కమర్షియల్ ఇన్ కమ్ పై.. సింగరేణి ఫోకస్

  • షాపింగ్ కాంప్లెక్స్ లు, మల్టీప్లెక్స్ లు, పెట్రోల్ బంక్ ల నిర్మాణాలు
  • పది పెట్రోల్​ బంక్​ల ఏర్పాటుపైనా కసరత్తు
  • వ్యాపార విస్తరణలో సంస్థ అధికారులు బిజీ
  • సర్కార్ ప్రోత్సాహంతోనే అంటున్న సింగరేణి సీఎండీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థ కమర్షియల్ ఇన్ కమ్ పెంచుకునేందుకు షాపింగ్​కాంప్లెక్స్​లు, మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా పది చోట్ల పెట్రోల్​బంక్​లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. బొగ్గు తవ్వకాలతో పాటు ఇటీవలి కాలంలో  సింగరేణి ఇతరత్రా వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మోడ్రన్ మల్టీ ప్లెక్స్ ల  నిర్మాణాలకు ఎస్టేట్​, సివిల్​, సర్వే ఆఫీసర్లతో మేనేజ్ మెంట్ తెప్పించే పనిలో నిమగ్నమైంది. 

కొత్తగూడెం, గోదావరిఖని ఏరియాల్లో..  

ఇప్పటివరకు బొగ్గు తవ్వకం, అమ్మకాలకే పరిమితమైన సింగరేణి కాలరీస్​కంపెనీ ప్రస్తుతం వ్యాపార విస్తరణపైనా ఫోకస్ చేసింది. ఇప్పటికే సోలార్ ​విద్యుత్​ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇథనాల్​తయారీపైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగూడెం, గోదావరిఖని ఏరియాల్లో భారీగా షాపింగ్​ కాంప్లెక్స్ లు, మల్టీ ప్లెక్స్ ల  నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కొత్తగూడెంలో షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మాణాలపై సీఎండీ బలరామ్​కు గతంలోనే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విన్నవించారు. కొత్తగూడెం టౌన్ ఎంజీ రోడ్​లోని సింగరేణి పాత షాప్​లను కూల్చివేసి, కొత్తగా రెండు ఫ్లోర్లతో షాపింగ్​కాంప్లెక్స్​ నిర్మాణాలకు సంస్థ ప్లాన్​ చేస్తోంది.

ఇదే క్రమంలో షాపింగ్ ​కాంప్లెక్స్​సమీపంలో మల్టీ ప్లెక్స్  నిర్మాణాలపైనా ఫోకస్​పెట్టింది. ఇందుకు సంబంధించి సర్వే ఆఫీసర్లతో  సింగరేణి ఎస్టేట్​ ఆఫీసర్లు మాట్లాడి ప్లాన్లు రూపొందిస్తున్నారు. రైల్వే స్టేషన్​సెంటర్ లోని సింగరేణి సూపర్​బజార్​స్థానంలో భారీ షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో గోదావరిఖనిలో మెయిన్​ రోడ్​, మెయిన్ చౌరస్తాల్లోని పాత క్వార్టర్లు, షాపింగ్​ కాంప్లెక్స్​లను కూల్చివేసి మోడ్రన్ షాపింగ్​కాంప్లెక్స్​, మల్టీ ప్లెక్స్  నిర్మించనుంది. వాటి ఏర్పాటుతో ఆయా టౌన్ లు  మరింతగా అభివృద్ధి చెందే చాన్స్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

పది చోట్ల పెట్రోల్​ బంక్​లు 

సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి, ఆర్జీ–1,2,3 ప్రాంతాల్లో పది చోట్ల పెట్రోల్​బంక్​ల నిర్మాణాలపై సంస్థ ఫోకస్​ పెట్టింది. సింగరేణికి చెందిన ఖాళీ స్థలాల్లో పెట్రోల్​బంక్​లను ఏర్పాటు చేయడంపై కార్పొరేట్​ ఎస్టేట్​ ఆధ్వర్యంలో ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఆయిల్​ కంపెనీలతో సింగరేణి అధికారులు చర్చిస్తున్నారు. టెండర్లను కూడా పిలువనున్నారు. 

సీఎండీ ప్రత్యేక దృష్టి

సింగరేణి సంస్థను బలోపేతం చేసే క్రమంలో వ్యాపార విస్తరణపై స్పెషల్​ ఫోకస్​ పెట్టామని సింగరేణి కాలరీస్​ కంపెనీ చైర్మన్​ అండ్​ మేనేజింగ్​డైరెక్టర్​ ఎన్​. బలరాం తెలిపారు. పెట్రోల్​బంక్​లతో పాటు తొలి దశలో కొత్తగూడెం, గోదావరిఖని ప్రాంతాల్లో మల్టీ ప్లెక్స్ లు, షాపింగ్​ కాంప్లెక్స్​ల ఏర్పాటుపై ప్లాన్లు రూపొందిస్తున్నా మని పేర్కొన్నారు.  సింగరేణి అదనపు ఆదాయ వనరులపై దృష్టి పెట్టే విధంగా సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు.