గుడ్​ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...

 యేసు క్రీస్తు వారిని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు.

యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 28న వచ్చింది. కల్వరి గిరి మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. అందరూ ఆరోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే గా పిలుస్తారు.

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

లోక రక్షణ కోసం యేసుక్రీస్తు వారు తల్లి మరియ గర్భాన జన్మించారు. ప్రజలను చెడు నుంచి మంచివైపు నడిపించడం కోసం శ్రమించారు. దైవ కుమారుడైన యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు. పాపాలు చేస్తున్న వారిని సన్మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నించాడు. ఆయన వెంట ఎప్పుడూ 12 మంది శిష్యులు ఉంటారు. ప్రభు బోధనలు వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు.అయితే ప్రజలందరూ యేసుక్రీస్తు మాటలకు ప్రభావితమవుతున్నారని రోమీయులు కక్షగడతారు. ఎలాగైనా ఆయన్ను అణిచివేయాలని చూస్తారు. రోమా సైనికులకు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు సహాయం చేస్తాడు. అతడు డబ్బు మనిషి. యూదుల రాజుగా తనని తాను ప్రకటించుకున్నాడని అబద్ధపు నింద మోపి యేసుక్రీస్తుని రోమా సైనికులకు అప్పగిస్తాడు.

ఇస్కరియోతు చేసే ద్రోహం గురించి యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఆయన ప్రజలను పాపాల నుంచి రక్షించడం కోసం ప్రాణత్యాగం చేయాలనేది తన కర్తవ్యంగా భావించారు. గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులు అందరికీ యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు. మరుసటి రోజు గెత్సెమని తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తుని బందీగా చేసుకుంటారు. ఆయన మీద ద్వేషంతో రగిలిపోతారు. యేసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి దుర్భాషలాడుతూ శిలువ వేయాలని గట్టిగా అరుస్తారు. రోమ్ చక్రవర్తి అలాగే శిలువ శిక్ష విధిస్తాడు.

గుడ్ ఫ్రైడే  ఆచారం మరియు సంప్రదాయాలు:
చర్చిల్లో గుడ్ ఫ్రైడేరోజు ప్రార్థనలు చేస్తారు.  బైబిల్​ పఠిస్తూ.. శ్లోకాలు.. శిలువ వృత్తాంతాన్ని  ప్రసంగాల ద్వారా  తెలుసుకుంటారు.  కొంతమంది క్రైస్తవులు ఉపవాసం పాటిస్తారు.  వారి ఆచారం ప్రకారం దేవుడిని ప్రార్థిస్తూ ..ఏసు క్రీస్తు గురించి గ్రంథాలు చదువుకుంటారు.  బహిరంగ ప్రదేశాలు, చర్చిల్లో శిలువ చిత్రాలు.. ఏసు శిలువ వేయడానికి దారితీసిన సంఘటనలు ధ్యానిస్తారు. కొంతమంది  ఆరాధకులు యేసు త్యాగానికి చిహ్నంగా  శిలువను ముద్దుపెట్టుకోవడం ... వంగి నమస్కరించడం ద్వారా పూజిస్తారు.

 గుడ్ ఫ్రైడే అనేది దాతృత్వ చర్యలకు మరియు తక్కువ అదృష్టవంతులకు చేరువయ్యే సమయం, ఇది ప్రేమ మరియు సేవకు సంబంధించిన యేసు బోధనలను ప్రతిబింబిస్తుంది.
యేసుక్రీస్తు వారు శిలువ మీద ఏడు మాటలు పలికారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆ ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. తమని పాపాల నుంచి రక్షించడం కోసం యేసు క్రీస్తు అనుభవించిన బాధను తలుచుకుంటారు.

మొదటి మాట: తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము
రెండో మాట:  నీవు కూడా నాతో పరదైశులో ఉంటావు
మూడో మాట: యోహాను అనే శిష్యుడిని తన తల్లికి చూపిస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు.. శిష్యుడి వైపు చూస్తూ ఇదిగో నీ తల్లి
నాలుగో మాట: యేసు బిగ్గర శబ్దంతో ఏలోయి ఏలోయి లామా సభక్తామి అని అరిచాడు అంటే ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి
ఐదో మాట: నేను దప్పిగొనుచున్నాను
ఆరో మాట: యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తలవంచెను
ఏడో మాట: గట్టిగా కేక వేస్తూ.. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచెను.