మహాశివరాత్రి పండుగను మార్చి 8న అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పండుగరోజు శివయ్యకు కొన్ని ఆహారాలను నైవేద్యంగా పెట్టవచ్చు. వాటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మహాశివరాత్రి 2024 సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైమ్ ( మార్చి 8) వచ్చేసింది. ప్రతి సంవత్సరం హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసం కృష్ణ పక్షం బహుళ చతుర్ధశి రోజు అర్దరాత్రి మహాశివరాత్రి సందర్భంగా శివకళ్యాణం భక్తి శ్రద్దలతో చేస్తారు. ఈ పవిత్రమైన పండుగ ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన వస్తుంది. శివరాత్రి సమయంలో శివుడు, పార్వతి కలిసి వారి దైవిక యాత్రను ప్రారంభిస్తారని భక్తులు నమ్ముతారు. ఈ రోజునే శివపార్వతులు వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడు, పార్వతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు శివరాత్రి రోజున ఉపవాసాలు చేస్తారు.
ఆదిదంపతుల కలయికకు గుర్తుగా.. వారి ఆశీర్వాదాలను పొందేందుకు ప్రపంచ నలుమూలల నుంచి శివభక్తులు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రాత్రులు జాగారం చేస్తారు. పండుగ రోజు శివునికి ఇష్టమైన వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యం, ప్రసాదంగా చేసే ఏ వంటకాల్లోనూ ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకూడడు. భగవంతుని ప్రసన్నం పొందేందుకు ఏమి నైవేద్యాలు చేయవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పంచామృతం: పంచ అంటే ఐదు. అమృతం అంటే అమృతం. మహాశివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దీనిని కచ్చితంగా తయారు చేస్తారు. దీనిని స్టౌవ్ మీద వండాల్సిన అవసరం లేదు. పెరుగు, పాలు, నీరు, నెయ్యి, తేనెను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటి ఓ గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి.. స్వామికి సమర్పించాలి.
ఖీర్: దాదాపు ఏ పండుగ వచ్చినా.. నైవేద్యంగా ఖీర్‌ను పెడతారు. శివరాత్రి రోజున కూడా మీరు దీనిని తయారు చేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టవచ్చు. అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌ను సన్నగా తరిగి.. నెయ్యిలో వేయించాలి. అనంతరం వాటిని పాలల్లో వేసి ఉడికించి.. డ్రై ఫ్రూట్ర్సు ఖీర్గా చేయవచ్చు. వీటిలో చక్కెర వేయాల్సిన అవసరం ఉండదు. దీనిని స్వామికి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి.
కిచిడీ: శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఉపవాసం విరమించిన తర్వాత తినడానికి ఈ వంటకాన్ని చేస్తారు. అయితే దీనిని స్వామి వారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అయితే ఈ రెసిపీని సగ్గుబియ్యంతో చేస్తారు. సగ్గుబియ్యం నానిన తర్వాత.. ఉడికించిన బంగాళదుంపలు, కరివేపాకు, పల్లీలు ఉపయోగించి ఈ కిచిడీని తయారు చేస్తారు. ఇది పోషకాలతో నిండిన రుచికరమైన ఫుడ్‌గా చెప్తారు.
శ్రీఖండ్: ఇది మహాశివునికి ఇష్టమైన ప్రసాదంగా చెప్తారు. దీనిని తయారు చేయడానికి ముందుగా ఓ కాటన్ క్లాత్‌లో రెండు కప్పుల పెరుగు వేసి.. దానిని గట్టిగా ముడి వేయాలి. దానిలో నీరు పోయేలా వేలాడదీయాలి. పెరుగు పూర్తిగా డ్రై అయ్యిందని నిర్ధారించుకున్నాక.. దానిలో కుంకుమ పువ్వు, పాలు కలిపిన మిశ్రమాన్ని వేయాలి. దానిలో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. క్రీమ్‌గా వచ్చేవరకు కలిపితే చాలా బాగుంటుంది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి నైవేద్యంగా పెట్టేయాలి. ఇది మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గంగా చెప్తారు.