తూ ఓసీపీల్లో బొగ్గు వెలికితీస్తోంది. ప్రస్తుతం 66 షావెల్స్​, 425 డంపర్లు, 109 డోజర్లు, 48 డెరిల్స్​, 175 ఇతర యంత్రాలు ఉన్నాయి. భారీ మెషీన్లు సగటున 12 –15 గంటలు పని చేస్తున్నా ఆశించిన పనితీరు చూప డంలేదు. 

ఓసీపీ పనిచేసే యంత్రాలను రోజుకు 20 గంటలు వినియోగించాలి. కానీ.. 12 గంటల కంటే ఎక్కు వ పని చేయడంలేదు. షావెల్​11.8 గంటలు, డంపర్లు 8.2 గంటలు, డోజర్లు 4.5 గంటలు, డెరిల్స్​ 5.5 గంటలు మాత్రమే పని చేస్తున్నట్టు గుర్తించింది.  మొత్తం 828 యంత్రాలు సగటున రోజుకు 18 గంటల పాటు పని చేయాల్సి ఉండగా 7.2 గంటల మాత్రమే చేస్తుండడం సంస్థను ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన గంటలు యంత్రాలు ఐడిల్​గా ఉంటాయి.  20 గంటల పాటు నడిపించేందుకు ఉద్యోగులు, కార్మికులు కృషి చేస్తే 20 శాతం బొగ్గు ఉత్పత్తి పెరిగే చాన్స్ ఉందని సింగరేణి యాజమాన్యం పేర్కొంటుంది. 

అండర్​గ్రౌండ్​మైన్స్ లోనూ అంతంతే.. 

అండర్ గ్రౌండ్ మైన్స్ లోనూ యంత్రాల వాడకం కూడా బాగలేదు. ఒక ఎస్​డీఎల్​, ఎల్​హెచ్​డీ మెషీన్లు రోజుకు 14 గంటల పని చేయాలి. కానీ.. 7 – 8 గంటలు మాత్రమే చేస్తున్నాయి. మొత్తం 22 యూజీ మైన్స్ లో  16 చోట్ల 144 ఎస్​డీఎల్​ మెషీన్లు ఉన్నాయి. ఒక ఎస్​డీఎల్​ మెషీన్ రోజుకు 142 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం 28శాతం తగ్గుదలతో 102 టన్నులు మాత్రమే చేస్తోంది. మెషీన్ల  పని గంటలు, కార్మికులు, ఉద్యోగులు 8 గంటల సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే నిర్దేశిత బొగ్గు టార్గెట్లు చేరుకోవచ్చు. అదే ప్రైవేటు ఓబీ కంపెనీలు వందశాతం యంత్రాల పని గంటలను వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. 

అమ్మితే వచ్చేది రూ. 4వేలు 

అండర్ గ్రౌండ్​ మైన్స్ లో ఉత్పత్తయ్యే బొగ్గుకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. ఒక టన్ను వెలికితీయడానికి సుమారు రూ.10వేల వరకు ఖర్చు అవుతోంది. దీన్ని బయట అమ్మితే టన్నుకు రూ.4వేలు మాత్రమే వస్తోంది. అంటే సంస్థ రూ.6వేలు నష్టపోతుంది. ఇందుకు అండర్​గ్రౌండ్​ మైన్స్ లో వాడే మెషీన్ల పనితీరు కూడా కారణమే.  

విద్యుత్​ కేంద్రాలపైనే ఆధారపడిన సంస్థ

సింగరేణిలో బొగ్గు వెలికితీత ఖర్చు కూడా పెరుగుతోంది. అదే మహానది కోల్​ఫీల్డ్స్(ఒడిశా), వెస్ర్టన్​కోల్​ఫీల్డ్స్​(మహారాష్ట్ర) కంటే  సింగరేణి బొగ్గు ధర అధికంగా ఉంటుంది. జీ-5 గ్రేడ్ టన్నుకు రెండు సంస్థల్లో రూ.2,970 ఉంటే..  సింగరేణిలో రూ.5,685 ఉంది. జీ-16 గ్రేడ్​టన్ను రూ.614  అమ్మితే.. సింగరేణిలో రూ.1,620 విక్రయిస్తోంది. ఇలా బొగ్గు ధర అధికంగా ఉండడమే కాకుండా ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా భారంగా మారాయి. అయినా..  రాష్ట్రంతో పాటు పలు దక్షిణాది విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థపై ఆధారపడ్డాయి. ఇక కోలిండియా సంస్థలు తక్కువ ధరకు బొగ్గు అమ్ముతుండగా కొనుగోలుదారులు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. 

మరోవైపు కేంద్రం ప్రైవేటు సంస్థకు బొగ్గు బ్లాక్​లను కేటాయిస్తున్న నేపథ్యంలో త్వరలోనే సింగరేణి సమీపంలో బయట కంపెనీలు పోటాపోటీగా బొగ్గును ఉత్పత్తి చేసిన తక్కువ ధరకు అమ్మే చాన్స్​ ఉంది. దీంతో కూడా గిరాకి తగ్గే ప్రమాదం లేకపోలేదు. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా సింగరేణికి ప్రస్తుతం విద్యుత్ కేంద్రాలు రక్షణగా ఉన్నాయి. సంస్థకు చెందిన జైపూర్​లో 1200 మెగావాట్ల థర్మల్​పవర్​ప్లాంట్​తో పాటు సింగరేణి వ్యాప్తంగా 287 మెగవాట్ల సోలార్​పవర్​ను ఉత్పత్తి చేస్తోంది. 

మరో10 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్​సోలార్ పవర్​ను ఉత్పత్తి చేస్తుండటంతో గతేడాది రూ.500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇతర ఇంధన వనరుల ఏర్పాటుపైనా సన్నాహాలు చేస్తోంది. దీంతో సింగరేణి స్థితిగతులపై కార్మికులు, ఉద్యోగులు అవగాహన పెంచుకొని ఉత్పత్తి వ్యయాలను ఎలా తగ్గించవచ్చో తెలుసు కోవాలని, దుబారా నియంత్రణపై ఆఫీసర్లు దృష్టి పెడితే సంస్థ మనునగడ ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది.