రంజాన్‌ పండుగ.. ఉపవాసాల ప్రాముఖ్యత .. ఏంటి...   ఇవే ఇఫ్తార్ విందు వివరాలు ..

ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్. రంజాన్ అనేది ఒక మాసం పేరు. ఈ మాసంలో ముస్లిం సోదరులంతా అతి పవిత్రంగా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు.: ప్రపంచ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల రేపట్నించి  ( మార్చి 12) మొదలు కానుంది. ఇక నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసలు రంజాన్ అంటే ఏమిటి, ఉపవాసాలు ఎందుకుండాలనే వివరాలు తెలుసుకుందాం..
రంజాన్ మాసం ప్రత్యేకత

 రంజాన్‌ను ‘రమదాన్’ అని పిలుస్తారు. అలాగే ‘ఈద్ ఉల్ ఫిత్ర’ అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. దానధర్మాలు చేస్తారు. పండుగ అనేది ఏ మతానికి, కులానికి సంబంధించినది అయినా కావచ్చు, దాని వెనుక అద్భుతమైన సందేశం ఉంటుంది. అలాగే రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం.

రంజాన్ ఎప్పుడు మొదలవుతుంది

రంజాన్ ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్ లో తొమ్మిదవ నెలలో మొదలవుతుంది. రంజాన్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ ఏడాది మన దేశంలో రంజాన్ మార్చి 11 లేదా మార్చి 12న మొదలవుతుంది. మక్కాలో చంద్రుని దర్శనంపై రంజాన్ ఆధారపడి ఉంటుంది. నెలవంక ఆకారంలో చంద్రుడు మొదట సౌదీ అరేబియాలో దర్శనమిస్తాడు. తరువాత భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కనిపిస్తాడు. అలా నెలవంక కనిపించాక రంజాన్ మొదలైనట్టే.

ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెలరోజులు విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా నిష్టగా ఉంటారు. ఆశలకు, కోర్కెలకు కళ్లెం వేస్తారు. ఆత్మను పరిశుభ్రం చేసుకుంటారు. మంచి పనులు, దానాలతో పుణ్యం సంపాదించుకునేందుకు పోటీ పడతారని చెప్పవచ్చు. రంజాన్ నెలలో ఓ వైపు ఉపవాసాలు, మరోవైపు ఖురాన్ పఠనంతో మనస్సు, శరీరం, ఆత్మ అన్నీ పరిశుద్ధమౌతాయి. 

ఖురాన్ లో చెప్పిన ప్రకారం ఈ రమదాన్ నెలలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉపవాసం ఉండాలి. దీన్ని ‘రోజా’ అని పిలుస్తారు. మన దేశంలోని ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి, తెల్లవారిజామున నాలుగు గంటలకు లేచి ‘సహరి’ చేస్తారు. సహరి అంటే భోజనం. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రమదాన్ నెలలో బయట ఏవీ తినకూడదని, తాగకూడదనే ఆచారం ఉంది. అందుకే ఈ నెలంతా ముస్లిం సోదరులు ఇంట్లోనే వండుకొని తింటారు.

ఇఫ్తార్ ..

ప్రతిరోజూ ఇఫ్తార్ సమయాలు సూర్యాస్తమయం మీద ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజూ ఏ సమయంలో సూర్యాస్తమయం అవుతుందో ...అప్పుడు ఇఫ్తార్ నిర్వహించుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఇదే సమయానికి ఇఫ్తార్ అని చెప్పడానికి వీలు లేదు.

ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి

ఇస్లాంలో ఉపవాసాలు రెండవ శకంలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీని గురించి ఖురాన్‌లోని రెండవ సూరా అల్ బఖ్రాలో ప్రస్తావన ఉంది. మీ కంటే ముందు తరంపై ఉపవాసాలు ఎలా విధిగా అమలు చేయబడినవో అదే విధంగా మీపై విధిగావించబడిందని సూరహ్ అల్ బఖ్రాలో ఉంది. మొహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన ఏడాది తరువాత ముస్లింలపై ఈ ఉపవాసాలు విధిగావించబడ్డాయి.

జకాత్ ( దాన ధర్మాలు)

రమదాన్ నెలలో చెప్పుకోవలసిన మరొక విశేషం ‘జకాత్’. అంటే దానధర్మాలు చేయడం. రంజాన్ నెలలో జకాత్ చేయాలని ఖురాన్ చెబుతోంది. సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలన్నది జకాత్ నిర్వచనం. ఇది పేదవారికి ఆర్థిక హక్కుగా కూడా చెప్పుకుంటారు. ప్రతి ధనకుడు ఇలా తన సంపాదనలో 30% పేదలకు దానంగా ఇవ్వాలని జకాత్ చెబుతోంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను నిర్వహించకుంటారన్నది ఖురాన్ సారాంశం.

రమదాన్ నెల... నెలవంక పొడిచాక ముగుస్తుంది. ఆ చివరి దినాన్ని ఈద్-ఉల్-ఫితర్ పండుగగా నిర్వహించుకుంటారు. ఆరోజు అందరూ కొత్త బట్టలతో అత్తరు చల్లుకొని ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈద్ ముబారక్ అని విషెస్ చెప్పకుంటారు.