కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు... అంతులేని అదృష్టం

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన రోజు . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం.

మానవాళికి వారిద్దరిని శివుడు, విష్ణువులను కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదని  పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, ఏకాదశి,  పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ పూజలు చేస్తే వచ్చే ఫలితం ఒక ఎత్తు..  పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు అని పండితులు చెబుతున్నారు.  అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి. 

కార్తీకపౌర్ణమి రోజున  (నవంబర్​ 27)  దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో భక్తులు దీపాలు  వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయల మీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి. 

శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

కార్తీకపౌర్ణమి రోజున    ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు వచ్చింది. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది.

 పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ కూడా ఎక్కువ అయిందని పురాణాలు చెబుతున్నాయి. 

 ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి ఆమెతో వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.

కార్తీక  పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో   లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. అప్పుడు లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. 

దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం. 

కార్తీక  పౌర్ణిమ రోజు చేసే నదీ స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్య ప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే టైం లేనివారు ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి . పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతాయి . ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. 

శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు (నవంబర్​ 27)  మరో ప్రత్యేకత.   ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం,  సత్యనారాయణ వ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు 

నవంబర్​ 27 కార్తీక పౌర్ణమి .. సోమవారం రోజు  ప్రత్యేకంగా చేయవలసినవి 

  •  దైవ దర్శనం 
  •  దీపారాధన
  •  దీపదానం 
  • సాలగ్రామ దానం 
  • దీపోత్సవ నిర్వహణ 

ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని పండితులు చెబుతున్నారు. 

వైజ్ఞానిక పరంగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యపరంగా చూస్తే- ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణలు చెబుతున్నారు.