కార్తీకమాసం శివకేశవులకు చాలా ప్రీతిపదమైన మాసం. ఈ మాసంలో తొలిగా వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.
కార్తీకమాసంలోని శుద్ద ఏకాదశి రోజున శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. ఉత్థాన ఏకాదశి నాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజున (నవంబర్ 23) ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి (నవంబర్ 24) ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారాయణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.
ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో...మనుష్యులు వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు (నవంబర్ 23) చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు.
ఈ రోజు(నవంబర్ 23) ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.
ఈ రోజున (నవంబర్ 23)బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు....
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద! త్యజనిద్రాం జగత్పతే!,
త్వయిసుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్ అని ప్రార్థన చేసి..
ఈ రోజున (నవంబర్ 23) శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం చేయాలి. భాగవతం లోని అంబరీషోపాఖ్యానాన్ని చదవడం.. వినడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. రాత్రి పూట విష్ణునామకీర్తనతో కాలంగడపాలి. తులసి వనంలో గానీ, తులసి కోట దగ్గర గానీ విష్ణుపూజ చేయాలి. ఈరోజు (నవంబర్ 23) చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.