బొగ్గు బాయిల్లో ఊపిరాడ్తలే .. తొమ్మిది నెలల్లో ఆరుగురు మృతి

  • ఎక్కువగా శ్వాస సమస్యలు, గుండెపోటు ఘటనలే
  • గనుల్లో గాలి ఆడటం లేదంటున్న కార్మికులు
  • ఎమర్జెన్సీ సమయంలో  అందుబాటులో ఉండని పరికరాలు  
  • సింగరేణి అధికారులపై కార్మిక సంఘాలు ఫైర్​

 కోల్​బెల్ట్, వెలుగు:  సింగరేణి బొగ్గుబాయిల్లో ఊపిరి ఆడ్తలేదు. ఇటీవల కార్మికులు అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.  గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కన్నా శ్వాస సంబంధ, గుండెపోటుతో చనిపోతున్నవాళ్లే ఎక్కువ ఉంటున్నారు. పది నెలల్లోనే బెల్లంపల్లి రీజియన్ లో ఆరుగురు కార్మికులు చనిపోయారు. వారి మరణాలపై అధికారులు కారణాలు  బయటపెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

మరోవైపు  బయట నుంచి గాలి సరఫరాలో  హెచ్చుతగ్గులు ఉంటున్నాయని, దీంతో కార్మికులు అస్వస్థతకు గురైనప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్​ అందడంలేదని, పైగా పని స్థలం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్ర్టెచర్స్ సైతం​అందుబాటులో ఉంచడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న ఇందారం –1 ఏ గనిలో  ఓ కార్మికుడు చనిపోగా,  బుధవారం మందమర్రి ఏరియాలో కేకే –5 గనిలో మరో కార్మికుడు  మ్యాన్​రైడింగ్​పై నుంచి కిందపడి చనిపోయాడు. ఇలాంటి ఘటనలకు  సింగరేణి యాజమాన్యం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అధికారులకు చెప్పినా ఫలితంలేదు 

బొగ్గు గనుల్లో కార్మికులు సుమారు 300 మీటర్ల లోతుకు వెళ్లి పనులు చేయాలి. అక్కడ  సాధారణం కంటే ఎక్కువ ప్రాణవాయువు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ గాలి సరఫరా సరైన మోతాదులో లేకపోవడంతోనే కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గనుల్లో సరైన వెంటిలేషన్​ సరఫరా  లేకపోవడంతో కార్మికులు  అస్వస్థత పాలవుతుండగా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గనుల్లో వెంటిలేషన్​ ప్రాబ్లమ్ ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎయిర్​క్రాసింగ్స్, వెంటిలేషన్​డోర్స్​ సరిగా ఏర్పాటు చేయకపోవడంతో వెంటిలేషన్​ సమస్యలు తలెత్తుతున్నాయి.  పనిస్థలంలో గాలి ఆడక కార్మికులు మరణిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు డైరెక్టర్​జనరల్​ఆఫ్​ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్​) ఆఫీసర్ల ఎంక్వయిరీతో పాటు పోస్టుమార్టం నివేదికల ద్వారా వెల్లడవుతాయని  సింగరేణి సంస్థ తప్పించుకుంటుంది. 

వైద్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలె 

సింగరేణి సంస్థ కార్మికులకు పీరియాడికల్​మెడికల్​ఎగ్జామ్(పీఎంఈ) నిర్వహిస్తున్నా..  గుండెకు సంబంధిత వ్యాధుల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి సారించడంలేదు. కేవలం ఈసీజీ తోనే కార్మికులను డ్యూటీలకు అనుమతిస్తోంది. పూర్తి వైద్యపరీక్షలు నిర్వహించి గుండె సంబంధిత వ్యాధులకు తగు చికిత్సలు అందించాల్సి ఉంది. అందుకు సింగరేణి ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు నియమిస్తే తగిన ఫలితముంటుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. మరోవైపు సింగరేణిలో క్యాథ్​ల్యాబ్​లను కూడా ఏర్పాటు చేసి పకడ్బందీ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

పని స్థలాల్లో కనిపించని వైద్య సదుపాయాలు 

 బొగ్గు గనుల్లో పని చేసేటప్పుడు అవసరమైన వైద్య సదుపాయాలు కనిపించడం లేదు. అండర్​గ్రౌండ్​, సర్పేస్​లోని ఫస్ట్​ఎయిడ్​ కేంద్రాలను ఓపెన్​ చేసిన దాఖలాలు లేవని కార్మిక సంఘాల నేతలు పేర్కొం టున్నారు.  ఫస్ట్​ ఎయిడ్​ కిట్లు కూడా ఉండవంటు న్నారు.  గని లోపల ఏదైనా ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాపాయస్థితికి చేరుకున్నప్పుడు గని సర్ఫేస్​లో అంబులెన్సుతో పాటు డాక్టర్​ను అందుబాటులో ఉంచాలి. అందుకు భిన్న పరిస్థితు లు ఉన్నాయి. 

యాజమాన్యంలోనూ ఆందోళన 

సింగరేణి కార్మికులకు రక్షణ, ఆరోగ్యపరంగా అవగాహన కల్పిస్తున్నారు.  అయినా తరచూ విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత జనవరి నుంచి ఇప్పటివరకు 4  గని ప్రమాదాలు జరగ్గా.. ఐదుగురు కార్మికులు మృతిచెందారు.  ఇలా ఏటా సగటున ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. గనిలో గాలి ఆడక అస్వస్థతకు గురవడం, గుండెపోటుతో చనిపోయే కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిణామా లు కార్మికులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తున్నా యి.  బెల్లంపల్లి రీజియన్ లోని శ్రీరాంపూర్​, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో తొమ్మిది నెలల్లో ఆరుగురు కార్మికులు చనిపోయారు.