శ్రావణమాసం ...శనివారం ప్రత్యేకత ఇదే.. ఆ రోజు ఏదేవుడిని పూజించాలో తెలుసా..

శ్రావణమాసం అంటే  చాలు ఇంట్లో మహిళలు ఇల్లు సర్దడంలో, పూజాసామాన్లు కొనక్కోవడంలో చాలా బిజీగా సమయాన్ని గడుపు తుంటారు. ఈమాసం మహిళల ప్రత్యేకమాసం అని చెప్పవచ్చు. పేరంటాళ్లతో, చుట్టాలతో, పూజలు, వ్రతాలునోములతో ఇల్లంతా రోజూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు.  నభో అంటే ఆకాశం అని అర్ధం. అంటే అంతటి మహిమాన్వితమైన మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చు.

 వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ముఖ్యంగా పూజాధికాలు నిర్వహించేందుకు అనువైనదిగా చెబుతారు. ఈ మాసంలో లక్ష్మిదేవిని, గౌరీదేవిని, శివకేశవులను( పరమేశ్వరుడిని, విష్ణుమూర్తిని) పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.

శ్రావణమాసంలో  శనివారం( ఆగస్టు 10)న వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శనీశ్వర గ్రహ సంబంధింత బాధలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.  వైఖానస ఆచారాన్ని పాటించే వాళ్ళు విష్ణు పూజలు చేస్తారు. శ్రావణ శనివారం( ఆగస్టు 10) శని భగవానుడిని తైలాభిషేకం చేసి.. నల్ల నువ్వులతో అర్చించాలి.  తరువాత కేజీంబావు తగ్గకుండా  నువ్వులు దానం ఇవ్వాలి. ఆర్థిక స్థోమతను బట్టి దక్షిణ ఇవ్వాలి. అనంతరం వెను తిరిగి చూడకుండా  తలపై స్నానం చేసి.. నువ్వుల నూనెతో దీపారాధన చేసి... ఇష్టదైవాన్ని.. ప్రార్థించాలి.  అనంతరం హనుమంతుని గుడికి వెళ్లి... 108 ప్రదక్షిణలు చేయాలి. అవకాశం ఉంటే ఆకుపూజ కూడా చేయాలి.  ఆ తరువాత శని భగవానుడి భార్య జ్యేష్టాదేవి నివాసం రావి చెట్టు కాబట్టి..  రావి చెట్టు కింద ఆవనూనెతోకాని.. నువ్వుల నూనెతో గాని దీపారాధన చేయాలి.  శ్రావణ మాసంలో చేసిన పూజ వెయ్యిరెట్లు ఫలితాన్ని ఇస్తుందని బ్రహ్మాండపురాణంలో పేర్కొన్నారు. 

ఈమాసానికి శ్రావణం అనే పేరు ఎందుకంటే నవగ్రహాలలో ఒకరైన చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉన్నందున శ్రావణ మాసంగా పిలువబడుతోంది. అలాగే విష్ణుమూర్తి జన్మ నక్షత్రంగా శ్రవణ నక్షత్రాన్ని పేర్కొంటారు. అందుకే ఈ మాసానికి అంతటి విశిష్టత ఉంది. శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసమిది. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు.

ప్రతిరోజూ పండుగే

ఏనెల అయిన  ఒక రోజు ప్రత్యేకం కావచ్చు. ఒక వారం ప్రత్యేకం కావచ్చు. కానీ శ్రావణ మాసంలో ప్రతి రోజూ పండుగే. ప్రతి వారమూ విశిష్టమే. శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం. ఈమాసంలో ముఖ్యంగా సోమవారాలు, మంగళ వారాలు, శుక్రవారాలు, శనివారాలు ప్రత్యేక మైనవిగా చెప్పుకోవచ్చు. మహిళలు కొత్త నోములు, వ్రతాలను ఆచరిస్తారు. కేవలం అమ్మవారిని మాత్రమేకాక శివ, కేశవులిరువురినీ ఈమాసంలో పూజిస్తారు.