ఆగస్టు 4 న ఇలా చేయండి.. పితృదేవతలు శాంతిస్తారు

Ashadha Amavasya 2024:  ఆషాఢ అమావాస్యను భీమ అమావాస్య అని కూడా అంటారు. ఈ ఏడాది ఆషాడమాసం జూలై 6 న ప్రారంభం అయింది.. ఆగష్టు 4న అమావాస్య వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
 
ఆషాడ అమావాస్య, భీమ అమావాస్య, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య ...ఎలా పిలిచినా ఒకటే. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఆగష్టు 4 ఆదివారం వచ్చింది. ఆషాఢమాసం, ఆదివారం అత్యంత పవర్ ఫుల్ అని చెబుతారు పండితులు. 

ఆషాఢ అమావాస్య  ప్రాముఖ్యత 

హిందూ మతగ్రంధాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృ తర్పణాలిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఈ రోజు పవిత్ర స్థలాలను సందర్శించి..నదీ స్నానం ఆచరించి పిండప్రదానాలు చేస్తారు.  ఈ రోజు పెద్దల పేరుతో  చేసే దాన , ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు.  

ఆషాఢ అమావాస్య 2024  ఘడియలు ఇవే

ఆగష్టు 03 శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభై... ఆగష్టు 04 ఆదివారం మధ్యాహ్నం  3 గంటల 54 నిముషాలవరకూ ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగష్టు 04న ఆషాడ అమావాస్య వచ్చింది.  

ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలి?

ఆ రోజు ( ఆగస్టు 4)  పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి.  పితృపూజ చేసి, తర్పణాలు విడిచిపెట్టి..అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం (స్వయంపాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు...etc), వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీశ్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు..ఈ రోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి...అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూలచెట్టుకింద ఆవనూనెతో దీపం వెలిగించాలి.  

ఆషాఢ అమావాస్య పూజా ఇలా చేసుకోండి

ఆషాఢ అమావాస్య రోజు..ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫొటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిళ్వపత్రం...పార్వతీ దేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజకోసం వినియోగించవచ్చు. అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టుపెట్టి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు.

 
అమావాస్య రోజు ఇవి వద్దు

  • నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు
  • లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు 
  • నూతన వ్యాపారం, ఉద్యోగం..నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు
  • నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు
  • కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి..దాన ధర్మాలు మాత్రమే చేయాలి.