హిందూ మత విశ్వాసాల ప్రకారం, గౌతమ బుద్ధుడు వైశాఖ మాసంలో శుక్ల పక్షం పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకే ఈరోజున బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు.తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం, ఈ పర్వదినాన చెట్లను నాటడం వల్ల గురు, శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట. ఈ సందర్భంగా బుద్ధ పూర్ణిమ రోజున ఏ పనులను చేస్తే శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
బుద్ధ పూర్ణిమ రోజున ( మే 23) రావిచెట్టును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి, ఎందుకంటే ఈ చెట్టులో శ్రీ మహా విష్ణువు నివాసం ఉంటారని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, బుద్ధ పూర్ణిమ రోజున రావిచెట్టును పూజించడం వల్ల పూర్వీకుల ఆత్మ కూడా శాంతిస్తుందని చాలా మంది నమ్మకం. దీన్నే మహా వైశాఖి, వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజునే బద్ధుడు జన్మించాడని నమ్ముతారు. . ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేసిన అనంతరం విష్ణుమూర్తిని పూజించాలి. ఆ తర్వాత మీ శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి.
రావి చెట్టులోనే..హిందూ పురాణాల ప్రకారం, రావి చెట్టులో ముక్కోటి దేవతలు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు నివసిస్తారు. అందుకే బుద్ధ పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధాన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మరోవైపు జ్యోతిష్యం ప్రకారం, జాతకంలో గురు, శని గ్రహాల ప్రభావం తగ్గి.. శుభ ఫలితాలొస్తాయి.
పూర్వీకుల ఆత్మకు శాంతి..రావి చెట్టుకు నీళ్లలో పాలు, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకుల ఆత్మకు మోక్షం కలిగి, వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పూర్వీకులు కూడా ఈ చెట్టులో ఉదయాన్నే నివాసం ఉంటారని చాలా మంది నమ్ముతారు. సూర్యోదయం తర్వాత లక్ష్మీదేవి నివసించడం ప్రారంభిస్తుంది. అందుకే సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
శుభ కార్యాలు..వైశాఖ పౌర్ణమి వేళ శుభ కార్యాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున రావి చెట్టును పూజించిన తర్వాత ఏ సమయంలో అయినా ఎలాంటి ముహుర్తం గురించి పట్టించుకోకుండా శుభకార్యాలను ప్రారంభించొచ్చని పండితులు చెబుతారు.
సకల శుభాలు కలుగుతాయి..ఎవరి జాతకంలో అయితే వితంతు యోగం ఉంటుందో.. వారు రావి చెట్టుతో పెళ్లి తంతు జరపడం ద్వారా వితంతు యోగం తొలగిపోతుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అశుభాలను తొలగించి, సకల శుభాలు కలిగిస్తాడని చాలా మంది నమ్ముతారు. అలాగే సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి, చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల గురుడు, శని గ్రహాల నుంచి శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు మీ జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.