జూన్​ 7 నుంచి జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన పూజలు ఇవే....

తెలుగువారికి కొత్త ఏడాది చైత్రంతో మొదలై ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠమాసం. మే 20 నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది..ఈ నెల విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

 చైత్రం, వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణాలకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ఎన్నో ప్రత్యేకమైన రోజులున్నాయి...

దశపాపహర దశమి: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. ఆ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెబుతారు. అందుకే ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు.వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ. ఆ రోజున నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి, బెల్లం నదిలో వేయాలి. అలాగే చేపలు, కప్పలు, తాబేలు లాంటి జలచరాల రజత ప్రతిమలను నీటిలో వదలడం విశేష పుణ్యదాయకం. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుందని చెబుతారు.

నిర్జల ఏకాదశి : జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవితకాలానికి సరిపడా పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి, మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం  "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల ఏకాదశి అంటారు. 

దశహరా: జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఆరోజు నది స్నానాలు చేయాలి. ఆ అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం.

మహాజ్యేష్టి: జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఆ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. జ్యేష్ఠ  పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. 

వటసావిత్రి వ్రతం: జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయని భక్తుల విశ్వాసం. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యువు దరిచేరదు. యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి