జూన్ 1 హనుమత్ జయంతి: భక్తికి.. బలానికి ప్రతిరూపం ఆంజనేయుడు

హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి. ఇందులో హనుమాన్‌ జయంతి సైతం ముఖ్యమైన పండుగ. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. జూన్ 1 శనివారం  ఊరూరా, వాడవాడనా యావత్‌ దేశవ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి.

హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపరంగా భావిస్తారు. సముద్రాన్ని లంఘించి లంకకు చేరి సీతమ్మవారి జాడ కనిపెట్టారు. సంజీవనీ పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు. హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు నిర్వహిస్తూ వస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి హనుమాన్‌ జయంతిని జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్‌ జయంతిని జరుపుకుంటుండగా.. మరికొందరు మరికొందరు వైశాఖమాసం దశమినాడు  ( జూన్ 1) హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి నిర్వహిస్తారు.

హనుమాన్‌ జయంతిన సందర్భంగా స్వామి భక్తికి, బల సంపన్నతకు సంకేతంగా హనుమంతుడి విశేషాలను స్మరించుకోవాలి. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయినా మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి సేవలో గడిపేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీరాముడు అంటే ఆంజనేయస్వామి ఎనలేని భక్తి. ఎంతలా అంటే తన హృదయాన్నే మందిరంగా చేసి ఆరాధించాడు. మారుతి గుండెలను గుండెను చీల్చి చూపించగా.. సీతారాములే దర్శనమిచ్చారు. ఒకానొక సమయంలో సీతమ్మవారు నుదుటన సింధూరం పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ‘నుదుటు సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా’ అని అడిగితే.. సీతమ్మ తల్లి నవ్వుతూ ‘శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని’ అని చెబుతుంది. అది విన్న మారుతి ఒక్క నిమిషం ఆలోచించకుండా తన ఒళ్లంతా సింధూరు పుసుకున్నాడు. అది రాముడిపై హనుమంతుడికి ఉన్న నిరుపమానమైన భక్తిని తెలుపుతుంది. ఇలా రాముడిపై హనుమంతుడి భక్తిని చేటేలో ఎన్నో తార్కాణాలున్నాయి.

ఒక సందర్భంలో హనుమంతుడికి సీతమ్మవారు హారాన్ని బహూకరించింది. దాన్ని తీసుకున్న హనుమ.. హారంలోని ఒక్కో పూసను కొరికి కొరికి చూసి విరివేయసాగాడు. ఇదేంటి హనుమా అలా చేస్తున్నావని ప్రశ్నించగా.. ‘రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని చూశాను.. నా స్వామిలేని రత్నాభరణాలతో నాకేం పని ’ అని చెప్పాడు. హనుమంతుడి నిరుపమానమైన భక్తికి ఇంతకంటే ఇంకేం కొలమానం కావాలి. రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి లంకను దాటి సీతమ్మ జాడను తెలుసుకున్నారు. అశోకవనంలో ఉన్న అమ్మవారిని కలుసుకొని శ్రీరాముడు ఇచ్చిన అంగుళీయకం చూపి.. ధైర్యంగా ఉండాలని ధైర్య వచనాలు చెప్పారు. అంతే కాకుండా లంకాదహనం చేసి చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఘన విఖ్యాతిని గడించాడు మారుతి.

వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో ప్రయాణించగలడు. పర్వతాలను చేతితో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను సైతం పారద్రోలుతారు. శ్రీరాముడి నమ్మినబంటు హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంతో ధైర్యం, స్థయిర్యం కలుగుతాయి. భయాలు.. చింతలు, చిరాకులు తొలగిపోతాయి. చేపట్టే ప్రతి కార్యంలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు చేకూరుతాయి. నిత్యం హనుమంతుడి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు